ఆగస్టులో వరిలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ప్రస్తుత పరిస్థితుల్లో జూన్, జులైలలో నారుమడులు పోసినవి ఆగస్టు మాసంలో నాటుకు సిద్ధంగా ఉంటాయి. ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులలో ఉన్న నీటిని జీవ తడులకు వాడుకోవాలి. పొటాషియం నైట్రేట్ లేదా (13:0:45) మల్టీ కే లీటరు నీటికి 10 గ్రా. చొప్పున 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. నారుమళ్ళ పోసుకోవడం ఆలస్యమై, ఆగస్టు మాసంలో నారుమడి వేసుకొనే పక్షంలో 120-125 రోజుల కాలపరిమితి కలిగి ఎగుమతికి అనువైన స్వల్పకాలిక రకాలైన యు.ంటి.యు.-1293, యు.ంటి.యు. రైస్ 1290, ఎన్.ఎల్.ఆర్-34449 (నెల్లూరు మసూరి), ఎన్.ఎల్.ఆర్-3354 (నెల్లూరు ధాన్య రాశి), ఎన్.ఎల్.ఆర్ 3238 ఎంపిక చేసుకోవాలి. ప్రధాన పొలాన్ని 3-4 సార్లు దుక్కి చేసి బాగా చదును చేసి నాటుకోవాలి. సాధ్యమైనంత వరకు లేత వయస్సు ఉన్న నారును (25-35 రోజులు) నాటుకోవాలి. ముదురు నారు (40-55 రోజులు) నాటుకొనవలసి వచ్చినప్పుడు నాట్లు దగ్గర దగ్గరగా ఒత్తుగా వేసుకోవాలి. భూసార పరీక్షను అనుసరించి ఎరువులు వేసుకోవాలి. మొదటి దఫా సిఫారసు చేసిన భాస్వరం ఎరువును విధిగా నాట్లుకు ముందుగా ఆఖరి దుమ్మిలో వేసుకోవడం వల్ల త్వరగా మూల తిరిగి ఎక్కువ దుబ్బు చేస్తుంది. ఏ వరి సాగుకైనా భాస్వరం ఎరువును దుమ్మిలోనే వేసుకోవాలి. దుమ్మిలో భాస్వరం ఎరువును వేయని పక్షంలో ఉడ్చిన వెంటనే (5 రోజులలోపు) డి.ఎ.పి. రూపంలో గాని లేదా భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందించవచ్చు. భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా పిలకల దశలో మరియు అంకురం ఏర్పడే దశలో వేయరాదు. నాటు పద్ధతిలో సిఫారసు చేసిన నత్రజని మూడు సమ భాగాలుగా మొదటిసారి నాటడానికి ముందు, రెండవసారి పిలక దశలో, మూడవసారి అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. సిఫారసు చేసిన పొటాష్ ఎరువును సగం మొదటి దఫాలో, మిగతా సగం అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. చౌడు భూములలో వరి సాగు దుమ్మి చేసిన తరువాత మంచి నీటిని పెట్టి 2 నుండి 3 సార్లు నీరు బయటకు తీసి వేయాలి. చౌడును తట్టుకొనే వరి రకాలు ఎం.సి.ఎం 100, ఎం.సి.ఎం 103, యు.ంటి.యు 1293 రకాలను వేసుకోవాలి. 25-30 రోజుల వయసు నారు ఉడవడం శ్రేయస్కరం. తరచూ మంచి నీటితో పొలంలో నీరు మార్చాలి. చౌడు పొలాలలో ఉడ్చిన 15 రోజులకు, 20 రోజులకు జింక్ సల్ఫేట్ లీటరు నీటికి 2 గ్రా చొప్పున పిచికారీ చేయడం వల్ల మొక్క త్వరగా ఎదుగుతుంది. కలుపు యాజమాన్యం ప్రధాన పొలంలో నాట్లు వేసిన 3-5 రోజులలోపు ఎకరాకు 80 గ్రా. పైరజోసల్యురాన్-ఇథైల్ 10% లేదా 1.0 నుండి 1.25 లీటర్లు బ్యుటాక్లోర్ 50% ఇ.సి లేదా 400 మి.లీ ప్రెటిలాక్లోర్ 50% ఇ.సి మందును 20 కిలోల పొడి ఇసుకతో కలిసి సమానంగా చల్లుకోవాలి. లేదా పెన్సల్యురాన్ మిథైల్ + ప్రెటిలాక్లోర్ 6.6% జి. గుళికలు 4 కిలోలు చొప్పున సమానంగా పడేలా చల్లాలి. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ