అలంకార మొక్కలు అనగా అందమైన ఆకులు, పుష్పాలతో చక్కటి ఆకారంలో ఉండి అలంకార ప్రయోజనాలకు, అలంకరణ పూలకు, ప్రదర్శనకు, ఉద్యాన వనాలు, దేవాలయాలు, విద్యాలయాలు, ఇళ్ళలో, అందంగా కనపడేందుకు (ల్యాండ్ స్కేపింగ్) పెంచే మొక్కలు. అలంకారమొక్కలు ఉపయోగాలు సౌందర్య - విలువ : అలంకార పొదలైన మందారం, గులాబీ, బౌగెన్ఏ్వలియా, మల్లె మొదలైన మొక్కల రంగు రంగుల పుష్పాలు, ఆకర్షణీయమైన ఆకులు, తోటలకు ఇంటి పరిసరాలకు అందాన్ని పెంచుతాయి. అలంకార మొక్కలు ఉద్యాన వనాలు, రోడ్లపక్కన, బహిరంగ ప్రదేశాలలో ల్యాండ్ స్కేప్ డిజైన్లలో విస్తృతంగా ఉపయోగించబడతాయి. మల్లె, పారిజాతం, సంపంగి వంటి మొక్కలు సుగంధాన్ని అందించి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తాయి. పర్యావరణ ప్రయోజనాలు అలంకార మొక్కలు కార్బనయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదలచేసి గాలిని శుద్ధిచేస్తాయి. అలంకార చెట్లు నీడను అందించి వేసవిలో చల్లటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈ మొక్కలు దుమ్ము కాలుష్య కణాలను గ్రహించడంలో సహాయపడతాయి. అలంకార పొదలైన లాంటానా, బౌగెన్ విలియా మొదలైన పొదలు నేలను స్థిరీకరించడంలో సహాయపడతాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక ఉపయోగాలు మందారం, కనకాంబరం వంటి పుష్పాలు పూజలు, శుభకార్యాలు, మరియు సాంప్రదాయ వేడుకలలో ఉపయోగించబడతాయి. మల్లె, గులాబీ పుష్పాలను మహిళలు జడలలో అలంకరణగా ఉపయోగిస్తారు. వేడుకలు : పెళ్లిళ్లు, ఉత్సవాలలో అలంకార మొక్కలను మరియు వాటిపుష్పాలను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు : అలంకార మొక్కలతో కూడిన తోటలు ఒత్తిడిని తగ్గించి, మానసిక శాంతిని అందిస్తాయి. కొన్ని అలంకార మొక్కలు (ఉదా : మందారం, గన్నేరు) ఆయుర్వేదంలో ఔషధ ఉపయోగాలను కలిగిఉంటాయి, అయితే వీటిని జాగ్రత్తగా ఉపయోగించాలి ఎందుకంటే కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు : అలంకార మొక్కల పెంపకం ద్వారా నర్సరీలు మరియు ఉద్యాన వ్యాపారులు ఆదాయాన్ని పొందుతారు. రైతులు మల్లె, గులాబీ, కనకాంబరం వంటి పుష్పాలను తమ ఆదాయాన్ని పెంచటానికి వాటిని సాగుచేసి, మార్కెట్లో అమ్ముతారు. పర్యాటక ఆకర్షణ : ప్రముఖ ఉద్యానవనాలు మరియు బొటానికల్ గార్డెన్లలో అలంకార మొక్కలు పర్యాటకులను ఆకర్షిస్తాయి, ఇది స్థానిక ఆర్ధిక వ్యవస్థకు దోహదపడుతుంది. వన్యప్రాణులకు ఆశ్రయం : అలంకార మొక్కలు పక్షులు, తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటి వన్యప్రాణులకు ఆశ్రయం మరియు ఆహారం (పుష్పరసం) అందిస్తాయి, ఇది జీవ వైవిధ్యాన్ని పెంచుతుంది. అలంకార మొక్కల పెంపకానికి సూచనలు మొక్కల ఎంపిక - వాతావరణం: ప్రదేశాన్ని బట్టి వాతావరణానికి తగిన మొక్కలను ఎంచుకోవాలి. ఉదాహరణకు, బౌగెన్విల్లా, గన్నేరు వేడి వాతావరణంలో బాగా పెరుగుతాయి, అయితే హైడ్రేంజియాకు తేమ నీడ వాతావరణం అనుకూలం. స్థలం:మొక్కల పరిమాణం, ఎత్తు, విస్తరణ బట్టి తగిన స్థలం ఎంచుకోవాలి. ఉదాహరణకు, అశోక చెట్టుకు ఎక్కువ స్థలం అవసరం, అయితే కనకాంబరం కుండీలలో కూడా పెరుగుతుంది. ప్రయోజనం : అవసరాన్ని బట్టి మొక్కలను పుష్పాలు, సుగంధం. నీడ, లేదా ఆకు అందంకోసం ఎంచుకోవాలి. నేలతయారీ: సేంద్రియ పదార్థాలతో కూడి, ఉదజనిస్థాయి 6.0-7.0 మధ్య ఉండే నేలను ఎంచుకోవాలి. నేలలో కంపోస్ట్, పశువుల ఎరువు, లేదా వేపపిండిని కలపాలి. నీరు నిలిచి పోకుండా డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. నాటడం: వర్షాకాలం లేదాచల్లని కాలంలో నాటుకోవాలి. మొక్క మూలాలకు రెట్టింపు వెడల్పు మరియు లోతు గల గోతిని తవ్వాలి. నాటిన వెంటనే సమృద్ధిగా నీరుపోసి, మొదటి కొన్ని వారాలు రోజూ తడులు ఇవ్వాలి. కత్తిరింపు : ఎండిపోయిన ఆకులు లేదా కొమ్మలను తొలగించి, మొక్క ఆకృతిని మెరుగుపరచాలి. ఉదా: గులాబీ పొదలను కత్తిరించడం వల్ల ఎక్కువ పుష్పాలు పూస్తాయి. అలంకార మొక్కల ప్రాముఖ్యం అలంకార మొక్కలు మన ఇంటి అందాన్ని పెంచేందుకు, ఇంటి ముందు పెరటి లో గుమ్మం వద్ద, కొన్ని ఇంటిలోపల ఏర్పాటు చేయడం ద్వారా మన ఇంటిని ఆకర్షణీయంగా తయారుచేస్తాయి. ఆక్సిజన్ విడుదల అలంకార మొక్కలు వాతావరణంలో శుద్ధ మైన ఆక్సిజన్ విడుదల చేసి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆలంకార మొక్కల పరిమళం ఆకులు చూసే సందర్భంలో మనసు ప్రశాంతంగా, చైతన్యంగా మారుతుంది. హిందూ సంప్రదాయంలో, పూజా కార్యక్రమాలలో అలంకార మొక్కలు ఉపయోగిస్తారు. కొన్ని మొక్కలు ప్రత్యేకంగా పూజలలో ఉంచుతారు (ఉదా: తులసి మొక్క). ఆహ్లాదకర వాతావరణం ప్రకృతిని గౌరవించి, ఆరోగ్యకరంగా, సుస్థిరంగా జీవించడం, తద్వారా మనం మరియు భవిష్యత్ తరం మంచి జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా వ్యవహరించడం. వ్యాపార అవకాశాలు అలంకార మొక్కల విక్రయం ద్వారా రైతులు, వ్యాపారులు ఆదాయం పొందవచ్చు. పెంపకం ద్వారా మంచి వ్యాపార అవకాశాలు కూడా కలుగుతాయి. అందుకే, అలంకార మొక్కలు మన దైనందిన జీవితంలో అందాన్ని, ఆరోగ్యాన్ని, సంప్రదాయాన్ని, ఆధ్యాత్మికతను ఆదాయం మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా.సి.హెచ్. సాయి రత్న శర్వాణి అసిస్టెంట్ ప్రొఫెసర్, (పూల విభాగం), డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వ విద్యాలయం, వి.ఆర్. గూడెం, పశ్చిమ గోదావరి