రాజ్ గిర - పోషకాహార ఘని రాజ్ గిర అంటే తోటకూర గింజలు పోషకాహారంగా, మార్కెట్ విలువగా, తక్కువ నీటితో పెరిగే ప్రత్యేక ధాన్యం. మన సమీకృత పోషకాహారంలో ఆకుకూరలు చాలా ముఖ్యమైనవి. మన సాంప్రదాయ ఆకు కూరలలో పోషక విలువల పరంగా తోటకూర కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే తోటకూరను ఆకు కోసమే కాకుండా గింజ కోసం కూడా సాగు చేస్తారు. తోటకూర గింజ లు చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ, పోషక విలువలు మాత్రం గణనీయంగా ఉంటాయి. ఈ గింజలలో ప్రోటీన్స్, లిపిడ్స్, ఖనిజాలతో పాటు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు (లైసిన్, మితియోనిన్, సిస్టిన్, ఐసొల్యూసిన్) కూడా ఉంటాయి. అలాగే ఈ గింజలలో ఇనుము, బీట కేరోటీన్ కూడా ఉంటుంది. అందుకే ఈ గింజలను ఆహారంలో చేర్చు కోవడం వలన శరీరంలో ఇనుము, విటమిన్ ఎ లోపంను నివారించుకోవచ్చు. ఫోలిక్ ఆమ్లం కూడా అధికంగా ఉండడం వలన రక్తం లోని హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుకోవచ్చు. రాజ్ గిర ప్రయోజనాలు : తోటకూర లేత ఆకులను ఆకు కూరగా ఉపయోగించుకోవచ్చు, గింజలతో విలువాధారిత ఉత్పత్తులైన బిస్కట్లు, లడ్డులు, బర్ఫీ, పంజీరి లాంటివి తయారు చేసుకోవచ్చు. ఫైబరు అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ మెరుగవడానికి అలాగే మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఈ గింజలను ఆహారంలో చేర్చుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెకి రక్షణ కలిగిస్తుంది యాంటిఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉండటం వలన శారీరంలో హానికరమైన మూలకాలను తొలగించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది తోటకూర గింజల పిండిని, మొక్కజొన్న, రాగి పిండితో కలిపి చపాతి తయారు చేసుకోవచ్చును ఇంకా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో కూడా తోటకూర కి ప్రత్యేక స్థానం ఉంది. ప్లాస్టిక్, సౌందర్య సాధనాలు, ఫార్మాస్యూటికల్, సహజ రంగుల తయారీలోను తోటకూరను ఉపయోగిస్తారు తోటకూర గింజల నుండి తీసిన నూనె కంప్యూటర్ డిస్క్ కోసం కందెన లాగ వాడుకోవచ్చు పశుగ్రాసం గా కూడా వాడుకోవచ్చు. గిరిజనులు ఈ తోటకూర గింజల ను పాముకాటు వ్యాధి నివారణకు విరుగుడు గా వినియోగిస్తారు. రాజ్ గిర (గింజ తోటకూర) సాగు విధానం గింజ కోసం సాగు చేయడానికి ప్రత్యేకమైన రకాలను ఉపయోగిస్తారు. గింజ తోటకూర రకాలు : సువర్ణ, కపిలాస, ఫూలే కార్తికి, కె.బి.జి.ఎ.-1, ఆర్.ఎం. ఎ.-7. కె.బి.జి.ఎ.-4, కె.బి.జి.ఎ.-15, జి.ఎ- 1,జి.ఎ- 2,జి.ఎ-3, జి.ఎ-4,జి.ఎ-5 అనే రకాలను విరివిగా ఉపయోగిస్తారు.నేలలు: నీరు నిల్వ ఉండని, పి.ఎచ్. 6.0-7.0 ఉన్న నేలలు బాగా అనుకూలం.నేల తయారీ : తోటకూర గింజ లు చాలా చిన్నవి గా ఉంటాయి కాబట్టి, 4-5 సార్లు బాగా దుక్కి దున్ని, చదునుచేసుకోవాలి.విత్తే సమయం: ఈ విత్తనాన్ని వానాకాలంలో జులై నుండి ఆగష్టు వరకు లేదా యాసంగిలో కాని విత్తుకోవచ్చు.విత్తన మోతాదు, విత్తే దూరం: ఎకరాకు 600-800 గ్రా. విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య దూరం 45 సెం. మీ. వరుసలలో మొక్కల మధ్య దూరం 15 సెం. మీ. ఉండేలా విత్తుకోవాలి.ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 6-8 క్వి. పశువుల ఎరువును విత్తే ముందు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. ఎకరాకు 52 కిలోల యూరియా, 100 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేట్, 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. సగం యూరియా అనగా 26 కిలోలు, మొత్తం సింగల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ్న విత్తే ముందు, మిగతా సగం యూరియాని విత్తిన 30 రోజులకు వేయాలి.అంతర కృషి: పెండిమితాలిన్ 1.2 లీ. /ఎకరాకు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేస్తే 30 రోజుల వరకు కలుపు లేకుండా చేయవచ్చు. తరువాత పనిముట్ల సహాయంతో కూలీల తో కలుపును తీసివేస్తే, కలుపు బెడద లేకుండా పంటను రక్షించవచ్చు.సాగు నీటి యాజమాన్యం: విత్తిన వెంటనే నీరు పెట్టాలి. భూమిలో తేమను బట్టి 7-10 రోజుల వ్యవధితో నీరు కట్టాలి. సరియైన సమయంలో నీరు అందించడం వలన మంచి దిగుబడులు పొందవచ్చును. తోటకూరలో సస్యరక్షణ నారుకుళ్ళు తెగులు: ఈ వ్యాధి వలన విత్తనాలు మొలకెత్తక ముందే మట్టిలో కుళ్ళిపోవచ్చు లేదా మొలకలలో కాండం కుళ్ళు /రూట్ నెక్రోసిస్ ఫలితంగా మొక్కలు కుళ్లిపోతాయి. ఈ వ్యాధి నివారణకు భూమిలో లోతుగా విత్తనాలను విత్తుకోకూడదు. అలాగే సరియైన విత్తన దూరం పాటించాలి. అలాగే మోతాదుకు తగ్గట్టుగ నీరు అందించాలి.పక్షి కన్ను తెగులు: ఈ వ్యాధి వలన ఆకుల మీద మచ్చలు ఏర్పడి. ఫలితంగా ఆకులు, కొమ్మలు ఎండిపోయి రాలిపోతాయి. మొక్క భాగాలకు గాయాలు తగలకుండా చూసుకున్నట్లయితే, ఈ వ్యాధి భారిన నుండి తప్పించుకోవచ్చు.తెల్లమచ్చ తెగులు: ఆకు అడుగుభాగాన తెల్లటి బుడిపెలు వంటివి ఏర్పడతాయి. ఆకు పై భాగాన లేత పసుపురంగు మచ్చలు ఏర్పడి పండుబారి పోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఆకు అడుగు భాగం తడిచేలా చూడాలి.ఆకుతినే గొంగళి పురుగు: చిన్న, పెద్ద పురుగు, ఆకును కొరికి వేయడం వల్ల మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు. వీటి నివారణకు మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కలేత దశ నుండి వేప సంబంధిత పురుగు మందులను 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసినట్లయితే పురుగులు ఆశించవు.పేనుబంక: పేనుబంక ఎక్కువగా లేత చిగురాకుల పై గుంపులుగా ఆశించి రసాన్ని పీల్చి నష్టం కలుగ జేస్తాయి. లేత మొక్కలు ఐతే చనిపోతాయి, తరువాతి దశలో ఆశిస్తే విత్తనం నాణ్యత తగ్గిపోతుంది.దిగుబడి: సుమారుగా ఒక ఎకరానికి 8 -10 క్వి. తోటకూర గింజల దిగుబడి వస్తుంది.నికర ఆదాయం: సాగు వ్యయం ఒక ఎకరానికి దాదాపుగా రూ.15,000/- నుండి రూ.16,000/-వరకు వస్తుంది. ఆదాయం రూ.32,000/- నుండి రూ.40,000 వరకు వస్తుంది. నికర ఆదాయం రూ.17,000 నుండి రూ.24,000/- వరకు పొందవచ్చును. పట్టిక 1 : ఇతర పంటలతో పోలిస్తే తోటకూర గింజలలో ఉండే పోషక విలువల శాతం (%) పంట ప్రోటీన్ (%) పిండి పదార్థాలు లిపిడ్స్ (%) ఖనిజాలు (%) తోటకూర 16.0 62.0 8.0 3.0 గోధుమ 12.0 69.0 1.7 2.7 వరి 6.7 78.0 0.3 0.3 మొక్కజొన్న 11.0 66.0 3.5 1.1 బార్లీ 11.0 69.0 1.3 1.9 పట్టిక 2 : ఇతర పంటలతో పోలిస్తే తోటకూర గింజలలో ఉండే అమైనో ఆమ్లాల సమ్మేళనం (గ్రా./100 గ్రా. ప్రోటీన్) అమైనో ఆమ్లాలు తోటకూర గోధుమ వరి మొక్కజొన్న బార్లీ లైసిన్ 5.0 2.8 3.8 2.9 3.0 మిథియోనిన్ 4.0 1.5 2.3 3.4 3.2 సిస్టిన్ 4.0 2.2 1.4 3.4 3.7 ఐసోల్యూసిన్ 3.0 3.3 3.8 4.1 4.0 ల్యూసిన్ 4.7 6.7 3.2 13.0 7.5 ఆధారం: పాడి పంటలు మాస పత్రిక ఎ. సరిత, జి.సంతోష్ కుమార్, ఈ.ఉమారాణి, డి. శ్వేత, ఎ. రమాదేవి, సిహెచ్. పల్లవి వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం, తోర్నాల, సిద్దిపేట జిల్లా