చిక్కుడుసమగ్ర పోషక, నీటి యాజమాన్యం చిక్కుడు రైతులకు ఆదాయాన్ని అందించే ముఖ్యమైన కూరగాయ పంట. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటంతో పాటు నేల సారాన్ని కూడా పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్ లో వర్షాధారంగా లేదా నీటి పారుదల కింద విస్తృతంగా సాగు చేస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చు. వాతావరణం-నేలలు : చిక్కుడు సాగుకు 20-30°C ఉష్ణోగ్రతలు అనుకూలం. నీరు నిల్వ ఉండని ఇసుక, గరప, ఎర్ర నేలలు మంచి ఫలితాలు ఇస్తాయి. నేల pH 6.5 నుంచి 7.5 మధ్య ఉండాలి. ఖరీఫ్ సీజన్ లో ఉండే వేడి, తేమ వాతావరణం మొక్కల ఎదుగుదల, పూత, కాత ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. విత్తే సమయం : ఖరీఫ్ సీజన్ లో జూన్-జులై నెలల్లో విత్తడం ఉత్తమం. వర్షాకాలం ప్రారంభంలో విత్తితే మొక్కలు బాగా పెరిగి అధిక దిగుబడి ఇస్తాయి. రబీ సీజన్ లో అక్టోబర్-నవంబర్ నెలల్లో కూడా కొన్ని రకాలను సాగు చేయవచ్చు. అయితే తీవ్రమైన మంచు పరిస్థితులు ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. రకాల ఎంపిక : చిక్కుడు రకాలను ప్రధానంగా పొద రకాలు, తీగ రకాలుగా విభజిస్తారు. పొద రకాలు: అర్క జయ, అర్క విజయ్, కో-2, అర్క అమోఘ్, అర్క సౌమ్య వంటి రకాలు తక్కువ ఎత్తులో పెరిగి పందిరి అవసరం లేకుండా 45-60 రోజుల్లోనే కోతకు వస్తాయి. చిన్న స్థలాలు, పెరటి తోటలకు ఇవి అనుకూలం. తీగ రకాలు : డా. వైఎస్సార్ హెచ్‌యూ శ్రేష్ఠ, పూస ఎర్లీ ప్రొలిఫిక్, పూసాసెం-2, పూసాసెం-3, అర్క ప్రసిధి, అర్క భవానీ, పందిరి చిక్కుడు వంటి రకాలు ఎక్కువకాలం కాపు ఇస్తాయి. వీటికి పందిరి అవసరం ఉంది 4-6 నెలల పాటు దిగుబడి అందిస్తాయి. విత్తన శుద్ధి : తెగుళ్ళు, పురుగుల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరి. ప్రతి కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి శుద్ధి చేయాలి. తరువాత రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ వంటి కీటకనాశినిని పట్టించాలి. చివరగా 40 గ్రాముల రైజోబియం కల్చర్‌ను బెల్లం పాకంతో కలిపి విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టాలి. ఇలా శుద్ధి చేసిన విత్తనాలను 24 గంటల్లోపు విత్తితే మంచి మొలకలు, ఆరోగ్యకరమైన మొక్కలు లభిస్తాయి. విత్తన మోతాదు దూరం : పొద రకాలకు ఎకరాకు 12-16 కిలోల విత్తనం అవసరం. వరుసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 15 సెం.మీ దూరం పాటించాలి.తీగ రకాలకు ఎకరాకు 0.8-1.2 కిలోల విత్తనం సరిపోతుంది. వీటికి వరుసల మధ్య, మొక్కల మధ్య కనీసం 1 మీటరు దూరం ఉండాలి. పందిరి విధానాన్ని బట్టి ఈ దూరాన్ని 1.5-2 మీటర్ల వరకు పెంచుకోవచ్చు. ఎరువులు : చివరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీని వల్ల నేల భౌతిక స్థితి మెరుగై వేరు వ్యవస్థ బలపడుతుంది.రసాయనిక ఎరువులుగా ఎకరాకు 20 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ అందించాలి. నత్రజనిలో సగభాగాన్ని విత్తే సమయంలో, మిగిలిన సగాన్ని పూత దశలో వేయాలి. భాస్వరాన్ని మొత్తం విత్తే సమయంలోనే అందించాలి. పొటాష్ ను కూడా బేసల్ డోస్ గా వేయడం వల్ల కాయల నాణ్యత మెరుగుపడుతుంది. భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించడం మరింత లాభదాయకం. నీటి యాజమాన్యం అంతర కృషి : చిక్కుడు పంటలో తేమను బట్టి 10-15 రోజుల వ్యవధిలో నీరు అందించాలి. ముఖ్యంగా పూత, కాయ దశల్లో తేమ తగ్గకుండా చూసుకోవాలి. విత్తిన 25-30 రోజులకు కలుపు తీసి, మొక్కల మొదళ్లలో మట్టిని ఎగదోయడం వల్ల వేర్లు బలపడతాయి. సరైన నీటి యాజమాన్యం, అంతరకృషి పాటిస్తే అధిక దిగుబడితో పాటు నాణ్యమైన కాయలు పొందవచ్చు. చిక్కుడు నిల్వ పచ్చడి: తాజా చిక్కుడు కాయలను బాగా కడిగి, చివర్లు తీసేసి, చిన్న ముక్కలుగా కోయాలి. ఒక గంట నానబెడితే చేదు తగ్గుతుంది. ఆ తర్వాత నీరు పోసి ఉప్పు, పసుపు కలిపి ఉడికించాలి. మసాలా వేపుడు తయారీ : నూనె కాగగానే ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేయాలి. ఆవాలు పేలిన తర్వాత వెల్లుల్లి రేకులు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. చిక్కుడు కలపడం : ఉడికించిన చిక్కుడు ముక్కలు మసాలా లోకి వేసి, పసుపు చల్లి, బాగా కలపాలి. సన్నని మంటపై 5 నిమిషాలు వేయించాలి. నూనె, మసాలా అన్ని వైపులా పట్టాలి.మంట ఆపిన తర్వాత నిమ్మరసం, రుచి బట్టి ఉప్పు కలపాలి. వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కలిపితే బాగా ఇంకుతుంది. నిల్వ చేయడం : పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాజు సీసాలో నింపాలి. నిల్వ పచ్చడికి నూనె కొంచెం ఎక్కువ వేయడం మంచిది. అదే సహజ సంరక్షకం. గది ఉష్ణోగ్రతలో 10-15 రోజులు, ఫ్రిజ్‌లో నెల వరకూ నిల్వ ఉంటుంది. ఆధారం : వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ-పత్రికలు