మన దేశంలో బొప్పాయి సాగు విస్తీర్ణం లక్షా ఎనభైవేల ఎకరాలు, ఉత్పత్తిలో సుమారుగా 25 లక్షల టన్నులు. బొప్పాయి అధికంగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ముఖ్యమైనవి. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 524 హెక్టార్లలో సాగవుతోంది. 51,297 టన్నుల దిగుబడి లభ్యం అవుతోంది. మెదక్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. బొప్పాయిని రకరకాల తెగుళ్ళు ఆశించి వాటి దిగుబడిని తగ్గిస్తాయి. వాటి నివారణ చర్యల గురించి తెలుసుకోవడం రైతుకు అవసరం. ఆంత్రక్నోన్ తెగులు కొల్లెటోటైకం గ్లియోస్పోరాయిడస్ అనే శిలీంధ్రం తెగులును కలుగచేస్తుంది. ఈ తెగులు లక్షణాలు పక్వానికి వచ్చి పండుతున్న కాయలపై ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ తెగులు మొదట గోధుమ రంగు ప్రదేశాలుగా ఏర్పడి క్రమేపి వృత్తాకారంలో కొద్దిగా కృంగిన నీటి మచ్చలుగా కనపడతాయి. పెరుగుతున్న మచ్చల అంచులు ముదురు రంగులో మధ్యభాగం మాత్రం గోధుమ లేక నలుపు రంగులో ఉంటుంది. అంచుల వద్ద శిలీంధ్రపు తెల్లని పెరుగుదల గమనించవచ్చు. తేమ కలిగిన వాతావరణంలో మచ్చలు గులాబి రంగులో ఉన్న శిలీంధ్రపు బీజాల సముదాయం కలిగి ఉంటాయి. అట్టి ప్రదేశాలు పండుబారటం వల్ల తేలికగా వేరుచాయ వస్తుంది. తెగులు తీవ్రంగా ఉన్న సందర్భాల్లో పండ్లు గోధుమ రంగుకు మారి కుళ్ళిపోతాయి. నివారణ చర్యలు: ప్రథమంగా తోటలో తెగులు సోకిన భాగాలను సేకరించి తగలబెట్టాలి. మొక్కలపై లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 గ్రా, కార్చండిజమ్ వంతున కలిపి మందుని మార్చుతూ అవసరాన్నిబట్టి 2 నుండి 8 సార్లు పిచికారీ చేయాలి. 1 లీటరు నీటికి 1 గ్రా. థయోఫినేట్ మిధైల్ 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే సమర్థవంతంగా తెగులు నివారించబడుతుంది. కాండం మొదలు కుళ్ళు తెగులు నర్సరీలో ఎక్కువ నష్టాన్ని కలుగచేస్తుంది. వేర్లు, మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు ఆశించిన నష్టం అధికంగా ఉంటుంది. ఒక సంవత్సరం వయసున్న చెట్లకంటే ఒక వారం వయస్సున్ననారు మొక్కలు ఈ తెగులుకు సులువుగా లోనవుతాయి. ఈ తెగులు పంట ఏ దశలోనైనా ఆశించవచ్చు. వరాకాలంలో ఎక్కువ వస్తాయి. లక్షణాలు: కాండం మొదలు వద్ద చిన్న మచ్చలుగా మొదలై మొక్కల మొదళ్ళకు పూర్తిగా వ్యాపిస్sతుంది. తెగులు సోకిన భాగం క్రమేపి గోధుమ లేదా నలుపు రంగుకు మారి కణజాలం కుళ్ళి చెడుతుంది. దీని వల్ల నీరు, లవణాల చెట్టుపై భాగానికి రవాణ ఆగిపోతుంది. ఆకుల్లో వాడు కనిపిస్తుంది. ముదురు ఆకులు చెట్టు అడుగుభాగం నుండి రాలిపోతాయి. కాయలు, పిందెలు రాలిపోతాయి.చెట్టు నిలువుగా నేల మట్టానికి పడిపోతుంది. నివారణ: మొక్క మొదలు దగ్గర నీరు నిలవకుండా చూడాలి. బోర్లో మిశ్రమం 1 శాతం, అలియేట్ 2 గ్రా లీటరు నీటికి కలిపి మొదలు తడపాలి. టైకోడెర్మా విరిడి 10 గ్రా. పొడిని ఒక లీటరు నీటిలో కలిపి బొప్పాయి మొక్కల మొదలు చుటూ నేల బాగా తడిచేటట్లుగా పోయాలి. బోదెల వెలుపల బిందుసేద్యం ద్వారా చెట్లకు నీరందిస్తే తెగులు ఆశించడం, వ్యాప్తి చెందటం అంతగా ఉండదు. కాండం కుళ్ళు తెగులు కాండం మొదలు కుళ్ళిపోయి మొక్కలు వాలిపోతాయి. మొదలు నుండి జిగురు లాంటి ద్రవం కారుతుంది. నివారణ: ఒక కిలో టైకోడెర్మా విరిడి శిలీంధ్రం + 90 కిలోల పశువుల ఎరువు + 10 కిలోల వేపపిండి+ 1 కిలో బెల్లం నీటిని 10 రోజులు మండె కట్టి చెట్ల పాదుల్లో వేయాలి. అధికంగా తెగులు ఉన్నప్పుడు లీటరు నీటికి 2 గ్రా, రిడోమిల్ ఎం.జడ్ కలిపి మొదళ్ళు తడపాలి. బూడిద తెగులు ఆకులపైన, కాడలపైన, కొత్త చిగుర్లపైన తెల్లటి బూడిద లాంటి శిలీంధ్రపు పెరుగదల కనిపిస్తుంది. నివారణ: నీటిలో కరిగే గంధకం లేదా కెరాథేన్ 1 మి.లీ. లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అక్టోబరు - నవంబరు నెలల్లో ఆకులపై గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. నివారణ: లీటరు నీటికి మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా క్లోరోథలోనిల్ 1 మి.లీ. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక