జామలో పండు ఈగ నివారణతో నాణ్యమైన ఫలసాయం ఆంధ్రప్రదేశ్ లో జామ అనంతపురం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాలలో ఎక్కువగా సాగులో ఉంది. జామ పంటలో ముఖ్యంగా తెల్ల, ఎర్ర కండ గల రకాలు సాగులో ఉన్నాయి. తెల్ల కండ రకాలు: అలహాబాద్ సఫేదా, లక్నో49, సఫేద్ జామ, కొహిర్ సఫేదా, ఆర్కా మృదుల, ఆర్కా అమూల్య, శ్వేత, వి.యన్.ఆర్.బిహి, తైవాన్ వైట్.ఎర్ర కండ రకాలు : లలిత్, ఆర్కా కిరణ్, తైవాన్ పింక్ కాపు నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా జామ పంటను మనకు కావలసిన విధంగా మూడు సమయాల్లో తీసుకోవచ్చు. అంబె బహార్ (ఫిబ్రవరి పూత) వసంత కాలంలో పూతకు వచ్చి, కాయలు వర్షాకాలంలో కోతకు వస్తాయి. మిగ్ బహార్ (జూన్-జులై పూత) వర్షాకాలంలో పూతకు వచ్చి, కాయలు చలికాలంలో కోతకు వస్తాయి. హస్తా బహార్ (అక్టోబర్ పూత) శీతాకాలంలో పూతకు వచ్చి, కాయలు వేసవి కాలంలో కోతకు వస్తాయి.జామలో కాయలు పక్వానికి రాగానే పండు ఈగ బెడద ఎక్కువగా ఉంటుంది. పండు ఈగ పండు ఈగ చిన్నగా ఉండి, లార్వా దశలో పండ్లను తింటుంది. పండిన జామ పండ్ల నుండి వచ్చే మధురమైన వాసన ఈ పురుగును ఆకర్షిస్తుంది.ప్రధానంగా జామ పంటను బాక్ట్రోసిర డార్సాలిస్, బాక్ట్రోసిర కొరెక్టా అనే పండు ఈగ జాతులు ఎక్కువగా దెబ్బతీస్తున్నాయి.పండు ఈగ అనేక పంటలపై జీవిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పురుగు సంతతి విపరీతంగా పెరిగి, పక్వానికి వచ్చిన జామ పంట ఉత్పత్తిని భారీగా దెబ్బ తీస్తుంది. పండు ఈగ జీవిత చక్రం నాలుగు దశలుగా విభజించబడుతుంది. గుడ్డు: ఆడ ఈగ పండులో గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లు 1-2 రోజుల్లో పొదిగి లార్వాలుగా మారతాయి.లార్వా : లార్వా పండులోని గుజ్జును తినడం వలన తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ దశ సుమారు 10-12 రోజులు ఉంటుంది.ప్యూపా : బాగా ఎదిగిన లార్వా మట్టిలోకి చేరి ప్యూపా దశగా పరివర్తన చెందుతుంది. ఈ దశ సుమారు 8-10 రోజులు ఉంటుంది. అనంతరం అది పెద్ద ఈగగా రూపాంతరం చెంది బయటకు వస్తుంది.పెద్ద ఈగ : ఇది 2-3 నెలలు జీవిస్తుంది. పండు ఈగ జామ పండుకు ఎలాంటి నష్టం కలిగిస్తుంది ? ఆడ ఈగ పండులో గుడ్లు పెడుతుంది. గుడ్లు పండులోనే లార్వాలుగా మారుతాయి. లార్వాలు పండులోని గుజ్జును తిని పండు నాణ్యత దెబ్బ తీస్తాయి. పండ్లు కుళ్ళి నేలపై రాలిపోతాయి. జులై-ఆగస్టు మాసాల్లో పండు ఈగ ఉదృతి ఎక్కువగా కనిపిస్తుంది. పండు ఈగ దాడి లక్షణాలు గుడ్లు పెట్టిన చోటు పండ్లపై చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. ఆశించిన ప్రాంతంలో పండు మెత్తబడుతుంది. పండ్లు కుళ్ళి ముందుగానే రాలిపోతాయి. ఈ రంధ్రాల ద్వారా ఇతర రోగకారకాలు కూడా ప్రవేశిస్తాయి. పండు ఈగ నియంత్రణ పద్ధతులు తోట పరిశుభ్రత : తోటలో కలుపు మొక్కలు, చెత్తను తొలగించాలి. ఈగ అశించి, నేలపై రాలి పడిపోయిన పండ్లను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి. ఈ చర్య పురుగు విస్తృతిని తగ్గిస్తుంది. నేల దున్నడం : వేసవి దుక్కుల వల్లన లార్వాలు, ప్యూపా లు బయటపడి ఎండ వేడిమికి చనిపోతాయి, పక్షులు, ఇతర శత్రువుల చేత తినబడతాయి. పండ్ల కవరింగ్ (బ్యాగింగ్): పండ్లకు కవర్లు తొడగడం ద్వారా ఈగ దాడి నివారించడమే కాకుండా, అధిక సూర్యరశ్మి (ఎండ) నుండి కూడా రక్షణ కలగడం ద్వారా పండ్ల నాణ్యత మెరుగుపడుతుంది. లింగాకర్షక బుట్టలు (ఫిరమోన్ ట్రాప్స్): పండు ఈగలు ఎగిరే పురుగులు కాబట్టి పిచికారీలతో నియంత్రణ కష్టం. కనుక పిందె దశ దాటిన నాటి నుండి మిథైల్ యూజినాల్ ఎరలను ఒక ఎకరానికి 6-8 చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. పంట కాలంలో నెలకొక సారి ఈ ఎరలను మార్చిన యెడల ఈగ ఉదృతిని తగ్గించవచ్చు. ఈ ఎరలను చెట్లపై 5-6 అడుగుల ఎత్తులో వేలాడదీయాలి. పండ్లు పక్వానికి రాక మునుపే ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. లీటరు నీటికి మిథైల్ యూజినాల్ 2 మి.లీ. + స్పైనోసాడ్ 45 ఎస్సి 0.4 మి.లీ./లీటర్ నీటికి కలిపి ద్రావణంతో రైతులే స్వయంగా ఫ్రూట్ ఫ్లై ఎరలను తయారు చేసుకోవచ్చు. ఈ ఎర ద్రావణంలో చిన్న చిన్న చెక్క ముక్కలను నానబెట్టి, వాటిని ప్లాస్టిక్ సీసాలో పెట్టిన దారంతో వేలాడదీయాలి. సీసా అడుగున కొద్దిగా పులిసిన గంజి పోసి తోటలో వివిధ ప్రదేశాల్లో అమర్చాలి. ఈ విధంగా అమర్చిన ఎరలు మగ పండు ఈగలను ఆకర్షించి, వాటి సంఖ్యను తగ్గించడంలో సహాయపడతాయి. పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 100గ్రా. బెల్లం లేదా పులిసిన గంజి, 5 మి.లీ. మలాథియాన్ కలిపి మట్టి పాత్రల్లో పోసి తోటలో అక్కడక్కడా పెట్టి పండు ఈగ ఉధృతిని తగ్గించవచ్చు.అలాగే కాయ ఎదుగుదల సమయంలో 1 శాతం పొటాషియం నైట్రేట్ (మల్టి కె) అనగా 10 గ్రా. లీటరు నీటికి, సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్ 5గ్రా. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లైతే కాయ బరువు, నాణ్యత పెరుగుతుంది. నాప్తలీన్ ఎసిటిక్ ఆమ్లం 20-40 పి.పి.యం పిచికారి చేసినట్టైతే పిందె రాలటం తగ్గి, మంచి దిగుబడి వస్తుంది. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక దా.కె.సి.భానుమూర్తి శాస్త్రవేత్త (కీటక శాస్త్రం) ఉద్యాన పరిశోధనా స్థానం, తిరుపతి