వాము గింజ సూక్ష్మం..ప్రయోజనాలు స్థూలం వాము ఒక సువాసన గల సూక్ష్మమైన గింజ. గుత్తులు, గుత్తులుగా పువ్వులు ఉంటాయి. ఇటీవలి కాలంలో పట్టణాలు, నగరాల్లోని ఇళ్ళల్లో కూడా ఈ మొక్కలను పెంచుతున్నారు. దీని ఆకులు కూడా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయని గుర్తించారు. మనలో తరచూ వచ్చే కొన్ని సాధారణ రుగ్మతలకు ఇది దివ్య ఔషధం. వాము లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. వాము అంటే ఒక సుగంధ పదార్ధం మాత్రమే కాదు పిండి పదార్ధం, కొవ్వు, ప్రొటీన్లు, కాల్షియం, ఇనుము పుష్కలంగా ఉండే పోషక పదార్ధం. వామును డిస్టిలేషన్ విధానంలో తయారు చేసే అజ్వాన్ ఆయిల్ బాగా ప్రాచుర్యం పొందింది. వాముని నీటి ఆవిరి విధానంలో థైమాల్ క్రిస్టల్స్ (స్పటికాలు) తయారు చేస్తారు. వాము తరచూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని వివిధ పరిశోధనలు రుజువుచేశాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, పైత్యపు వికారాలను తగ్గిస్తుంది. వాము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గించి, అపాన వాయువులను బయటకు పంపిస్తుంది. గుండెకు మంచిది. శరీరం నుంచి వాతాన్ని (వాయువును) హరింపజేస్తుంది. బాలింతల్లో పాల వృద్ధికి దీన్ని ఎక్కువగా వాడతారు. తేనెతో కలిపి కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్రాశయంలో రాళ్ళు కరిగి మూత్రం ద్వారా బయటకు వస్తాయని ఆయుర్వేద వైద్యం చెబుతోంది. వాము గింజలను ఒక గుడ్డ మూటలో కట్టి వాసన పీలుస్తుంటే జలుబు, తలనొప్పి తగ్గే అవకాశముంది. గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలించి ఊస్తే దీర్ఘకాలికంగా ఉండే పంటినొప్పి తగ్గుతుంది. ఆస్తమా పీడితులకు వాము మంచి నివారిణిగా పనిచేస్తుంది. వామును బెల్లంతో కలిపి ఉండలుగా చేసి రోజూ మూడుసార్లు తీసుకుంటే ఒంటి మీద దద్దుర్లు తగ్గుతాయి. అరికాళ్లు, అరి చేతుల్లో చెమటలు (హైపర్ హైడ్రోసిస్) పట్టేవారికి వాము, నువ్వుల నూనె కలిపి ఒక టీ స్పూన్ కొద్ది రోజులపాటు తీసుకుంటే సమస్య తగ్గుతుంది. ఆధారం: పాడిపంటలు