ఆరుతడి పంటల్లో సస్యరక్షణ ఆరుతడి పంటల సాగు లాభదాయకం. తక్కువ నీరు, ఎరువులతో అధిక దిగుబడులను సాధించడంతో పాటు మార్కెట్ లో సంప్రదాయ పంటకు మంచి గిరాకీ ఉంటుంది. ఆరుతడి పంటలైన పెసర, మినుము, కంది, నువ్వులు తదితర పంటలను సాగుచేయవచ్చు. తొలిదశ నుండి వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆశించిన మేర దిగుబడి రావడం లేదు. సరైన రకాలను ఎంపిక చేసుకుని సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే ఆరుతడి పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు. తామర పురుగులు ఈ పురుగులు తొలిదశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లో రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగజేస్తాయి. తల్లి, పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగంలో చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి వంకరులు తిరుగుతాయి. పురుగుల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మొక్కలు వడలి క్రమేపి ఎండిపోతాయి. వీటి వల్ల ఆకుముడత వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. బెట్ట, పొడి వాతావరణం, సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తామర పురుగుల వ్యాప్తి అధికంగా ఉంటుంది. నివారణ : ఫిప్రోనిల్ 2.0 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి తామర పురుగుల ఉధృతిని బట్టి పది రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. ఉధృతి అధికంగా ఉన్నప్పుడు స్పైనోశాడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తామర పురుగులతో పాటు మారుకా మచ్చల పురుగును కూడా నివారించుకోవచ్చు. తెల్లదోమ తెల్లదోమ రెక్కల పురుగులు, పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి క్రమేపి ఎండిరాలిపోతాయి. తెగులు సోకిన మొక్కల్లో ఆకులపై పసుపు, ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన పిందెలు, కాయలు పసుపు రంగులోకి మారి వంకరులు తిరిగి తాలు కాయలుగా మారతాయి. ఆకుల అడుగు భాగంలో నల్లటి బూజు మొక్కల్లో ఆహారం తయారు చేసుకోకుండా తగ్గి పెరుగుదల ఆగిపోతుంది. నివారణ : అంతర్వాహిక కీటకనాశనులైన డైఫెంథియురాన్ 1.5 గ్రా. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి ఉధృతిని బట్టి మార్చి మార్చి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. పేనుబంక పిల్ల, పెద్ద పురుగులు, ఆకులు, కొమ్మలు, పూత పిందెలపై గుంపులుగా చేరి రసం పీల్చడం వల్ల ముడతలు పడి క్రమేపి వడలిపోయి మొక్కలు గిడసబారుతాయి. ఇవి విసర్జించే తేనె వంటి జిగురు పదార్థం మీద మసి తెగులు బూజు ఆశ్రయించి ఆకులు, కాయలు నల్లగా మారతాయి. తేమతో కూడిన చల్లటి మేఘావృతమై ఉన్న పరిస్థితులు అనుకూలం. శనగపచ్చ పురుగు తల్లి పురుగు లేత చిగుళ్లు, పూమొగ్గులు, లేత పిందెలపై గుడ్లను విడివిడిగా పెడుతుంది. గుడ్డు నుంచి వెలువడిన చిన్న పురుగులు మొగ్గల్ని గోకి తింటూ తొలిచి కాయల్లోకి తలను చొప్పించి మిగతా శరీరాన్ని బయట ఉంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి. వర్షం లేదా చిరుజల్లులు పడినప్పుడు లేదా రాత్రి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఉధృతి అధికంగా ఉంటుంది. నివారణ : ఉధృతి అధికంగా ఉన్నప్పుడు స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ (18.5 ఎస్.సి.) 0.3 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు పైరు తొలి దశలో లద్దె పురుగు ఆకుల్లోని పచ్చదనాన్ని గీకి తినడం వల్ల ఆకులు తతెల్లగా జల్లెడాకులుగా మారుతాయి. ఈ పురుగులు పెద్దవై పూత, పిందె కాయలను తింటాయి. ఈ పురుగులు పగటి వేళ మొక్కలు అడుగున లేదా మట్టి పెళ్లల కింద దాగి రాత్రిపూట మొక్కలను ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. నివారణ ఎకరానికి 4-5 లింగఆకర్షక బుట్టలను అమర్చాలి. ఎర పంటగా ఆముదం లేదా పొద్దుతిరుగుడు 30-40 మొక్కలు ఉండేలా విత్తాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేపగింజల కషాయం పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు, ఎకరాకు నోవాల్యురాన్ 200 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 40 మి.లీ.ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మారుకా మచ్చల పురుగు పెసర, మినుము, కంది పైర్లలో మారుకా మచ్చల పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనినే పూత పురుగు లేదా గూడు పురుగు అంటారు. గుడ్డు నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూ మొగ్గల్లోకి చొచ్చుకునిపోయి లేత భాగాలను తింటూ ఉంటాయి. మొదటి ఒకటి రెండు దశల్లో పూమొగ్గలోనే ఉంటూ తర్వాత లేత ఆకులను పూతను, లేత పిందెలను, కాయలను కలిపి గూడు చేసుకుని తినడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. తొలిచిన కాయ రంధ్రం దగ్గర లార్వా విసర్జితాలు కనిపిస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉండి సరైన సమయంలో నివారించకపోతే దాదాపు 80 శాతం వరకు నష్టం కలుగుతుంది. నివారణ పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. మొగ్గ, పూత దశలో పిల్ల పురుగులు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా థయోడికార్బ్ 1 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటలో గూళ్లు గమనిస్తే నోవాల్యురాన్ 1 మి.లీ.లో ఏదో ఒక మందుతో తప్పనిసరిగా డైక్లోరోవాస్ మందు 1 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగలో ఆకుముడత పంట విత్తిన 15 రోజుల నుండి 45 రోజుల వరకు ఆశిస్తుంది. ఈ పురుగు 2-3 ఆకులను కలిపి గూడు చేసి పచ్చదనాన్ని తినడం వల్ల ఆకులన్ని ఎండి దూరం నుండి కాలిపోయినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు నోవాల్యురాన్ 200 మి.లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేయాలి. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు , ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్