సెన్నా సాగు

మన దేశంలో ఔషధ పంటల సాగు ఒక నిశ్శబ్ద విప్లవంగా మారుతోంది. రసాయన ఔషధాలపై ఆధారపడటం తగ్గించుకోవాలనే ప్రపంచ ధోరణి, సహజ వైద్య పద్ధతుల వైపు పెరుగుతున్న ఆసక్తి, ఇవన్నీ కలిసి ఔషధ మొక్కల సాగుకు కొత్త ఊపిరి పోస్తున్నాయి.ఈ నేపథ్యంలో సెన్నా (Cassia angustifolia) అనే మొక్క రైతులకు బంగారు బాట వేస్తోంది. ఈ మొక్కలో ఉండే Sennosides A & B అనే సహజ రసాయనాలు మలబద్ధకం నివారణ మందుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కారణంగానే సెన్నాకు అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ మార్కెట్లో స్థిరమైన డిమాండ్ ఏర్పడింది. మన దేశంలో ముఖ్యంగా తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో ఈ పంట సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ఇచ్చే పంటగా రైతులకు ఇది ఎంతో అనుకూలమైనది.

ఔషధ ఉపయోగాలు

మలబద్ధకం నివారణ (Constipation): సెన్నా ఆకులు, కాయలు సహజ విరేచన ఔషధాలుగా ఉపయోగిస్తారు. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది.పెద్దపేగు కదలికలను ఉత్తేజితం చేసి మల విసర్జన సులభతరం చేస్తుంది.

జీర్ణక్రియ మెరుగుదల : జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడం, భారంగా ఉండడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

శరీర శుద్ధి (డీటాక్సిఫికేషన్) : శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పంచకర్మ చికిత్సల్లో విరేచన ప్రక్రియకు సెన్నాను ఉపయోగిస్తారు.

పేగుల శుభ్రత (Colon Cleanser) : పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని పూర్తిగా తొలగించడంలో సహాయపడుతుంది. శస్త్రచికిత్సలకు ముందు పేగులను శుభ్రం చేయడానికి ఆధునిక వైద్యంలో కూడా ఉపయోగిస్తారు.

చర్మ రోగాల నివారణ : శరీరంలోని మలినాలు తొలగడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. మొటిమలు, పుండ్లు, దద్దుర్లు తగ్గడంలో సహాయపడుతుంది.

బరువు నియంత్రణలో సహాయం : శరీరంలోని అదనపు మలాన్ని తొలగించడం ద్వారా తాత్కాలికంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. డిటాక్స్ డ్రింక్స్ లో భాగంగా ఉపయోగిస్తారు.

పేగు హానికర బ్యాక్టీరియా నివారణ : పేగుల్లో ఉండే కొన్ని రకాల హానికర బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.

ఎక్కడ, ఎలా పెరుగుతుంది?

సెన్నా సాగు గురించి చెప్పాల్సిన మొదటి విషయం. ఇది ఎండ ప్రాంతాలు, తక్కువ వర్షపాతం, నీటి కొరత. సాధారణ పంటలకు ఇవి శాపాలు. కానీ సెన్నాకు ఇవి వరాలు!

అనుకూల నేలలు : తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇవి అద్భుతంగా పెరుగుతుంది. ఇసుక మట్టి (Sandy loam), నీరు సులభంగా జారిపోయే భూములు అనుకూలం.

విత్తన మోతాదు: ఎకరానికి 6-8 కిలోలు.పంట కాలం: 90-110 రోజులు.ఎక్కువ నీరు కావాలనే పంటలతో కష్టపడే రైతులకు సెన్నా ఒక వరం లాంటిది.

సేద్య పద్ధతులు : పశువుల ఎరువు వాడితే మొక్కలు దృఢంగా ఎదుగుతాయి.

సకాలంలో కలుపు తీయడం దిగుబడిని గణనీయంగా పెంచుతుంది.

రసాయన ఎరువుల అవసరం చాలా తక్కువ-ఖర్చు అదా, పర్యావరణ హితం.

కోత, ప్రాసెసింగ్-నాణ్యత కీలకం :

సెన్నాలో ఆకులు పొట్లాలు (సెన్నా పంటలో ఆకులతో పాటు వచ్చే చిన్న గింజల కవర్లను పొట్లాలు అంటారు) ఔషధ విలువ కలిగిన భాగాలు. ఈ పంటలో అసలు నైపుణ్యం కావాల్సింది కోత తర్వాత ప్రాసెసింగ్.

గమనించాల్సిన ముఖ్య అంశాలు

ఆకులు పచ్చగా, తాజాగా ఉన్నప్పుడే కోయాలి.

నీడలో సరైన విధంగా ఎండబెట్టాలి - నేరుగా ఎండలో వేస్తే ఔషధ గుణాలు తగ్గిపోతాయి.

శుభ్రత పాటించడం మార్కెట్ లో మంచి గ్రేడ్ పొందడానికి తప్పనిసరి.

అధిక నీరు ఇవ్వడం, సరిగ్గా ఎండబెట్టకపోవడం వలనఈ రెండు తప్పులు Sennosides శాతాన్ని తగ్గించి, మార్కెట్ ధరను దెబ్బతీస్తాయి.

ఆర్థిక లెక్కలు-రైతుకు ఎంత మిగులుతుంది?

దిగుబడి- ఎకరానికి 800-1000 కిలోల ఎండిన ఆకులు.

మార్కెట్- హెర్బల్, ఫార్మాస్యూటికల్ కంపెనీలలో స్థిరమైన డిమాండ్.

ధరల స్థిరత్వం - ఇతర పంటలతో పోలిస్తే మార్కెట్ హెచ్చు తగ్గులు తక్కువ.

ఎగుమతి అవకాశాలు- అంతర్జాతీయ మార్కెట్ లో మంచి గిరాకీ.

తక్కువ పెట్టుబడి + తక్కువ నీరు + తక్కువ శ్రమ = మంచి ఆదాయం - ఇదే సెన్నా సమీకరణం.

ముందుకు వెళ్లే దారిప్రపంచవ్యాప్తంగా సహజ ఔషధాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే

శాస్త్రీయ పద్ధతులు అవలంబించడం

నాణ్యత ప్రమాణాలు పాటించడం

మార్కెట్ అనుసంధానం ఏర్పరచుకోవడం

ఈ మూడు అంశాలపై దృష్టి పెడితే, సెన్నా సాగు చిన్న, సన్నకారు రైతులకు కూడా స్థిరమైన ఆదాయ మార్గంగా మారుతుంది. వ్యవసాయంలో కొత్త అధ్యాయం రాయాలనుకునే రైతులకు సెన్నా ఒక సువర్ణావకాశం.

ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ