మొక్కజొన్నలో కత్తెర పురుగు - సమగ్ర యాజమాన్యం మన రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలంలో సుమారుగా 4.69 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. మొక్కజొన్నను ఆహారంగా, పశువుల దాణా, కోళ్ళకు మేత, అనేక పరిశ్రమల్లో ముడి సరుకుగా ఉపయోగిస్తున్నారు. మొక్కజొన్నను వివిధ రకాల పురుగులు ఆశించడం వలన పంట దిగుబడి తగ్గుతోంది. అందులో ప్రధానమైనది కత్తెర పురుగు. ఈ పురుగును సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించి మంచి దిగుబడి పొందవచ్చు. కత్తెర పురుగు జీవిత చక్రం తల్లి పురుగు 100-200 గుడ్ల సముదాయాన్ని అడుగు ఆకులలో, కాండంపై పెడుతుంది. తల్లి పురుగు జీవిత చక్రంలో మొత్తం 1500–2000 గుడ్లు పెడుతుంది. పొదిగిన గుడ్లు 2-3 రోజులకు పగిలి తొలిదశ లార్వాలు అదే ఆకును తొలుచుకుని తిని తర్వాత సుడిలోకి ప్రవేశిస్తాయి. తొలిదశ లార్వా ఆకుపచ్చని రంగులో ఉండి, నల్లని తలను కలిగి ఉంటుంది. ఎదిగిన లార్వా ముదురు గోధుమ వర్ణంలో ఉండి, తలపై తెల్లని తలకిందులుగా ఉన్న 'వై' ఆకారపు గుర్తు కలిగి ఉంటుంది. లార్వా దేహంపై నల్లని చుక్కలు వరుసలు ఉండి 8వ ఖండింతంపై నాలుగు నల్లని చుక్కలను చతురస్రాకారంలో గమనించవచ్చు. లార్వా దశను 14 నుండి 22 రోజులలో పూర్తి చేసుకుంటుంది. తర్వాత కోశస్థ దశను నేలలో గడుపుతుంది. కోశస్థ దశను 8-9 రోజులలో పూర్తి చేసుకుంటుంది. రెక్కల పురుగులు గోధుమ, బూడిద మిళితమైన వర్ణంలో ఉండి తెల్లటి పల్చటి కింది రెక్కలను కలిగి ఉంటాయి. రెక్కల పురుగు 7-21 రోజులు జీవిస్తుంది. పురుగు నష్టపరిచే విధానం మొదటి దశ లార్వాలు పత్ర హరితాన్ని గోకి తినడం వలన ఆకుల మీద పల్చటి పొరగా కనిపిస్తుంది. రెండవ, మూడవ దశ లార్వాలు ఆకుసుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినడం వలన విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడతాయి. అంతే కాకుండా సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరించి వేస్తుంది. ఎదిగిన లార్వాలు ఆకులను వెలుపలి నుండి లోపల వైపుకు తినివేస్తూ, ఈనెలను మాత్రమే మిగిల్చి మొక్క అంతా కత్తిరించినట్లు కనిపిస్తుంది. పురుగు విసర్జించిన పసుపు పచ్చని గుళికలను ఆకుల మీద, సుడులలో గమనించవచ్చు. కంకి పొరలను తొలుచుకుంటూ రంధ్రాలు చేసి లోపలి గింజలను తిని నష్టపరుస్తుంది. పంట కోత అనంతరం లోతైన దుక్కులు చేయడం వలన కోశస్థ దశ లేదా ఫ్యూపాలు పక్షుల బారిన పడి పురుగు ఉధృతి పైరుపై తగ్గుతుంది. పంట విత్తే ముందు సయాంట్రానిలిప్రోల్ + థయోమిథాక్సామ్ 6.0 మి.లీ. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసి విత్తాలి. పంట విత్తిన వారానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చడం ద్వారా పురుగు ఉనికిని తెలుసుకోవచ్చు. పురుగు గుడ్ల సముదాయాలను, ఎదిగిన లార్వాలను సేకరించి చంపేయాలి. మొక్కజొన్నలో సిఫారుసు చేసిన మోతాదులో ఎరువులను వేసుకోవాలి. పంటలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. మొక్కజొన్న పంట 30 రోజులలోపు ఉన్నప్పుడు 1-5 శాతం పురుగు ఆశించిన మొక్కలు గమనిస్తే వేప సంబంధిత మందైన అజాడిరక్టిన్ (1500 పి.పి.ఎం) 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వలన గుడ్లు, తొలిదశ లార్వాలు చనిపోతాయి. అంతే కాకుండా తొలిదశ లార్వాల నివారణకు బాక్టీరియా సంబంధిత మందులైన బాసిల్లస్ థురింజియెన్సిస్ ఫార్ములేషన్‌ను 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండవ దశ లార్వాల నివారణకు స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్క సుడులలో ఇసుక, సున్నంను (9:1) కలిపి వేసుకోవాలి. పంట 31-65 రోజులలోపు ఉండి 6-10 శాతం పురుగు ఆశించిన మొక్కలను గమనిస్తే రెండవ దశ దాటిన లార్వాల నివారణకు స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా స్పైనటోరం 0.5 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఇండాక్సాకార్బ్ 1 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట 65 రోజులు దాటినట్లయితే ఈ పురుగు వలన నష్టం ఎక్కువగా ఉండదు. ఎదిగిన లార్వాల మీద పురుగు మందులు పనిచేయవు. కావున ఎదిగిన లార్వాలను ఏరివేసి కిరోసిన్ డబ్బాలో వేయడం వలన పురుగులు చనిపోతాయి. అంతే కాకుండా విషపు ఎరను (10 కిలోల తవుడు + 2 కిలోల బెల్లం + 100 గ్రా. థయోడికార్బ్) సాయంకాల వేళల్లో మొక్కల సుడులలో వేయాలి. మందులు పిచికారీ చేసేటప్పుడు మొక్క సుడిలో పడేవిధంగా చూసుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు మందులను మార్చి పిచికారీ చేయడం ద్వారా కత్తెర పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఆధారం: పాడి పంటలు , మొక్కజొన్న పరిశోధనా విభాగం, రాజేంద్రనగర్, హైదరాబాద్