చిరుధాన్యాల సాగు, రక్షణ మరియు విలువ పచ్చని పొలాల మధ్య తరతరాలుగా మన పూర్వీకులు పండించిన చిరుధాన్యాలు నేడు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామ, వరిగ వంటి చిరుధాన్యాలు కేవలం పొలంలో పండే గింజలు మాత్రమే కాదు అవి మన ఆరోగ్యాన్ని కాపాడే అమృతభాండాలు. వర్షాభావ పరిస్థితులను తట్టుకుని, తక్కువ నీటితో పెరిగి, అధిక పోషకాలను అందించే ఈ పంటలు రైతుకు ఆదాయాన్ని, వినియోగదారుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.ఒకప్పుడు పేదల ఆహారంగా పరిగణించబడిన ఈ చిరుధాన్యాలకు నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం 2023ని "అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం" గా ప్రకటించడంతో వీటి ప్రాముఖ్యత మరింత పెరిగింది. తెలుగు రాష్ట్రాల రైతులకు ఇది సువర్ణావకాశం.చిరుధాన్యాలు సాధారణ ధాన్యాలతో పోలిస్తే పోషకాల విషయంలో చాలా ముందున్నాయి. వీటిలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరంగా మారాయి. కాల్షియం, ఇనుము, జింకు వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉన్నాయి. వేడి వాతావరణాన్ని, కరువును తట్టుకుని పెరుగుతాయి. రసాయన ఎరువులు తక్కువగా అవసరమవుతాయి, ఖర్చు తగ్గుతుంది. ఎరువుల వినియోగం చిరుధాన్యాల పంటలకు రసాయన ఎరువులతో పాటు పశువుల ఎరువు వాడితే నేల సారం పెరిగి దిగుబడులు మెరుగుపడతాయి. కీటకాల నివారణ సాధారణంగా చిరుధాన్యాలలో పురుగుల సమస్య తక్కువే. కానీ ముందస్తు జాగ్రత్తలు అవసరం. జొన్న మొక్క ఈగ: కార్బోప్యూరాన్ గుళికలు విత్తేప్పుడు 7, 14, 21 రోజులకు సైపర్ మెత్రిన్ 1 మి.లీ. లేదా ల్యామ్డ్ సైహలోత్రిన్ 5 సి.ఎస్. 2 మి.లీ. పిచికారీ చేసుకోవాలి. కాండం తొలుచు పురుగు: 35-40 రోజులకు గుళికలు వేయాలి. కత్తెర పురుగు: లింగాకర్షక బుట్టలు + అవసరమైతే ఎమ్మామెక్టిన్ బెంజోయేట్ 50 ఎస్.సి. 80 గ్రా./ఎ. పిచికారీ. సజ్జ వెర్రి తెగులు : విత్తన శుద్ధి (మెటలాక్సిల్) తుప్పు/అగ్గి తెగులు : మాంకోజెబ్ లేదా కార్బండజిమ్ పిచికారీ. రాగి అగ్గి తెగులు : విత్తన శుద్ధి + ట్రైసైక్లోజోల్ పిచికారీ. గులాబీ పురుగు: క్లోరాంట్రానిలిప్రోల్ పిచికారీ. పేనుబంక: డైమిథోయేట్ పిచికారీ. కొర్ర మొక్క ఈగ: ఆలస్య విత్తనంలో విత్తన మోతాదు పెంచాలి అవసరమైతే కార్బోప్యూరాన్ + సైపర్ మెత్రిన్ పిచికారీ. అగ్గి తెగులు: విత్తన శుద్ధి + ట్రైసైక్లోజోల్ పిచికారీ వెర్రికంకి తెగులు: థైరమ్/మెటలాక్సిల్ విత్తన శుద్ధి. విలువ ఆధారిత ఉత్పత్తులు చిరుధాన్యాలను గింజలుగా అమ్మితే వచ్చే ఆదాయం కంటే, వాటిని వివిధ ఉత్పత్తులుగా మార్చి అమ్మితే మూడు నుండి పది రెట్లు అధిక ఆదాయం సాధించవచ్చు. జొన్న ఆధారిత ఉత్పత్తులు జొన్న గింజల నుండి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు. జొన్న రొట్టె పిండి నేడు నగర మార్కెట్లలో అధిక ధరకూ అమ్ముడుపోతోంది. జొన్న పాప్‌కార్న్ పిల్లలకు అత్యంత ఇష్టమైన స్నాక్స్‌గా మారింది. జొన్న బిస్కెట్లు, కుకీలు ఆరోగ్య స్పృహ గల వినియోగదారులలో విపరీతమైన డిమాండ్ కలిగి ఉన్నాయి. జొన్న మాల్ట్ శిశువులకు పౌష్టికాహారంగా వైద్యులే సిఫారసు చేస్తున్నారు. సజ్జ ఆధారిత ఉత్పత్తులు సజ్జ రొట్టె, బాజర్ఘాజీ, రాజస్థాన్, గుజరాత్ తరహాలో తెలుగు రాష్ట్రాలలోనూ ప్రసిద్ధి పొందుతున్నాయి. సజ్జ మాల్ట్ పానీయాలు పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందిస్తాయి. రాగి ఆధారిత ఉత్పత్తులు రాగి కాల్షియంకు గని వంటిది. రాగి జావ శిశువులకు, వృద్ధులకు సర్వోత్తమ ఆహారం. రాగి సంకటి మిక్స్ ప్యాకెట్లు పట్టణ వాసులకు చేరువయ్యే అద్భుతమైన అవకాశం. రాగి లడ్డూలు, హల్వా పండుగలలో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. కొర్ర, సామ, వరిగ సామ, వరిగలను ఉపవాస ఆహారంగా జైన, హిందూ సమాజాలు విరివిగా వాడతాయి కాబట్టి సంవత్సరం పొడవునా డిమాండ్ ఉంటుంది. మిల్లెట్ రైస్ మిక్స్ అన్ని చిన్న చిరుధాన్యాలను కలిపి 'మల్టీగ్రెయిన్ రైస్' పేరిట అమ్మడం లాభదాయకంగా ఉంటుంది. చిరుధాన్యాల నూడుల్స్, ఇన్స్టెంట్ మిక్స్ ప్యాకెట్లు సూపర్మార్కెట్లలో అధిక ధరలకు విక్రయమవుతున్నాయి. మార్కెటింగ్ అవకాశాలు రైతుకు సూచనలువిలువ జోడింపు ఉత్పత్తులు తయారు చేసిన తర్వాత వాటిని సరైన చోట అమ్మడం చాలా ముఖ్యం. స్థానిక రైతు బజార్లు మొదటి అడుగుకు అనువైన వేదికలు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ వేదికలలో మీ ఉత్పత్తులు నమోదు చేయవచ్చు. నగర ఆర్గానిక్ స్టోర్లు ప్రీమియం ధరకు కొనుగోలు చేస్తాయి. FSSAI నమోదు చేసుకుంటే మీ ఉత్పత్తులకు చట్టబద్ధత, నమ్మకం పెరుగుతాయి. చిరుధాన్యాల సాగు కేవలం పంట మాత్రమే కాదు అది మన సంస్కృతి, మన ఆరోగ్యం, మన భవిష్యత్తు. సరైన ఎరువుల యాజమాన్యంతో అధిక దిగుబడి సాధించి, సకాలంలో చీడపీడలు నివారించి, విలువ జోడింపు ఉత్పత్తుల ద్వారా అధిక ఆదాయం పొందండి.పండించిన గింజను ఉత్పత్తిగా మార్చిన రోజే రైతుకు నిజమైన లాభం- ఈ సూత్రాన్ని పాటించి సుసంపన్న జీవితం గడపండి. ఆధారం : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ