మొక్కజొన్న సున్నిత దశల్లో నీటి యాజమాన్యమే దిగుబడికి కీలకం మొక్కజొన్న ఆహారం, పశుగ్రాసం, పారిశ్రామిక అవస రాలను తీర్చే ఒక ముఖ్యమైన పంట. మొక్కజొన్న పైరు పెరుగుదల దశలో నీటి ఎద్దడికి గురైతే, అది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షాధార పైరులో వర్షాలు ఆలస్యమై నప్పుడు లేదా మధ్యలో ఎక్కువ రోజులపాటు వర్షాలు లేకపోయినా మొక్కజొన్న దిగుబడి దాదాపు 20 నుంచి 50 శాతం మేర తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి మొక్కజొన్న పైరులో సున్నిత దశలు, నీటి ఎద్దడికి గురైనప్పుడు నీటి ఎద్దడిని అధిగమించడానికి పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతులను గురించి అవగాహన పెంచుకొని, నీటి కొరత పరిస్థితులలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా పంటను కాపాడుకుని, మంచి దిగుబడులు పొందవచ్చును. మొక్కజొన్న పైరులో సున్నిత దశలు మొలక దశ : విత్తిన తర్వాత తేమ లేకపోతే మొలక శాతం తగ్గుతుంది, మొలక ఏకరీతిగా రాదు.మోకాలి ఎత్తు దశ : ఈ దశలో తేమ కొరత వేరు వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందకుండా చేస్తుంది.పూత దశ- మొగ్గ, పట్టు దారాలు : అత్యంత సున్నితమైన దశ ఈ సమయంలో తేమ కొరత ఏర్పడితే పరాగసంపర్కం సరిగా జరగక కండెలో గింజలు తక్కువగా ఏర్పడతాయి.గింజ పాలుపోసుకునే దశ : ఈ దశలో తేమ కొరత వల్ల గింజ బరువు తగ్గి, తాలు గింజలు ఏర్పడతాయి. పైరు నీటి ఎద్దడికి గురైనప్పుడు కన్పించే లక్షణాలు * ఆకులు మధ్యాహ్న వేళల్లో చుట్టుకుపోయి, దొప్పలా మారతాయి.* ఆకుల రంగు ముదురు ఆకుపచ్చ నుంచి బూడిద - ఆకుపచ్చ రంగులోకి మారతాయి.* మొక్క ఎదుగుదల ఆగిపోవడం, పైరు ఎత్తు తగ్గడం.పూత ఆలస్యం కావడం జరుగుతుంది.* కండె చివర, గింజలు లేకుండా ఖాళీగా ఉంటాయి. నీటి ఎద్దడిని అధిగమించడానికి పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతులు ఆచ్ఛాదన : వరి గడ్డి, పంట అవశేషాలు లేదా ప్లాస్టిక్ తో నేలను కప్పి ఉంచడం ద్వారా నేలలోని తేమను ఆవిరి కాకుండా నివారించ వచ్చు. అంతేకాకుండా ఆచ్చాదన వలన నేల ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి, కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుంది. అంతర సేద్యం : వర్షం పడిన వెంటనే నేల ఆరిన తర్వాత గొర్రుతో అంతర సేద్యం చేయడం వలన నేలలో గాలి చొరబాటు పెరిగి, నేలలోని తేమ ఆవిరి అవ్వడం తగ్గుతుంది (Dust mulching). కందక / బోదె- కాలువ పద్ధతి : బోదె- కాలువ పద్ధతిలో విత్తడం వల్ల వర్షపు నీరు కందకాలలో నిల్వ ఉండి, నేలలోకి ఇంకి పైరుకు ఎక్కువ కాలం తేమను అందుబాటులో ఉంచుతుంది. సేంద్రియ ఎరువుల వాడకం : పశువుల ఎరువు, వర్మీకంపోస్ట్ వంటి సేంద్రియ పదార్థాలు వేయడం వల్ల నేలకు తేమను నిలుపుకునే సామర్థ్యం పెరుగు తుంది. నీటి యాజమాన్యం : నీటి అందుబాటు పరిమితంగా ఉన్నప్పుడు, కీలకదశలైన పూత దశ, గింజ పాలుపోసుకునే దశల్లో తప్పకుండా నీటి తడులు ఇవ్వాలి. బిందు సేద్యం : బిందు సేద్యం ద్వారా వేరు వ్యవస్థకు నేరుగా నీరు అందించడం వల్ల 30-40% నీటి పొదుపుతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చు. తుంపర సేద్యం : తేలికపాటి నేలల్లో స్ప్రింక్లర్ల ద్వారా తక్కువ మోతాదులో, ఎక్కువసార్లు నీరు అందించడం ద్వారా ఆవిరి రూపంలో నీటి వృధా తగ్గుతుంది. పోషకాల యాజమాన్యం 2% యూరియా + 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పూత దశకు ముందు పిచికారీ చేయడం వలన పైరు కొంత మేర నీటి ఎద్దడి ప్రభావాన్ని తట్టుకుంటుంది.నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నప్పుడు కయోలిన్ (6%) లేదాసాలిసిలిక్ యాసిడ్ ద్రావణం పిచికారీ చేయడం వల్ల ఆకుల నుంచి, భాష్పోత్సేకం ద్వారా అవిరి అయ్యే నీటి పరిమాణం తగ్గి మొక్కల్లో తేమ నిల్వ ఉంటుంది. కలుపు యాజమాన్యం కలుపు మొక్కలు నేలలోని తేమ మరియు పోషకాల కోసం పంటతో పోటీ పడతాయి కాబట్టి, నీటి ఎద్దడి సమయంలో కలుపు నివారణ చేపట్టడం మరింత అవసరం.సిఫారసు చేసిన కలుపు మందులు వాడటం ద్వారా, విత్తిన 20-25 రోజులలోపు కలుపు నివారణ చేపట్టడం ద్వారా నేలలోని తేమను సంరక్షించవచ్చు. ఇతర యాజమాన్య చర్యలు నీటి కొరత ఉండే ప్రాంతాలలో సిఫారసు కంటే తక్కువ మొక్కల సాంద్రతను పాటించడం వలన అందుబాటులో ఉన్న తేమను ప్రతి మొక్క సమర్థవంతంగా వినియోగించు కుంటుంది.వరుసల మధ్య సరిపడా దూరం పాటించడం ద్వారా వేరు వ్యవస్థ విస్తరణకు, వేర్లు తేమను గ్రహించడానికి అవకాశం ఉంటుంది.తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులలో మొక్క దిగువ ఆకులను తొలగించడం ద్వారా నీటి ఆవిరి నష్టాన్ని కొంతమేర తగ్గించవచ్చును. (ఇది తీవ్రమైన ఎద్దడి సందర్భాలలో మాత్రమే చేయాలి). ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా. వి.సుజాత, శాస్త్రవేత్త ( సేద్యవిభాగం ), వ్యవసాయ పరిశోధన స్థానం, పెద్దాపురం, కాకినాడ జిల్లా