యాసంగిలో ఆరుతడి పంటల ప్రణాళిక ప్రస్తుతం యాసంగి పంటలు వేసుకునే సమయం రాబోతున్నందున రైతులందరూ సరైన పంటలు ఎంచుకొని, సరైన సమయంలో విత్తుకోవాల్సిన అవసరం ఉంది. వానాకాలంతో పోలిస్తే యాసంగిలో సాగునీటిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులు పంటను ఎంపిక చేసుకునే ముందే బోరు, బావి, చెరువు లేదా ఇతర నీటి వనరుల ద్వారా ఎంత నీరు అందుబాటులో ఉంటుందో అంచనా వేసుకొని, ఆ నీటితో ఎంత విస్తీర్ణంలో పంటను సాగు చేయగలమో నిర్ణయించుకోవాలి. పంట ఎంపికలో నీటి లభ్యతతో పాటు నేల స్వభావం, భూసార పరిస్థితి, గతంలో సాగు చేసిన పంట, విత్తనాల లభ్యత, పంట కాలపరిమితి, పెట్టుబడి, కూలీల లభ్యత, మార్కెట్ అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. గత సంవత్సరం ఒక పంటకు మంచి ధర వచ్చిందనే కారణంతో అదే పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయకుండా, ప్రస్తుత మార్కెట్ డిమాండ్, సాగు ఖర్చులు, ఆశించిన ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని పంటను ఎంపిక చేసుకోవడం మంచిది. నేల రకం ఆధారంగా పంటలను ఎంపిక చేసుకోవడం వర్షాధార నేలల్లో: ముఖ్యంగా ఎర్రనేలల్లో జొన్న, ఉలవలను విత్తుకోవచ్చు. వర్షాధార నల్ల నేలల్లో జొన్న, తెల్ల కుసుమ, శనగను సాగు చేయవచ్చు. నీటి వసతి గల ఎర్రనేలల్లో: పెసర, మినుము, బొబ్బర్లు, జొన్న, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న, రాగులు, వేరుశనగ, ఆముదం, కందిని సాగు చేసుకోవచ్చు. నీటి వసతి గల నల్ల నేలల్లో: మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు పైర్లను విత్తుకోవచ్చు. పట్టణాలకు దగ్గరగా ఉన్న రైతులు: కూరగాయలను సాగుచేయడం లాభదాయకం. విత్తే సమయం ఆధారంగా పంటను ఎంపిక చేసుకోవడం కంది : కందిని యాసంగి పంటగా సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 6-8 కిలోల విత్తనం అవసరం. మధ్యకాలిక రకాలైన ఎల్.ఆర్.జి.-41, ఐ.సి.వి.ఎల్.-85063, డబ్ల్యు.ఆర్.జి.-27, పి.ఆర్.జి.-158, ఎం.ఆర్.జి.-1004, డబ్ల్యు.ఆర్.జి.-53, ఆర్.జి.టి.-1, డబ్ల్యు.ఆర్.జి.-65, టి.డి.ఆర్.జి.-4, ఐ.సి.పి.హెచ్.-2740 వంటి రకాలను వేసుకోవచ్చు. యాసంగి కంది జనవరిలో పూతకు వస్తుంది. ఈ సమయంలో శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. రెండు నుండి మూడు తడులు ఇవ్వగలిగితే ఏ ప్రాంతంలోనైనా పండించుకోవచ్చు. పెసర, మినుము : ఈ రెండు పంటలను సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. పెసరలో స్వల్పకాలిక రకాలైన డబ్ల్యు.జి.జి.-42, ఎం.జి.జి.-295, 347, 348, డబ్ల్యు.జి.జి.-37, టి.ఎం.-96-2, ఎం.జి.జి.-351 రకాలను, మినుములో ఎల్.బి.జి.-20, 623, 752, 787, డబ్ల్యు.బి.జి.-26, ఎం.బి.జి.-207, పి.యు.-31 పంట రకాలు అనువైనవి. పెసర అయితే ఎకరానికి 6 కిలోలు, మినుము అయితే 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. వరి మాగాణుల్లో: వరి తరువాత పెసర, మినుమును నవంబర్ లో వేసుకోవచ్చు. వరి కోతకు 2-3 రోజుల ముందే పెసర, మినుమును చల్లుకోవాలి. ఎకరానికి 12-14 కిలోల విత్తనం అవసరమవుతుంది. పెసర పంటను వేసవి పంటగా ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. శనగ : ఈ పంటను అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. సారవంతమైన నల్లరేగడి నేలలు శనగ పంటకు అనుకూలం. శనగలో దేశవాళీ రకాలైన జె.జి.-11, 130, జె.ఎ.కె.ఐ.-9218, ఐ.సి.సి.వి.-37, నంద్యాల శనగ-1, 47, కాబూలీ రకాలైన కె.ఎ.కె.-2, పూలే జి.-95311, ఐ.సి.సి.వి.-2 లను విత్తుకోవచ్చు. శనగ సాగుకు ఎకరానికి దేశవాళీ రకాలైతే 25-30 కిలోలు, కాబూలీ రకాలైతే 45-60 కిలోల విత్తనం అవసరం అవుతుంది. శనగ వేసేవారు సాళ్ల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ., లావు గింజలు కలిగిన కాబూలీ రకాలు విత్తినప్పుడు సాళ్ల మధ్యన 45 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. అలసందలు, ఉలవలు : అలసందలను అక్టోబర్ నుండి నవంబర్ మాసం వరకు విత్తుకోవాలి. ఉలవలను అక్టోబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవాలి. ఎకరాకు 8-10 కిలోల విత్తనం అవసరం. అలసందలో జి.సి.-3, వి-240, సి.-152, కో-4, ఉలవలలో పి.డి.ఎం.-1, పి.జడ్.ఎం.-1, పి.హెచ్.జి.-62, 9, సి.ఆర్.హెచ్.జి.-19 రకాలను విత్తుకోవచ్చు. వేరుశనగ : వేరుశనగను సెప్టెంబర్ మొదటి పక్షం నుండి నవంబర్ రెండవ పక్షం వరకు విత్తుకోవాలి. కదిరి-6, 9, 7, 8, అనంత, కదిరి హరితాంధ్ర, ఐ.సి.జి.వి.-91114, ధరణి, టి.ఎ.జి.-24, కదిరి లేపాక్షి (కె-1618), విశిష్ట రకాలు అనువుగా ఉంటాయి. ఎకరాకు 60-80 కిలోల విత్తనం అవసరం. వరుసల మధ్య 22.5 సెం.మీ. దూరంలో మొక్కల మధ్య 10 సెం.మీ. ఎడంలో విత్తుకోవాలి. ఆవాలు : అతి తక్కువ నీటితో సాగు చేయబడే ఈ నూనె గింజల పంటను అక్టోబర్ మొదటి పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఆలస్యమైతే పేనుబంక, బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంది. ఆవాలు నల్లరేగడి నేలల్లో, తేలిక నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఆముదం : ఈ పంటను అక్టోబర్ రెండవ పక్షంలోపు విత్తుకోవచ్చు. ప్రగతి, హరిత వంటి సూటి రకాలతో పాటు, హైబ్రిడ్ రకాలైన పి.సి.హెచ్.-111, డి.సి.హెచ్.-177, 519 లను రెండు లేదా మూడు తడులలో పండించుకోవచ్చు. కుసుమ : నల్ల రేగడి నేలల్లో 2-3 తడులలో ఈ పంటను పండించుకోవచ్చు. అక్టోబర్ రెండవ పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. కుసుమలో టి.ఎస్.ఎఫ్.-1, మంజీర, నారి-6, పి.బి.ఎన్.ఎస్. 12, జె.ఎస్.ఎఫ్. 414, డి.ఎస్.హెచ్.-185 వంటి రకాలను విత్తుకోవచ్చు. నీరు నిలవని, బరువైన, తేమను నిలుపుకునే నల్లరేగడి నేలలు, నీటి వసతి గల ఎర్ర గరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. పొద్దుతిరుగుడు : ఈ పంటను నవంబర్ నుండి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. ఈ పంటలో కె.బి.ఎన్.హెచ్.-44, ఎన్.డి.ఎన్.హెచ్.-1, డి.ఆర్.ఎస్. హెచ్.-1 పంట రకాలను విత్తుకోవచ్చు. మొక్కజొన్న : ఈ పంటను అక్టోబర్ నుండి నవంబర్‌లోగా విత్తుకోవచ్చు. మధ్యకాలిక రకాలైన హైబ్రిడ్స్ లేదా ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్లను విత్తుకోవాలి. నవంబర్ మాసంలో విత్తుకోవాల్సి వస్తే స్వల్పకాలిక హైబ్రిడ్ రకాలను విత్తుకోవాలి. తీపి మొక్కజొన్న రకాలైన మాధురి, ప్రియ, పేలాల మొక్కజొన్న రకాలైన అంబర్ పాప్‌కార్న్, బి.పి.సి. హెచ్. 6 లను సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు విత్తుకోవాలి. మాగాణుల్లో నవంబరు నుండి డిసెంబర్ మాసాల్లో వరి కోతల అనంతరం విత్తుకోవాలి. పంట పూత దశలో అధిక ఉష్ణోగ్రతలకు (37 సెం.గ్రే. కంటే ఎక్కువ) గురి కాకుండా చూసుకోవాలి. జొన్న : ఈ పంటను యాసంగిలో అక్టోబరు రెండవ పక్షంలోపు విత్తుకుంటే పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది. నీటి లభ్యత ఉన్న చోట సి.ఎన్.వి. 29, ఆర్.సి.ఎన్.వి. 216, ఆర్.పి.ఎస్.హెచ్.-13, 16 వంటి రకాలను విత్తుకోవాలి. ఎకరానికి 3-4 కిలోల విత్తనం అవసరం. రాగులు : ఈ పంటను అక్టోబర్ చివరి వారం వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 3-4 కిలోల విత్తనం అవసరం. హిమ అనే రకం యాసంగికి అనువైనది. నీటి లభ్యత ఆధారంగా పంటలను ఎంపిక చేసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో వరి పండించడం కంటే స్వల్పకాలిక ఆరుతడి పంటలు పండించడం లాభదాయకం. వరి పంటకు 1200 మి.మీ. నీరు అవసరం. ఒక ఎకరా వరి పండించే నీటితో నాలుగైదు ఎకరాల స్వల్పకాలిక ఆరుతడి పంటలు పండించవచ్చు. అతి తక్కువ నీటితో అపరాలు, నూనె గింజలు, కూరగాయలు పండించడం ఉత్తమం. మొక్కజొన్న జల్లు వేసేటప్పుడు, పాలు పోసుకునేటప్పుడు, గింజ గట్టిపడే సమయంలో నీరు అవసరం. వేరుశనగలో విత్తిన వెంటనే, 20-25 రోజుల తరువాత పూత, కాత దశలో ప్రతి 10-15 రోజులకు తడివ్వాలి. పొద్దుతిరుగుడులో ఆశించిన దిగుబడి సాధించాలంటే మొగ్గ తొడిగే దశ, పువ్వు వికసించే దశ, గింజ కట్టే దశల్లో నీటి తడి అవసరం. శనగ పంటలో విత్తిన 20-25 రోజులకు ఒక తడి ఇవ్వాలి. బలమైన నేలల్లో విత్తిన కుసుమ పంటకు నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. తేలిక నేలలకు, ఆలస్యంగా విత్తిన పంటకు ఒకటి-రెండు సార్లు తడులు ఇవ్వడం అవసరం. అందువలన నీటి వసతి, లభ్యత ఆధారంగానే పంటలను ఎంచుకుంటే పంట కీలక దశల్లో నీటి ఎద్దడికి గురికాకుండా మంచి దిగుబడులతో కూడిన ఆదాయాన్ని పొందవచ్చు. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక