నువ్వులు

నువ్వు పంటలో అధిక దిగుబడి పొందాలంటే చీడపీడలు, తెగుళ్ళను ఒక్కో దశలో గుర్తించి, సమగ్రంగా నియంత్రించడం చాలా అవసరం. విత్తన ఎంపిక దశ నుండి సమగ్ర యాజమాన్యం ప్రారంభం కావాలి. ఆరోగ్యమైన, శుభ్రమైన, స్థానిక వాతావరణానికి అనుకూలమైన రకాలను ఎంచుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి కార్బండిజమ్ 2 గ్రాముల లేదా థైరమ్ 3 గ్రాములు కలిపి శుద్ధి చేయాలి. భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లను తగ్గించడానికి ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు/కిలో విత్తనానికి కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవడం మంచిది. విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తడం వల్ల మొలక దశలో వచ్చే వేరు కుళ్ళు, ఎండు తెగుళ్ళను చాలా వరకు తగ్గించవచ్చు. విత్తే ముందు పొలాన్ని సిద్ధం చేసి, మురుగు నీటి పారుదల సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. నీరు నిలిచే నేలల్లో నువ్వు పంట వేయకూడదు.వ్యవసాయిక పద్ధతులలో లోతైన వేసవి దుక్కులు చాలా ఉపయోగకరం. పంట మార్పిడి తప్పనిసరి నువ్వును వరుసగా ఒకే పొలంలో వేయకుండా జొన్న, వేరుశనగ లేదా ఇతర అనుకూల పంటలతో మార్పిడి చేయాలి. పంటను సమయానికి విత్తడం కూడా ముఖ్యం, ఎందుకంటే ఆలస్యంగా విత్తితే కొన్ని పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే గాలి, సూర్యరశ్మి బాగా ప్రసరించి తెగుళ్లు తక్కువగా వస్తాయి. సమతుల ఎరువుల యాజమాన్యం కూడా అవసరం నత్రజని అధికంగా వాడితే రసం పీల్చే పురుగులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు మేరకే ఎరువులు వేయాలి.

నీటి యాజమాన్యం

పొలంలో నీరు నిల్వ ఉండకుండా చిన్న కాలువలు ఏర్పాటు చేయాలి. తేమ ఎక్కువగా ఉండటం వేరు కుళ్లు, ఆకు మచ్చ వంటి తెగుళ్లకు అనుకూలం.

కలుపు యాజమాన్యం

కలుపు మొక్కలను ప్రారంభ దశలోనే తొలగించాలి, ఎందుకంటే అవి పురుగులకు ఆశ్రయం ఇస్తాయి. పంటతో పోటీ పడతాయి. పొలాన్ని శుభ్రంగా ఉంచడం, గత పంట అవశేషాలను తొలగించడం, పురుగులు, తెగుళ్ళు సోకిన మొక్కలను వెంటనే పీకి నాశనం చేయడం కూడా కీలకం. ఫీల్డోడీ సోకిన మొక్కలు కనిపించిన వెంటనే వాటిని వేరుతో సహా తీసి నాశనం చేయాలి.

భౌతిక, యాంత్రిక పద్ధతులు

రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇస్తాయి. రసం పీల్చే పురుగులను తగ్గించ డానికి ఎకరాకు 10-15 పసుపు రంగు జిగురు అట్టలు అమర్చాలి. రాత్రివేళ వచ్చే పురుగులను ఆకర్షించడానికి కాంతి ఎరలు (లైట్ ట్రాప్స్) ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు, పొలం మధ్యలో లైట్ ట్రాప్ పెట్టి కింద నీరు లేదా సబ్బు నీరు ఉన్న తొట్టె ఉంచితే రెక్కల పురుగులు అందులో పడతాయి. ఆకు చుట్టు పురుగు ఆశించిన ఆకులను చేతితో ఏరి నాశనం చేయవచ్చు. ఫీల్డోడీ లేదా ఇతర తీవ్రమైన లక్షణాలు కనిపించిన మొక్కలను వెంటనే తొలగించడం వల్ల వ్యాప్తి తగ్గుతుంది. పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం వలన పక్షులు పురుగులను తిని వాటి సంఖ్యను తగ్గిస్తాయి.

జీవ నియంత్రణ పద్ధతులు

పర్యావరణ హితంగా ఉంటాయి. ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్జియానం వంటి జీవ కారకాలు వేరు కుళ్ళు, ఎండు తెగుళ్ళను అరికట్టడంలో సహాయ పడతాయి. విత్తన శుద్ధితో పాటు 2 కిలోల ట్రైకోడెర్మాను 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తే ముందు నేలలో వేయవచ్చు. వేప ఉత్పత్తులు, ముఖ్యంగా వేప నూనె 5 మి.లీ/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వలన రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ప్రారంభ దశలో వేప నూనెతో పిచికారీ చేస్తే పురుగుల గుడ్లు, చిన్న లార్వాలు, నింఫ్ దశలు చనిపోతాయి. మిత్ర పురుగులైన లేడీ బర్డ్ బీటిల్స్, తేనెటీగలు, పరాగసంపర్కానికి సహాయపడే కీటకాలు పొలంలో అభివృద్ధి చెందాలంటే అధిక మోతాదులో రసాయన మందులను పిచికారీ చేయకూడదు.

నివారణ

చివరి మార్గంగా మాత్రమే ఉపయోగించాలి. విత్తన శుద్ధికి కార్బండిజమ్ 2 గ్రాములు/కిలో లేదా థైరామ్ 3 గ్రాములు/కిలో విత్తనానికి వాడాలి. విత్తిన తర్వాత 15-20 రోజుల దశలో రసం పీల్చే పురుగులు కనిపిస్తే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ/లీటరు లేదా థయోమిథాక్సాం 0.25 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకు మచ్చ తెగులుకు మాంకోజెబ్ 2.5 గ్రా/లీటరు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా/లీటరు వాడవచ్చు. పూత దశకు ముందు మాంకోజెబ్ 2.5 గ్రా/లీటరు + థయోమిథాక్సాం 0.25 గ్రా/లీటరు వంటి మిశ్రమం ఉపయోగ పడుతుంది. కాయ తొలిచే పురుగులకు స్పైనోసాడ్ 1 మి.లీ/లీటరు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. ఫీల్డ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటే తెగులను వ్యాప్తి చేసే తామర పురుగుల నియంత్రణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ/లీటరు లేదా డైమిథోయేట్ 2 మి.లీ/లీటరు నీటికి చొప్పున కలిపి ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం పిచికారీ చేయాలి. పిచికారీ ఎల్లప్పుడూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేయాలి, పూత సమయంలో తేనెటీగలపై ప్రభావం తగ్గేలా జాగ్రత్త పడాలి.

కోత దశ

ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, కాండం ఎండిపోవడం, కాయలు పూర్తిగా పక్వం కావడం గమనించి కోత చేపట్టాలి. కోత ఆలస్యం చేస్తే కాయలు పగిలి విత్తన నష్టం జరగవచ్చు. కోత తర్వాత పంటను నీడలో ఆరబెట్టి, తేమ లేకుండా నిల్వ చేయాలి. తెగులు సోకిన మొక్కల అవశేషాలను పొలంలో వదలకూడదు వాటిని సేకరించి నాశనం చేయాలి.నువ్వుల పంటలో సమగ్ర యాజమాన్యం అంటే విత్తన ఎంపిక, లోతైన దుక్కులు, పంట మార్పిడి, కలుపు నియంత్రణ, నీటి నిర్వహణ, జీవ నియంత్రణ, భౌతిక నియంత్రణ, చివరగా అవసరమైనప్పుడు మాత్రమే రసాయన వినియోగం అనే సమన్వయ విధానం పాటిస్తే రైతులు తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన, అధిక దిగుబడినిచ్చే నువ్వుల పంటను పొందగలరు.

ఆధారం : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ