నీటి పారుదల జిల్లాలో మూడు డివిజన్లతో చిన్ననీటి పారుదలశాఖ కొనసాగుతోంది. దాదాపు 1915 నుంచి కొనసాగుతున్న ఈ శాఖ పరిధిలో 669 చెరువులు, 5538 పంచాయతీరాజ్ చెరువులు, 523 నీటి వినియోగదారుల సంఘాలు, 35 చిన్ననీటి ఎత్తిపోతల పథకాలు, 2718 నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి. వీటన్నింటి కింద దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఆయకట్టు సాగవుతోంది. 2005 నుంచి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు నిర్మాణంలోకి వచ్చాయి. ఈ మూడు ప్రాజెక్టుల కింద దాదాపు 8 నుంచి 10 లక్షలలోపు ఎకరాలకు సాగునీరు అందుతోంది. జూరాల ప్రాజెక్టు పరిధిలో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 19 టీఎంసీల నీరు నిల్వ కలిగిన సామర్థ్యంతో జూరాల ప్రాజెక్టును నిర్మించారు. జిల్లాలో ఆర్డీఎస్ (రాజోలి బండ డైవర్షన్ స్కీం) కింద 84,500 ఎకరాలు సాగవుతోంది. వీటితోపాటు జిల్లాలో కోయిల్‌సాగర్, సరళాసాగర్, వూకచెట్టువాగు వంటి మూడు సాగునీటి పథకాలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా నాలుగు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వాటిలో మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల కింద 3.40 లక్షల ఎకరాల సాగు నీరందించాలని లక్షం. 2004-05లో పథకం రూ. 2,990 కోట్ల అంచనాలతో చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్ కృష్ణా బ్యాక్ వాటర్ నుంచి 25 టీఎంసీల నీటిని వాడుకోవాలన్నది ప్రణాళిక. ఇప్పటి (2012-13)వరకు రూ.2,400 కోట్లు ఖర్చుచేశారు. ఇప్పుడు 13 వేల ఎకరాలకు నీరందుతోంది. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల కింద 50.250 ఎకరాల సాగు నీరందించాలన్నది లక్ష్యం . 3.90 టిఎంసీల నీటిని జూరాల నుంచి తీసుకువచ్చి దీన్ని పూర్తిచేయనున్నారు. రూ. 359 కోట్లతో పూర్తి చేయాలన్నది ప్రణాళిక. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం. మక్తల్ సమీపంలో దీన్ని చేపట్టారు. దీని కింద 2.03 లక్షల ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం. 20 టీఎంసీల నీటిని జూరాల బ్యాక్‌వాటర్‌తో ఈ పథకం కొనసాగించాలన్నది ప్రణాళిక. రూ.2,158.40కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టారు. ఇప్పటి వరకు రూ.1705 కోట్లు ఖర్చు చేశారు. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని నిర్మాణం చేపట్టారు. జూరాల నుంచి 21.425 టీఎంసీల బ్యాక్‌వాటర్‌ను వినియోగించి, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని పంటలకు నీరు అందించాలని ప్రణాళిక రూపొందించారు. 2005-06లో పనులు ప్రారంభించారు. జూరాల ప్రాజెక్ట్ కింద లక్ష 30వేల ఎకరాల్లో పంటలు సాగుకావాలన్నది లక్ష్యం ఇప్పుడు 50వేల ఎకరాలకు మించి ఖరీఫ్ సాగు కావాటం లేదు. కుడి, ఎడమ కాల్వల కింద గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని 8 మండలాలకు సాగునీరు అందుతోంది. జిల్లాలో 680 చెరువులున్నాయి. అన్నీ కూడా 100 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్నవే. వీటి కింద 1,60,694 ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ఇతర వనరుల కింద మరో రెండు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 604.4 మిల్లీ మీటర్లు. ఇక్కడఖరీఫ్లో సాధారణ సాగు 6,86,895 హెక్టార్లు. 2012-13లో 7,16,348 హెక్టార్లలో సాగయ్యింది. రబిలో సాధారణ సాగు 1,99,116 హెక్టార్లుకాగా.. 2012-13లో 1,86,482 హెక్టార్లు సాగయ్యింది. ఆధారము: ఈనాడు ప్రధాన పంటలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 6,11,280 హెక్టార్లలో వ్యవసాయం సాగవుతుంది. రబీ సీజన్లో 1,63,066 హెక్టార్ల భూమి సాగవుతుంది. వివిధ రకాల విత్తనాల కోసం జిల్లా వ్యాప్తంగా 37,517 క్వింటాళ్లు అవసరమవుతోంది. వ్యవసాయం, ఇతర పంటల కోసం ప్రతిఏడాది 1813 లక్షలు రాయితీ రైతులకు లభిస్తుంది. పంటలను చీడ పురుగుల నుంచి కాపాడుకోవడానికి 894.7 క్వింటాళ్ల ఎరువులు ప్రభుత్వ మార్కెట్లో లభించగా, ప్రైవేటు డీలర్ల వద్ద 5183 క్వింటాళ్ల ఎరువులు లభిస్తున్నాయి. వరి, జొన్న, సజ్జ, కంది, పెసర, వేరుసెనగ, పత్తి, ఆముదం పంటలు పండిస్తారు. విస్తీర్ణం- 18.17లక్షల హెక్టార్లు రైతుల సంఖ్య - 7.43 లక్షలు సరాసరి వర్షపాతం - 604.7 మిల్లీమీటర్లు వర్షాధార వ్యవసాయం - 82శాతం కాలువల ద్వారా సాగు - 68,408 హెక్టార్లు బోరు బావుల ద్వారా సాగు - 1,29,711 హెక్టార్లు ఎత్తిపోతల కింద - 3262 చెరువుల కింద - 76511 నేల స్వభావాలు ఎర్రగరప నేలలు 80 శాతం, నల్ల నేలలు 20 శాతం, అడవులు 2.77 లక్షల హెక్టార్లు వ్యవసాయ భూమి - 9.767 లక్షల హెక్టార్లు ఉద్యాన పంటలు - 64, 277 భూమి వినియోగం... మొత్తం భూములు: 18,47,241 హెక్టార్లు అటవీ భూములు: 2,49,930 బంజరు, సాగులేని భూములు: 98,018 వ్యవసాయేతర భూములు: 78,678 పశుగ్రాస భూములు: 23,515 ఇతర భూములు: 7,729 వ్యవసాయ యోగ్యం కానివి: 16,189 సాగులో ఉన్న భూమి: 7,76.706 ఆధారము: ఈనాడు ప్రాజెక్టులు కోయిల్‌సాగర్ దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ మండల రైతుల వరప్రదాయని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు. 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 1949లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌కు శంకుస్థాపన చేశారు. అప్పట్లో రూ.85 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం 1954లో పుర్తి చేశారు. నాటి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కే.యం ఖర్జూ ప్రారంభించారు. నిర్మాణం : డ్యాం పొడవు 274 మీటర్లు, వెడల్పు (గ్రావీటి) 106 మీటర్లు, డ్యాం చుట్లుకొలత 655 మీటర్లు. మొత్తం ఆనకట్ట పోడవు 1036 మీటర్లు. డ్యాం ఎత్తు 27-28 మీటర్లు. ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు ఎడమ, కుడి కాలువల ద్వారా సాగునీరు అందిస్తారు. ఎడమ కాలువ : 14.48 కిమీ పొడవున్న ఈ కాలువకు నీటిని విడుదల చేసే షట్టర్ ఎత్తు 3.5 అడుగులు ఉంటుంది. 60 క్యూసెక్కుల నీరు కాలువలకు విడుదల అవుతుంది. ఈ కాలువ కింద 3000 ఎకరాలు సాగు అవుతుంది. ఏడు గ్రామాలకు చెందిన రైతులు లబ్దిపొందుతున్నారు. కుడికాలువ : ధన్వాడ, చిన్నచింతకుంట మండలాల్లో ఉన్న గ్రామాల గుండా వెళ్లే ఈ కాలువ 25.7 కిమీ ఉంది. 9000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. ఈ కాలువ ద్వారా 15 గ్రామాల రైతులు లబ్దిపొందుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో డ్యాం వెనుకభాగంలో బొల్లారంతోపాటు మరో మూడు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆ సమయంలో 424 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 266 ఇళ్లు మునిగి పోయాయి. మొత్తం జలాశయం 2056 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 2005-06లో కోయిల్‌సాగర్ కింద ఆయకట్టును 50, 250 ఎకరాలకు,విస్తరించాలని తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కృష్ణానది మిగులు జలలాలను కోయిల్ సాగర్‌లో కలిపేందుకు కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకకాన్ని రూ. 360 కోట్లతో చేపట్టారు. నిర్మాణ బాధ్యతలను ఐవీఆర్సీఎల్ కంపెనీకి అప్పగించారు. నిర్మాణ పనులు పూర్తయితే 50వేల ఎకరాలకు సాగు నీరుతో పాటు తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సరళాసాగర్ ఆసియా ఖండంలోనే ఏకైక ఆటో సైఫన్ పద్ధతిగల ప్రాజెక్టు సరళాసాగర్. కొత్తకోట మండలంలో స్వాతంత్య్రానికి పూర్వమే వనపర్తి సంస్థానాదీశుల కాలంలో పెద్దచెరువుగా ఉన్న ఈ జలాశయాన్ని విస్తరించాలని, గ్రామాలు మునిగిపోకుండా వూకచెట్టివాగు నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆశయంతో నిర్మాణం చేపట్టారు. వనపర్తి రాజావారు అప్పట్లో ఉన్న ఇంజినీరు రామకృష్ణారావును సలహా కోరడంతో ఆటోసైఫన్ టెక్నాలజీని వివరించారు. ఆ టెక్నాలజీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉందని వివరించారు. ఈ టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానాన్ని, డిజైన్ పరిశీలించేందుకు రామకృష్ణారావును కాలిఫోర్నియా పంపించారు. ఆయన కాలిఫోర్నియాలో ఆరు నెలలపాటు పరిశీలించి, 1951లో ప్రాజెక్టును రూపొందించారు. రూ.36 లక్షల వ్యయంతో 1959లో నిర్మాణం పూర్తి చేశారు. ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరగానే వుడ్ప్రైమింగ్ సైఫన్ల ద్వారా నీరు ప్రాజెక్టు ముందు భాగం కింది నుంచి కనిపించని కవాటాల ద్వారా బయటకు రావడం విశేషం. నీటి సామర్థ్యం తగ్గగానే మనుషుల ప్రమేయం లేకుండానే సైఫన్లు(కవాటాలు) వాటంతటవే మూసుకుపోతాయి. జలాశయం ద్వారా సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరందించవచ్చు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, బిజినేపల్లి తదితర ప్రాంతాల్లో అధిక వర్షాలు కురిసి వాగులు పొంగి ప్రవహిస్తే ఈ జలాశయానికి నీరు చేరే అరుదైన దృశ్యాన్ని చూడవచ్చు. తీవ్ర వర్షాబావ పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టుకు నీరు నిండండం కష్టమయ్యింది. రైతుల ఇబ్బందులను అధిగ మించాలని 2006లో రామన్‌పాడ్ జలాశయం నుంచి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. రామన్‌పాడు మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీటి వరదాయినిగా ప్రసిద్ధిచెందిన రామన్‌పాడ్ జలాశయం కొత్తకోట మండలంలో ఉంది. కృష్ణానది వూకచెట్టి వాగుపై వనపర్తి సంస్థానాదీశుల కాలం నుంచే ఉన్న ఈ జలాశయం అప్పట్లో సమీప 8 గ్రామాలకు తాగునీరు, నాలుగువేల ఎకరాలకు సాగునీటికి ప్రధానవనరుగా ఉండేది. 1991 తరువాత జూరాల ప్రాజెక్టు ఎడమకాలువ ప్రధాన రిజర్వాయర్‌గా మార్చడంతో దశమారి సాగునీటి విస్తీర్ణం పెరిగింది. చిన్నచిన్న ఎత్తిపోతల పథకాలు అనేకం ఇక్కడి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ జలాశయం నుంచి కొల్లాపూర్ వరకు సాగునీరందించే లక్ష్యంగా ఇప్పటికీ పనులు సాగుతున్నాయి. రామన్‌పాడ్ శాశ్వత నీటి వనరుగా మారడంతో సంస్థానాధీశుల కాలంలో రూపొందించిన బీమా ప్రాజెక్టు ప్రతిపాదన బయటకు వచ్చింది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు వై.ఎస్ సీఎం అయిన తర్వాత రైతుల ముందుకొచ్చింది. సుమారు రూ.800 కోట్లు బీమా ప్రాజెక్టుకు కేటాయించి సగం పనులు పూర్తి చేశారు. నిర్మాణ పనులు పూర్తయితే సుమారు 90 వేల ఎకరాలుకు 1700 క్యూసెక్కులు నీటిని వాడుకొనే అవకాశం ఉంటుంది. 62 కిమీ దూరంలోని జిల్లా కేంద్రానికి, కొత్తకోట, ఆత్మకూర్, మదనాపురం, తదితర పట్టణాలతో పాటు 100కిమీ దూరంలోఉన్న అచ్చంపేటకు తాగునీటిని అందించేందుకు ఇది ప్రధాన వనరుగా మారింది. రూ.2100 కోట్లతో భీమా జలాశయం : 2005లో కృష్ణానదిపై భీమా ప్రాజెక్టు నిర్మించి జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీటిని, 184 గ్రామాలకు తాగునీటిని ఇవ్వాలన్న లక్ష్యంగా పనులు ప్రారంభించారు. కొత్తకోట మండలంలో 1.06 కిమీ పొడవునా సొరంగం పనులు, రెండుచోట్ల ఎత్తిపోతలు సుమారు రూ.400 కోట్లు ఖర్చుతో పూర్తి చేయడం వల్ల ఇక్కడి నుంచి కొల్లాపూర్ నియోజకవర్గం వరకు 90 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని అంచనా. నిర్మాణానికి 2100 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. మొదటి ఏడాది రూ.1400 కోట్లు ఖర్చు చేసి 2008 నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో పనులు పూర్తి కాలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు : నిజాం పాలనలో 60 దశాబ్దల కిందట కర్ణాటక ప్రాంతంలో ఆర్డీఎస్ ప్రాజెక్టును నిర్మించారు. దీనికింద రాష్ట్రంలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై అక్రమ జలాశయాలు, ఎత్తిపోతల పథకాలు నిర్మించడంతో ప్రాజెక్టు కింద కేవలం 25వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. జూరాల ప్రాజెక్టు: 1984లో కృష్ణనది మీద 11టీఎంసీల సామర్థ్యంతో రూ.1200కోట్లతో నిర్మాణాన్ని చేపట్టారు. ప్రాజెక్టు ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. జిల్లాలో 450 గ్రామాలకు తాగునీరందుతుంది. 1990లో ఈ ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ముఖ్యప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల వలసల జిల్లాగా ఉన్న పాలమూరును కొంత వరకు సస్యశామలం చేస్తు అన్నదాతలకు వరప్రదాయనిగా మారింది. నెట్టెంపాడు ప్రాజెక్టు : 2005లో జలయజ్ఞంలో భాగంగా రూ.1428కోట్లతో ప్రాజెక్టును చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. దీని కింద 2లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యం నిర్ధేంచారు. ప్రస్తుతం ప్రాజెక్టులో పనులు దాదాపు 70శాతం పూర్తి అయ్యాయి. సెప్టెంబర్ నాటికి మొదటి పంపు ద్వారా 21వేల ఎకరాలకు సాగునీరందించాలని సాగునీటి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం : నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియెజకవర్గాలకు ప్రయోజనం పొందే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. 1980లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ మొదలైంది. అనేక ఉద్యమాలు జరిగాయి. ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికీ 2004లో జలయజ్ఞం కార్యక్రమంలో మోక్షం కలిగింది. నిర్మాణ లక్ష్యం : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదట్లో రూ. 1500 కోట్లు చంద్రబాబు హయాంలో మంజూరు చేశారు. 2003లో రూ.180 కోట్లకు టెండర్లు పిలిచారు. 2004లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కృష్ణా నది బ్యాక్ వాటర్ నుంచి 25 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఈ పథకం పేరు మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకంగా మార్చారు. ప్రాజెక్టు సామర్థ్యం : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 3.40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాల్సి ఉంది. ఎల్లూరు, జొన్నలబొగడ, గుడిపల్లి గట్లు వద్ద లిప్టులు ఏర్పాటు చేస్తారు. మూడు లిప్టులలో కలిపి మూడు టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి. ప్రాజెక్టుకు 25 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 303 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఎక్కువగా నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియెజకవర్గాలకు నీరు అందుతుంది. ఆధారము: ఈనాడు నదులు కృష్ణా ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరు జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం కృష్ణ వద్ద కృష్ణానది ప్రవేశిస్తుంది. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రాజెక్టు జూరాల వద్ద నిర్మించారు. జిల్లాలో మొత్తం 120 కిలోమీటర్ల మేర కృష్ణానది విస్తరించిఉంది. మక్తల్, గద్వాల, ఆత్మకూరు, కొల్లాపూరు, అలంపూరు నియోజకవర్గాలగుండా జిల్లాలో ప్రవహిస్తుంది. పుష్కరాలు : ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి పుష్కరాలు వస్తాయి.రాష్ట్రంలోనే కృష్ణానది ఇక్కడే మొదలువుతోంది కాబట్టి రాష్ట్రంలోని నలుమూలల నుంచి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కృష్ణ, జూరాల, నదిఅగ్రహారం, బీచుపల్లి, తదితర ప్రాంతాలు పుష్కరాలు నిర్వహించే ముఖ్యమైన ప్రదేశాలు వరదలు : భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చినపుడు దీని కింద మక్తల్, ఆత్మకూరు, గద్వాల, కొల్లాపూరు, అలంపూరు నియోజకవర్గలలోని దాదాపు 20 నది పరివాహక గ్రామాలు ముంపునకు గురువుతుంటాయి. ముఖ్యంగా గద్వాల మండలంలోని గుర్రంగడ్డ గ్రామం నది మధ్యలో ఉండడం వల్ల ఈసమయంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. వీటి కింద దాదాపు పదివేల వరకు ఆయకట్టు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రయోజనాలు : కృష్ణానది మీద జూరాల ప్రాజెక్టును నిర్మించారు. దీనికింద 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు, 450 గ్రామాలకు పైగా తాగునీరు అందుతుంది. తుంగభద్ర జిల్లాలో తుంగభద్ర నది సుమారు 75 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉంది. అలంపూరు, అయిజ, వడ్డేపల్లి, మానోపాడు మండలాల్లోని దాదాపు 30గ్రామాల గుండా తుంగభద్ర నది ప్రవహిస్తుంది. పుష్కరాలు : ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కరాలు జరుగుతాయి. కుటుకునూరు, వేణిసోంపురం, పులికల్, సోంపురం, రాజోళి, పుల్లూరు అలంపూరు ప్రాంతాల్లో పుష్కరాలు నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తారు. వరదలు : తుంగభద్ర నదిలో భారి వర్షాలకు వరదలు వచ్చినపుడు కుటుకునూరు, నసనూరు, రాజోళి, మద్దూరు కేశవరం గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇక్కడ దాదాపు 5వేల ఎకరాల ఆయకట్టు వరద పాలవుతుంది. ప్రయోజనాలు : ఈనదిపై ఆర్డీఎస్, సుంకేసుల ప్రాజెక్టులను నిర్మించారు. వీటి ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు పారుతుంది. అధేవిధంగా 60 గ్రామాలకు తాగునీరు అందుతుంది. కృష్ణా, తుంగభద్ర నడుమ నడిగడ్డ గద్వాల డివిజన్ పరిధిలో కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నాయి. అందుకే ఈ ప్రాంతానికి నడిగడ్డగా పేరొచ్చింది. జడ్చర్ల మండలంలో మీనాంబరం వాగు ప్రవహిస్తోంది. కొండేడు, గుట్టకాడిపల్లి మీదుగా ఈ వాగు మిడ్జిల్ మండలంలోనూ ప్రవహిస్తోంది. కృష్ణానది సుమారు 24 కిలోమీటర్లు, తుంగభద్ర నది 33 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. మక్తల్ నియోజకవర్గంలో కృష్ణానది మాగనూరు మండలంలో తంగడిగి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. దాదాపు 50 కి.మీ. ప్రవహించే ఈ నదిపై భీమా ఎత్తిపోతల పథకం చేపట్టారు. మొత్తం 10 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. దాదాపు 7 వేల ఎకరాలకు సాగునీరందుతోంది. భీమానది భీమానది మాగనూరు శివారులో 7 కి.మీ. ప్రవహించి తంగడిగి వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. దీనిపై ఒకే ఒక్క ఎత్తిపోతల పథకం ఉంది. అది 500 ఎకరాలకు సాగునీరందిస్తోంది. దుందుభి కల్వకుర్తి నియోజకవర్గంలో దుందుభీ నది ప్రవహిస్తోంది. వర్షాకాలంలో మాత్రమే ఈ నది నిండుగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలు కురిస్తే ఈ నది ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. ఆధారము: ఈనాడు