తెలంగాణ రాష్ట్రంలో పండించే అపరాల పంటల్లో పెసరకు చాలా ప్రాముఖ్యత ఉంది. పెసరలో మన శరీరానికి అవసరమైన మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, మినరల్స్, విటమిన్లు, అమైనో ఆమూలు సంపూర్ణంగా లభిస్తాయి. ఈ పెసరను ముఖ్యంగా తెలంగాణ జిల్లాలైన వరంగల్, ఖమ్మం, నల్గొండ, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తారంగా అన్ని కాలాల్లో సాగుచేస్తున్నారు. ఇది పంట మార్పిడిగా, అంతర పంటగా అన్ని పంటల సరళిలో ఖరీఫ్, రబీ, వరి మాగాణుల్లో పండించవచ్చు. పెసరను ఆశించే పురుగులు రబీ, వేసవిలో పెసరను వివిధ రసం పీల్చే పురుగులు, కాయను, పూతను తినే పురుగులు ఆశిస్తాయి. రసం పీల్చే పురుగులు తామర పురుగులు : ఇవి పంట తొలిదశ నుండి పూత వరకు ఆశిస్తాయి. లేత ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని వంకర్లు తిరిగి గిడసబారి రాలిపోతాయి. పంట ప్రారంభ దశలో ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు మాడిపోతాయి. పూత దశలో ఉధృతి ఎక్కువగా ఉంటే పూత రాలిపోతుంది. పేనుబంక : ఇవి పంటను చల్లటి వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తాయి. తల్లి, పిల్ల పురుగులు ఆకులు, లేత కొమ్మల మీద గుంపులు గుంపులుగా ఉండి రసం పీల్చడం వలన మొక్కలు పసుపు వర్గానికి మారి గిడసబారిపోతాయి. ఇవి తేనే వంటి జిగట పదార్ధాన్ని విసర్జించడం వలన ఆ విసర్జన మీద నల్లని శిలీంద్రాలు పెరిగి కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం కలిగిస్తాయి. పచ్చదోమ : ఇవి ఆకులు అడుగు భాగం నుండి రసం పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారుతాయి. తెల్లదోమ : ఇవి ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వలన ఆకులు పాలిపోతాయి. ఇవి పల్లాకు తెగులును వ్యాపింప చేస్తాయి. తెగులు సోకినప్పుడు లేత ఆకుల మీద పసుపు మచ్చలు కనిపించి క్రమేపి అవి పెరిగి ఆకుల మీద పసుపు, ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే కొన్ని ఆకులు పూర్తిగా పసుపు రంగుకు మారుతాయి. దీని వలన మొక్కలు గిడసబారి ఎండుతాయి. పిందెలు, కాయలు పసుపు రంగుకు మారి వంకర్లు తిరుగుతాయి. కాయలో గింజలు ఏర్పడవు. రసం పీల్చే పురుగుల యాజమాన్యం : పసుపు రంగు పళ్ళాలను అవుర్చుకుంటే తెల్లబోవు గమనించవచ్చు. ఈ కింది రసాయనాలను పిచికారీ చేసుకోవాలి. తామర పురుగులు, పచ్చదోమ, పేనుబంక -- మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. / లీ; డైమిధోయేట్ 2.0 మి.లీ. / లీ; ఎసిఫేట్ 1.5 గ్రా. / లీటరు నీటికి. తెల్లదోమ - టైజోఫాస్ 1.5 మి.లీ / లీటరు లేదా అసిటామిఫ్రిడ్ 0.2 గ్రా. /లీ. పురుగు ఉధృతిని గమనించి ఈ మందులను పిచికారీ చేసుకోవాలి. కాయను ఆశించే పురుగులు మారుకా మచ్చల పురుగు : ఇది పూత నుండి కాయ దశ వరకు పంటను ఆశిస్తుంది. లద్దె పురుగులు పూతను గూడుగా ఏర్పరచి లోపల ప్రవేశించి తింటాయి. కాయలు ఏర్పడే దశలో కాయలలోకి ప్రవేశించి గింజలను తిని కాయలను విసర్జనతో నింపుతాయి. పొగాకు లద్దె పురుగు : శాఖీయ దశలో ఆకులపైన రంధ్రాలు చేసి ఆకులను తింటుంది. నివారణ : మొగ్గ, పూత దశలో వేపనూనె (5 మి.లీ /లీటరు నీటికి) పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్ళు గమనిస్తే ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ మి.లీ. డైక్లోరోవాస్ మి.లీ./లీ లేదా నోవాల్యూరాన్ మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ళు బూడిద తెగులు ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై తెల్లని మచ్చలు గమనించవచ్చు. తెగులు ఉధృతి పెరిగే కొద్ది కాండం, పిందెలు, కాయలపై తెల్లని బూడిద లాంటి పొర ఏర్పడుతుంది. ఆకులు ఎండి రాలిపోతాయి. రాత్రి చల్లటి వాతావరణం ఉన్న పక్షాన తెగులు ఎక్కువ ఆశిస్తుంది. నివారణ : తెగులు గమనించిన వెంటనే కార్చండిజమ్ 1 గ్రా. లేదా థయోఫానేట్ మిథైల్ 1 గ్రా. లేదా డైనోకాప్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. తుప్పు తెగులు ఈ తెగులు సోకిన ఆకులపైభాగంలో చిన్నచిన్న మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు మొదట పసుపు రంగులో ఉండి క్రమేపి తుప్పు రంగుకు మారతాయి. ఈ మచ్చలపై శిలీంధ్ర బీజాలు ఉత్పత్తి అయి ఆకు మొత్తం రంగు మారి, ఎండి రాలిపోతాయి. ఈ తెగులు పంటను 50-60 రోజుల సమయంలో ఆశిస్తుంది. నివారణ : తెగులు నివారణకు బ్రెడిమార్చ్ 1 మి.లీ. లేదా డైనోకాప్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగుళ్ళు మొలకెత్తిన దశ నుండి పూత దశ వరకు వివిధ ఆకుమచ్చ తెగుళ్ళు ఆశిస్తాయి. గుండ్రటి మచ్చలు గోధుమ రంగు అంచులు కలిగి బూడిద రంగు మచ్చలు గమనించవచ్చు. నివారణ : ధైరమ్ లేదా కాప్లాన్ 2-3 గ్రా. / కిలో విత్తనానికి విత్తనశుద్ధి చేయాలి. కార్చండిజమ్ 1 గ్రా. / లీటరు నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక