ఉద్యాన పంటలు అరటి : తోటలలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి అవసరాన్ని బట్టి నీటి తడులివ్వాలి. తల్లి మొక్క చుట్టూ వచ్చే పిలకలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. జామ : పిండినల్లి నివారణకు అక్షింతల పురుగు (క్రిప్టోలీమన్ మోంట్రీజెరి) చెట్టుకు 10 బదనికలను తోటలో విడుదల చేయాలి. బొప్పాయి : ఆకులపై గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి, ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతున్నట్లయితే నివారణకు లీటరు నీటికి మాంకొజెబ్ 2.5 గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి పక్షం రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి. ఉసిరి: కాయ సైజు పెరగడానికి, కాయలు గచ్చకాయ సైజులో ఉన్నప్పుడు 10 గ్రా. యూరియా లేదా 10గ్రా. పొటాషియం నైట్రేట్ ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కొబ్బరి : చెట్ల చుట్టూ 2 మీ. దూరం మరియు 25 సెం.మీ. లోతు పళ్లాలు చేసుకొని సిఫారసు చేయబడిన 2వ దఫా రసాయన ఎరువులు చెట్టుకు 1/2 కిలో యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్పేట్, 1.1/2 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చొప్పున వేయవలెను. తమలపాకు : తీగ నాటిన తరువాత పొగాకు లద్దెపురుగును గమనించినట్లయితే 5% వేప గింజల కషాయం లేదా వేపనూనె 3 మి.లీ లీటరు నీటికి కలిపి తీగలపై పిచికారీ చేయాలి. ఆకుమచ్చ ఆశించకుండా 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయల పంటలు క్యారెట్ ముల్లంగి, బీట్రూట్ : పంటల విత్తనాన్ని ప్రధాన పొలంలో నేరుగా విత్తుకోవాలి. క్యారెట్‌ను చిన్న మడులు లేదా బోదెలు చేసి విత్తుకోవాలి. 30 సెం.మీ. దూరంలో బోదెలు తయారు చేసి విత్తనాలు 5 సెం.మీ. దూరంలో విత్తాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ నిచ్చు సూటి ఎరువులు వేయాలి. 20 కిలోల నత్రజనిని రెండు సమభాగాలుగా చేసి ఒక భాగం ఆఖరి దుక్కిలో మిగిలిన సగం విత్తిన ఆరు వారాల తరువాత వేయాలి. మునగ : నీటి తడి ఇవ్వాలి. మొక్కల ఎత్తు 75 సెం.మీ. పెరిగిన తరువాత మొక్కల చివర్లు త్రుంచి వేయడం వలన ప్రక్క కొమ్మలు బాగా వచ్చి దిగుబడులు పెరుగుతాయి. ఉల్లి: అవసరాన్ని బట్టి కలుపు తీసి, మట్టిని ఎగదోయాలి. నీటి తడులు 10 రోజులకు ఒకసారి అందించాలి. సుగంధ ద్రవ్య పంటలు అల్లం : కాండము తొలుచు పురుగు నివారణకు డైమిథోయేట్ 400 మి.లీ./200 లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. దుంప కుళ్ళు ఆశించిన మొక్కలను/ దుంపలను పూర్తిగా ఏరి, నాశనం చేసి, రిడోమిల్ 1గ్రా./లీ. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా./లీటరు నీటికి కలిపి నేలంతా తడిచేలా పోయాలి. ధనియాలు : ఎకరాకు 6-8 కిలోల విత్తనం చొప్పున, 30 సెం.మీ. చాళ్ళలో ఎద పెట్టుకోవాలి. విత్తిన వెంటనే పెండిమిథాలిన్ మందును ఎకరాకు 1-1.5 లీ. చొప్పున నేలపై పిచికారి చేసి కలుపు నివారణ చేసుకోవాలి. వాము : మొక్కల మధ్య 15-20 సెం.మీ. ఉండేటట్లు అదనపు మొక్కలు తీసి పలుచన చేసుకోవాలి. కలుపు తీసి, గొర్రు, గుంటకలతో అంతర కృషి చేసుకోవాలి. నీటి పారుదల వసతి ఉ న్నవారు రబీ పంటగా విత్తుకోవాలి. పూలతోటలు గులాబి: పూలు కావలసిన సమయాన్ని బట్టి సుమారు 42-45 రోజులకు కొమ్మలను కత్తిరించుకోవాలి. కొమ్మలను కత్తిరించిన వెంటనే బోర్డోమిశ్రమాన్ని/బ్లైటాక్స్ పేస్టును పూయాలి. చామంతి : కలుపు తీయాలి మరియు ఎండుటాకులు పరచి మల్చింగ్ చేయాలి. పేనుబంక నివారణకు 2 మి.లీ. డైమిథోయేట్ మరియు నల్లమచ్చ నివారణకు మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మల్లె: నీరు నిలిపివేయాలి. బంతి : నీరుపెట్టిన మరుసటిరోజు పూలు కోయడంవలన, ఎక్కువ కాలం పూలు తాజాగా ఉంటాయి. ఆకుమచ్చ నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బెండజిమ్ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆధారం: పాడి పంటలు రైతు సలహా కేంద్రం, ఉద్యాన విశ్వ విద్యాలయం, వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి.