తెలంగాణ రాష్ట్రంలో పండించే నూనె గింజల పంటల్లో వేరుశనగ చాలా ప్రధానమైనది. రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల హెక్టార్లలో సాగవుతూ, 1.5 లక్షల టన్నుల కాయ ఉత్పత్తి, హెక్టారుకు 1.8 టన్నులు ఉత్పాదకత కలిగి ఉంది. రబీ, వేసవిలో నీటి పారుదల కింద సాగుచేస్తున్నారు. వేరుశనగను "గ్రౌండ్నట్, పీనట్, మంకీనట్, ఎర్త్ నట్ , పల్లికాయలు" అని వివిధ పేర్లతో పిలుస్తారు. అనువైన రకాలు టి.సి.జి.యస్.-1694: పంట కాలం 105 రోజుల్లోపక్వానికి వస్తుంది. ఎకరానికి 16క్వింటాళ్ల కాయ దిగుబడిని ఇస్తుంది. ఆలస్యంగా వచ్చే ఆకు మచ్చ తెగులు, తుప్పు తెగులును తట్టుకుంటుంది. కదిరి లేపాక్షి (కె-1812): పంట కాలం 115 రోజులు. ఆకుమచ్చ, వైరస్ తెగుళ్లను, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఎకరానికి 14 క్వింటాళ్ల కాయ దిగుబడి ఇస్తుంది. జె.సి.జి. 88 : రబీ, వేసవిలో 110-120 రోజులు పంట కాలం కలిగి, ఎకరానికి 10-12 క్వింటాళ్ల కాయ దిగుబడిని ఇస్తుంది. రసం పీల్చే పురుగులను, ఆకుమచ్చ తెగుళ్లను కొంత వరకు తట్టుకోగలదు. జె.సి.జి. 2141 : రబీ, వేసవిలో 110-115 రోజుల పంటకాలం కలిగి, ఎకరానికి 16–17 క్వింటాళ్ల కాయ దిగుబడిని ఇస్తుంది. రసం పీల్చే పురుగులను, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకొని పక్వ దశ వరకు ఆకుపచ్చగా ఉంటుంది. కదిరి 6 : చిన్న గుత్తితో, తక్కువ పంటకాలం కలిగి 105-110 రోజుల్లో అధిక దిగుబడినిచ్చే రకం. ఎకరానికి 16-17 క్వింటాళ్ల కాయ దిగుబడిని ఇస్తుంది. కదిరి 7 (కదిరి 7 బోల్ట్): లావు గింజ రకం. రబీలో 130 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఈ రకం ఆకుమచ్చ తెగులు, రసం పీల్చు పురుగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఎకరానికి 18–20 క్వింటాళ్ల కాయ దిగుబడిఇస్తుంది. పచ్చికాయలు అమ్మకానికి అనువైనవి. గింజల్లో30 రోజుల వరకు నిద్రావస్థఉంటుంది. కదిరి 8 (కదిరి 8 బోల్డ్): లావు గింజ రకం. రబీలో130 రోజులుపంటకాలం కలిగి ఉంటుంది. ఆకుమచ్చ తెగులు, రసం పీల్చు పురుగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఎకరానికి 18-20 క్వింటాళ్ల కాయ దిగుబడి ఇస్తుంది. పచ్చికాయలు అమ్మకానికి అనువైనవి. గింజలో 30 రోజుల వరకు నిద్రావస్థఉంటుంది. ధరణి : చిన్న గుత్తి రకం, నీటి ఎద్దడిని, కొంతవరకు వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకం. కాలపరిమితి 100-105 రోజులు. ఎకరానికి 16–18 క్వింటాళ్ల కాయ దిగుబడి ఇస్తుంది. కదిరి 9: నీటి ఎద్దడిని తట్టుకునే రకం. తక్కువ కాలపరిమితి కలిగి110-115 రోజుల్లోపక్వానికి వస్తుంది. వివిధ రకాల తెగుళ్లను, రసము పీల్చు పురుగులను కొంతవరకు తట్టుకొని, ఎకరానికి 14-15 క్వింటాళ్ల కాయ దిగుబడి ఇస్తుంది. అభయ : చిన్న గుత్తి రకం, నీటి ఎద్దడిని, టిక్కా ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. దీని వంటకాలం105-110 రోజులు, ఎకరానికి 14-16 క్వింటాళ్ల కాయ దిగుబడి ఇస్తుంది. ఆధారం: పాడిపంటలు , తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కరీంనగర్.