జామ పంటను మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో సాగుచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మిగతా పండ్లకి చాలా అధిక రేటు ఉండడం, పురుగు మందుల అవశేషాలు మొదలగు వాటి వలన జామ పండ్లలో పోషకాలు అధికంగా ఉండడం, రేటు తక్కువగా ఉండి స్థానికంగా అందుబాటులో ఉండడం వలన ప్రజలు జామ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ జామను వేడితో కూడిన పొడి వాతావరణంలో సాగుచేసినట్లయితే పండ్ల నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఉదజని సూచిక 4.8 నుండి 8.2 ఉండి, నీరు నిలవని, లోతైన మరుగు నీటి పారుదల గల నేలలు ఈ జామ సాగుకు అనుకూలంగా ఉంటాయి. జామను సాధారణంగా నేల అంటు పద్ధతిలో ప్రవర్ధనం చేస్తారు. జామలో తెల్ల, ఎర్ర కండ గల రకాలు సాగుకి అందుబాటులో ఉన్నాయి. జామను వివిధ రకాల సమస్యలు ప్రభావితం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా పరుగులు కూడా ఆశించి జామ పంట దిగుబడి తగ్గుతోంది. జామను ఆశించే వివిధ ముఖ్య పురుగులు, వాటి వల్ల కలిగే నష్టం, వాటి సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. పండు ఈగ ఈ పండు ఈగ చాలా పంటలని ఆశించి నష్టం కలిగిస్తుంది. తల్లి ఈగ పక్వానికి వచ్చే కాయల మెత్తని చర్మంలో గుడ్లను పెడుతుంది. గుడ్లనుంచి బయటికి వచ్చిన పిల్ల పురుగులు కాయల్లోనికి చొచ్చుకొని పోయి పండ్లలోని గుజ్ఞను తినేస్తాయి. ఈ పురుగులు ఆశించిన కాయలు తర్వాత కుళ్ళిపోయి, రాలిపోతాయి. పెరిగిన పిల్ల పరుగులు కాయలనుంచి బయటికి వచ్చి, చెట్ల మొదళ్ళలో గానీ, తోటలోగానీ, భూమిలోపల కోశస్త దశను పూర్తి చేసుకొంటాయి. సస్యరక్షణ : తోటల్లో పండు ఈగ ఆశించి రాలిపడిన కాయలను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదళ్ళలోని మట్టిని తిరగదోయడం లేదా చెట్ల మొదళ్ళ వరకు దున్నినట్లయితే, భూమిలోపల ఉన్న పరుగు కోశస్త దశను చంపి వేయవచ్చు. 2 మి.లీ. మిథైల్ యూజినాల్, 3 గ్రా. కార్బోప్యూరాన్ 3జి గుళికలను లీటరు నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని ఒక్కొక్క ప్లాస్టిక్ సీసాలో 200 మి.లీ. ద్రావణాన్ని పోసి తోటలో అక్కడక్కడ చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి. దీని వలన మగ ఈగలు ఆకర్షించబడి, మందు ద్రావణంలో పడి చనిపోతాయి. 2 మి.లీ మలాథియాన్ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి ఈ పిండి నల్లి జామతో పాటు, చాలా ఉద్యాన పంటలను ఆశించి నష్టం కలుగచేస్తుంది. తోటల్లో తేమ అధికంగా ఉండడం, చెట్ల మధ్య దూరం తక్కువగా ఉండడం, నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లాంటి పరిస్థితుల్లో ఈ పిండినల్లి సమస్య ఎక్కువగా ఉంటుంది. చిన్న పెద్ద పురుగులు కొమ్మల చివర, కాయలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. కాయలు, ఆకులు రాలిపోతాయి.ఇవి జిగురు పదార్గాన్ని విసర్షించడం వలన మసి తెగులు వృద్ధి అవుతుంది. దీని వలన కిరణజన్య సంయోగ క్రియ తగ్గి, మొక్కల పెరుగుదల తగ్గి, కాపు తగ్గిపోతుంది. దీని నివారణకి అక్షింతల పురుగు బదనికలను తోటలో విడుదల చేయాలి. ఎసిఫేట్ 1 గ్రా. లేదా డైక్లోరోవాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలిచే పురుగు ఈ పురుగు చెట్ల మొదళ్ళలో కాండంలోనికి తొలుచుకొని పోయి నష్టం కలిగిస్తుంది. కాండం లోపల ఉండే కణజాలాన్ని తినేస్తాయి అందువలన కొమ్మలకి ఉండే ఆకులు పసుపు రంగులోకి మారి, ఆకులు, కొమ్మలు ఎండిపోతాయి. ఒక్కోసారి తీవ్రత ఉధృతంగా ఉన్నట్లయితే చెట్టు మొత్తం చనిపోతుంది. ఈ పురుగు ఆశించిన చెట్ల మొదళ్ళలో రంధ్రాలు ఉండి, రంధ్రాల్లో పురుగు విసర్జించిన పదార్గాన్ని గమనించవచ్చు. నివారణకి పురుగు చేసిన రంధ్రాలని శుభ్రపరిచి ఇనుపచువ్వ సహాయంతో పరుగును చంపి తర్వాత రంధ్రాల్లో పెట్రోలు లేదా కిరోసిన్లో తడిపిన దూదిని ఉంచిగానీ లేదా కార్బోఫ్యూరాన్ గుళికలు వేసి రంధ్రాలను తడిచిన రేగడి మట్టితో పూడ్చాలి. తెల్ల సుడిదోమ ఈ పురుగు అమెరికానుంచి మన దేశంలోకి అనుకోకుండా ప్రవేశించి విస్తరించిన పురుగు. ఈ పురుగు అనేక రకాల పూల మొక్కలు, అలంకరణ మొక్కలు, అటవీ మొక్కలు, ఉద్యాన పంటలను ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. అన్నింటి కంటే ఎక్కువగా జామను ఆశించి నష్టం చేస్తుంది. ఈ తెల్లదోమ పిల్ల పురుగులు ఆకులపై తెల్లని దూదివంటి మెత్తని పదార్థంతో కప్పబడి ఉండి రసాన్ని పీలుస్తాయి. ఇవి ఆశించిన ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. వీటి నష్టం నవంబర్ లో ముదురు ఆకుల మీద మొదలై, ఏప్రిల్ వరకు లేత ఆకులను ఆశిస్తుంది. ఫిబ్రవరిలో ఈ పురుగులు చాలా తీవ్రస్థాయికి చేరి తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకి, రాత్రులందు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను తోటలో ఉంచాలి. ప్రథమ దశలో ఆశించిన కొమ్మలను కత్తిరించి, వేపనూనెను 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఫాస్పామిడాన్ లేదా డైక్లోరోవాస్ లేదా హెూస్థా థయాన్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక