గులాబీ గులాబీ పుష్పం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన అలంకార పుష్పం. దీని అందం, పరిమళం, రంగుల వైవిధ్యం కారణంగా గులాబీని 'పువ్వుల రాణి' అని కూడా పిలుస్తారు. రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా, చిత్తూరు, రంగారెడ్డి వంటి జిల్లాల్లో అనేకమంది రైతులు గులాబీని వాణిజ్య పంటగా సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి, ఏడాది పొడవునా విక్రయానికి అవకాశం ఉండటం వల్ల గులాబీ సాగు చిన్న, సన్నకారు రైతులకు కూడా లాభదాయకంగా మారింది. వాణిజ్యపరమైన ప్రాముఖ్యత గులాబీ కేవలం అలంకరణకే కాకుండా అనేక వాణిజ్య అవసరాలకు ఉపయోగ పడుతుంది. ఈ బహుళ ప్రయోజనాల వల్లనే గులాబీ సాగుకు మార్కెట్లో నిలకడైన డిమాండ్ ఉంది. కట్ ఫ్లవర్స్ (కోత పుష్పాలు): పెళ్లిళ్లు, పండుగలు, అలంకరణలకు గులాబీ పూలకు నిత్యం డిమాండ్ ఉంటుంది. హైబ్రిడ్ టీ, ఫ్లోరిబండా రకాలు కట్ ఫ్లవర్ మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతాయి. గులాబీ నూనె (రోజ్ ఆయిల్): పరిమళ ద్రవ్యాల పరిశ్రమలో గులాబీ నూనెకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్. అధిక ధర ఉన్నాయి. రోజ్ వాటర్ : సౌందర్య సాధనాలు, పూజా అవసరాలు, ఆహార పరిశ్రమలో విస్తృతంగా వాడతారు. గుల్కంద్ (Gulkand): తాజా గులాబీ రెక్కలు, పంచదారను సమాన భాగాలుగా కలిపి ఎండలో నిల్వ చేసి తయారు చేస్తారు. గులాబీతో ఇతర ఉత్పత్తులు గులాబీతో జామ్, గుల్ఘన్, పాంకురిలను తయారీ చేయవచ్చు. గులాబీ రేకులతో హెర్బల్ బాత్ సోప్స్, ఫేస్ ప్యాక్‌లు, ఎండిన రేకులతో రోజ్ టీ తయారు చేస్తారు. గార్డెన్ రకాలైన మొక్కలను నర్సరీల ద్వారా విక్రయించడం కూడా అదనపు ఆదాయ మార్గం. గులాబీ పూల తర్వాత వచ్చే పండ్ల (Rose Hips) నుండి విటమిన్-సి లభించే ఆయిల్స్, సప్లిమెంట్లు తయారు చేస్తారు. ప్రధాన తెగుళ్లు వాణిజ్య సాగులో గులాబీ మొక్కలు అనేక శిలీంధ్ర (ఫంగల్), కీటకాల తెగుళ్ల బారిన పడతాయి. వీటిలో నల్ల మచ్చ తెగులు (బ్లాక్ స్పాట్), బూజు తెగులు (పౌడరీ మిల్డ్యూ), తుప్పు తెగులు (రస్ట్) ప్రధానమైనవి. వీటిలో బ్లాక్ స్పాట్ తెగులు గులాబీ సాగుదారులకు అత్యంత నష్టదాయకంగా పరిగణించ బడుతుంది, ఎందుకంటే ఇది ఆకులను త్వరగా రాల్చి మొక్క ఎదుగుదలను, పూల నాణ్యతను గణనీయంగా తగ్గిస్తుంది. నల్ల మచ్చ తెగులు (బ్లాక్ స్పాట్) ఈ తెగులు 'డిప్లోకార్పాన్ రోసే' (Diplocarpon rosae) అనే శిలీంధ్రం వల్ల కలుగుతుంది. వర్షాకాలంలో, అధిక తేమ, ఉష్ణోగ్రత అనుకూ లంగా ఉన్నప్పుడు ఈ తెగులువేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆకుల మీద నీరు ఎక్కువసేపు నిలిచి ఉండటం, గాలి బాగా తగలకపోవడం వంటి పరిస్థితులు ఈ తెగులు వృద్ధికి దోహదపడతాయి. లక్షణాలు : ఆకుల మీద గుండ్రని, నల్లటి లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చల అంచులు చిరిగినట్లు కనిపిస్తాయి. యాజమాన్య పద్ధతులు: తెగులును సకాలంలో గుర్తించి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. తెగులు సోకిన ఆకులను, రాలిన ఆకులను ఎప్పటికప్పుడు తీసివేసి నాశనం చేయాలి. ఇది తెగులు వ్యాప్తిని అరికడుతుంది. మొక్కల మధ్య తగినంత దూరం పాటించి గాలి, వెలుతురు బాగా తగిలేలా చూసుకోవాలి. రసాయన నివారణ: మాంకోజెబ్ (2.5 గ్రా/లీటరు నీటికి) లేదా కార్బెండజిమ్ (1 గ్రా/లీటరు నీటికి) మందులను 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. తెగులు తీవ్రంగా ఉంటే మిశ్రమ మందులు (కాంబినేషన్ ఫంగిసైడ్స్) వాడవచ్చు. జీవ నియంత్రణ: ట్రైకోడెర్మా విరిడి వంటి జీవ శిలీంధ్రనాశినులను నివారణ చర్యగా వాడొచ్చు. పంట మార్పిడి, ఎరువుల యాజమాన్యం సక్రమంగా పాటించి మొక్క రోగనిరోధక శక్తిని పెంచాలి. స్థానిక ఉద్యాన శాఖ లేదా కృషి విజ్ఞాన కేంద్రం (KVK) సూచనల మేరకు మందుల ఎంపిక మోతాదు నిర్ధారించుకోవడం మేలు. ఇతర ముఖ్యమైన తెగుళ్లు క్లుప్తంగా బ్లాక్ స్పాట్‌తో పాటు గులాబీ మొక్కలను ఇతర తెగుళ్లు కూడా ప్రభావితం చేస్తాయి. వీటి గురించి తెలుసుకోవడం రైతులకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఉపయోగపడుతుంది. బూజు తెగులు (పౌడరీ మిల్ల్యూ) ఆకులు, మొగ్గల మీద తెల్లటి పొడి పొర ఏర్పడుతుంది వెట్టబుల్ సల్ఫర్ 0.3% లేదా కార్బెండజిమ్ 0.1% 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకొడం వల్ల ఈ తెగుళ్లను నివారించవచ్చు డై బ్యాక్ (కొనల నుండి ఎండిపోవడం) కొనల నుండి ఎండిపోవడం కాడల కొనల నుండి మొదలై కిందికి క్రమంగా పాకుతుంది ఎండిపోయిన భాగాన్ని ఆరోగ్యకరమైన తెల్లని కణజాలం కనిపించే వరకు కనీసం 2-3 అంగుళాలు కిందికి ఆరోగ్యకరమైన భాగాన్ని కత్తిరించాలి.కట్ చేసిన భాగాలపై మరియు మొక్కపై కాపర్ ఆక్సీక్లోరైడ్ (లీటరు నీటికి 3 గ్రాములు) లేదా కార్బండిజమ్ పిచికారీ చేయాలి లేదా పేస్ట్ పూయాలి.కత్తిరించే కత్తెరను ప్రతిసారి ఉపయోగించే ముందు ఆల్కహాల్ లేదా క్రిమిసంహారకంతో శుభ్రం చేయాలి. బోట్రైటిస్ ఎండు తెగులు మొగ్గలు, పూలు కుళ్లిపోయి బూడిద రంగు బూజు ఏర్పడుతుంది. తడి ఎక్కువ లేకుండా చూసుకోవడం, తగిన శిలీంధ్రనాశిని వాడకం. సూచనలు ఆరోగ్యవంతమైన, తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. తోటలో పరిశుభ్రత పాటించడం ద్వారా చాలా తెగుళ్లను ముందుగానే నివారించవచ్చు. మందుల వాడకంలో మోతాదు. సూచించిన వ్యవధిని కచ్చితంగా పాటించాలి. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఉద్యాన అధికారిని లేదా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించాలి. గులాబీ సాగు సరైన యాజమాన్య పద్ధతులతో చేపడితే మంచి దిగుబడితో పాటు స్థిరమైన వాణిజ్య ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తుంది. తెగుళ్ల పట్ల ముందుజాగ్రత్త, సకాలంలో నివారణ చర్యలు రైతుల నష్టాన్ని తగ్గించి, నాణ్యమైన పూల ఉత్పత్తికి దోహదపడతాయి. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డా. సాయిరత్న శర్వాణి అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఉద్యాన విభాగం) ఉద్యాన కళాశాల, వెంకట రామన్న గూడెం పశ్చిమ గోదావరి.