కర్రపెండలం సరైన పోషణతోనే మేలైన దిగుబడి కర్రపెండలం అనేది దుంప పంట, దీని సాగుకు పోషకాలు చాలా అవసరం వంట అవసరాలకు అనుగుణంగా నేలకు సరైన పోషకాలను సరైన సమయంలో సరైన పరిమాణంలో అందించ టమే సరైన పోషకాల నిర్వహణ. తద్వారా దుంప వంటకు కావలసిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఫలితంగా దిగుబడి పెరుగుతుంది. నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, నేలలో వున్న పోషకవనరులు సద్వినియోగం అవుతాయి. నత్రజని లోప లక్షణాలు : ఇది ముదురు ఆకులలో ఎక్కువగా కనిపిస్తుంది. క్రమేణా లేత ఆకులకు వ్యాపించి ఆకు మొత్తం ఏకరీతిగా లేత ఆకువచ్చ లేదా వనుపు రంగులోకి మారుతుంది. మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. నివారణ : సేంద్రీయ ఎరువులను వాడటం, నత్రజని ఇచ్చే చిక్కుడు జాతికి చెందిన పంటలతో పంట మార్పిడితో ఈ లోపాన్ని అధిగమించవచ్చు. భాస్వరం లోప లక్షణాలు: లోపం ఉన్న మొక్కలలో లేత ఆకులు ముఖ్యంగా ఈనెలు, అంచులు ఊదా రంగులోకి మారిపో తాయి. వేర్ల అభివృద్ధి సరిగా లేక మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. నివారణ: కర్రపెండలంలో సిఫార్సు చేసిన ఎరువులను అంతే మోతాదులో భూమిలో వేయాలి. అలానే వర్షాభావ పరిస్థితులలో 1% యూరియా పైరు పై పిచికారీ చేయాలి. పొటాషియం లోప లక్షణాలు: ఇది ముదురు ఆకులలో కనిపిస్తుంది. ఆకుల కొనలు, అంచులు, గోధుమ రంగులోకి మారి కాలిపోయినట్లు కనిపిస్తాయి. మొక్కలు పొట్టిగా ఎక్కువ కొమ్మలతో చిన్నగా ఉంటాయి. వర్షాభావ పరిస్థితులలో ఆకుల అంచులు పైకి వంపులు తిరిగి పసుపు రంగులోకి మారిపోతాయి. ముదురు ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలో నల్లని మచ్చలు కూడా కనిపిస్తాయి. దిగుబడి తగ్గు తుంది. పిండి శాతం తగ్గు తుంది. హైడ్రోజన్ సైనైడ్ ఎక్కువ అవుతుంది. పక్షి కన్ను తెగులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నివారణ : 1% మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను పిచికారీ చేయాలి. అలాగే వర్షాభావ పరిస్థితులలో 5-10 గ్రా, 13-0-45 లిక్విడ్ ఎరువును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ పోషక లోపాన్ని అధిగమిం చడానికి ఎకరాకు 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. మొత్తం భాస్వరం ఎరువు, నాటటానికి ముందు సింగిల్ సూపర్ ఫాస్పేట్ (150 కిలోలు) రూపంలో ఆఖరి దుక్కిలో వేయాలి. నత్రజని (యూరియా), పొటాష్ (మ్యూరేట్ ఆఫ్ పొటాష్) రూపంలో ఎరువులను మూడు సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 90 రోజుల్లో పైపాటుగా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్క చుట్టూ 10 సెం.మీ. దూరంలో వలయాకారపు గాడిలో వేసి మట్టితో కప్పాలి. సూక్ష్మ పోషకాలు లోప సవరణ మెగ్నీషియం లోప లక్షణాలు : ఇది ముదురు ఆకులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపోతుంది. ఆకు కొనలు, అంచుల నుంచి లక్షణాలు మొదలై ఆకు మొదటి భాగంలోకి వస్తాయి. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే పసుపు రంగులోకి మారిన ఆకు భాగాల కణాలు మృతి చెంది గోధుమ రంగులోకి లేదా తెలుపు రంగులోకి మారిపోతాయి. నేలలో పొటాషియం ఎక్కువగా వున్నా కూడా మొక్కలలో మెగ్నిషియం లోపం కనిపిస్తుంది. నివారణ : ఎకరాకు 8 కేజీల మెగ్నీషియం సల్ఫేట్ భూమిలో వేసి కప్పివేయాలి. అలానే 1% మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేయాలి. కాల్షియం లోప లక్షణాలు : లేత ఆకుల కొనలు క్రిందికి వంపు తిరిగి ఉంటాయి. అలాగే కొనలు వాడిగా లేకుండా గుండ్రంగా ఉంటాయి. నివారణ : 0.5% కాల్షియం సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఇనుప లోప లక్షణాలు: లేత ఆకులలో ఎక్కువగా కనిపిస్తుంది. మొదట ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారిపోతుంది. తరువాత మొత్తం ఆకు భాగం (ఈనెలు కూడా) పసుపు రంగులోకి మారిపోతాయి. మొక్క పెరుగుదల కూడా తక్కువగా ఉ ంటుంది. ఆకులు చిన్నవిగా ఉ ంటాయి. ఈ లోపం తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకులు మొత్తం పసుపు లేదా తెలుపు రంగులోకి మారిపోతాయి. నివారణ : ముచ్చెలను 0.5% ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తరువాత నాటుకోవాలి. 0.5% ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. జింక్ లోప లక్షణాలు : ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. లేత పెరుగుతున్న భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, మొక్కల పెరుగుదల తక్కువగా ఉ oటుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారు తుంది. నివారణ: ఎకరాకు 5 కిలోల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పివేయాలి. 1-2% జింక్‌సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తరువాత నాటుకోవాలి. బోరాన్ లోప లక్షణాలు : కణుపుల మధ్య దూరం తక్కువగా ఉండి మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. లేత ఆకులు కుచించిన కాడలతో చిన్నవిగా ఉండి, ముదురు ఆకుపచ్చరంగులో ఉండి ఏకరీతిగా ఉండవు. గోధుమ రంగులో జిగురు వంటి పదార్ధంతో ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తాయి. ముదురు ఆకులు బూడిద, గోధుమ లేదా ఊదా రంగు మచ్చలు కలిగి ఉంటాయి. వేరు వ్యవస్థ పెరుగుదల కూడా దెబ్బ తింటుంది. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే మొవ్వభాగం ఎండిపోతుంది. దుంపలపైన పగుళ్ళు కూడా కనిపిస్తాయి. నివారణ : ఎకరాకు 4 కిలోల బొరాక్స్ భూమిలో వేసి కప్పివేయాలి. ముచ్చెలను 0.5-1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తరువాత నాటుకోవాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక డా.ఎం.జానకి శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం) ఉద్యాన పరిశోధనా స్థానం, పెద్దాపురం, కాకినాడ