వరి నారుమడిలో మెళకువలు తెలంగాణ రాష్ట్రంలో వరి ప్రధాన పంట. దీనిని వివిధ వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు చాలా ప్రాంతాల్లో నార్లు పోసుకుంటున్నారు. అధిక దిగుబడి సాధించడంలో ఆరోగ్యవంతమైన నారుమడి కీలకం. పిలకదశలో ఆరోగ్యవంతమైన నారు వేయడం ద్వారా పంటను చీడపీడల ఉధృతి నుండి కాపాడవచ్చు. కచ్చితమైన ముఖ్య అంశాలను దృష్టిలో ఉంచుకుని నారుమడిలో ఈ కింది యాజమాన్య పద్ధతులను పాటిస్తే రైతులు ఎక్కువ దిగుబడులు పొందగలరు. నేలలు : సమస్యాత్మక నేలలు (చౌడు / క్షారం / ఆమ్లం) తప్ప సాధారణంగా వరి సాగుకు అన్ని నేలలు అనుకూలం. నీటి ముంపుకు గురయ్యే భూములు సాగుకు అనుకూలం కాదు. నీరు అధికంగా అవసరమయ్యే చౌక, దుబ్బ నేలల్లో ఇతర పంటలు వేయటం మంచిది. పంట కాలం : వానాకాలంలో వరి పంటను జూన్ నుండి డిసెంబర్ వరకు సాగు చేసుకోవచ్చు. విత్తన మోతాదు : నాటే పద్ధతిలో ఎకరానికి 25 కిలోలు (దొడ్డు రకాలు) 20 కిలోలు (సన్న రకాలు) విత్తన శుద్ధి : మెట్ట నారుమళ్ళకు కిలో విత్తనానికి 3 గ్రా కార్బండాజింను తడితో పట్టించి అరబెట్టి నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము నారుమళ్ళకు లీటరు నీటికి 1 గ్రా కార్బండాజిమ్ కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి, తర్వాత మండె కట్టిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలకు లీటరు ద్రావణం సరిపోతుంది. నిద్రావస్థను తొలగించటానికి లీటరు నీటికి 6.3 మి.లీ. గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి, కడిగి మండెకట్టాలి. నారుమడి నేలను 2-3 సార్లు బాగా దున్ని 2-3 సార్లు దమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టటానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారుమళ్ళను తయారు చేయాలి. దమ్ము చేసిన నేలను 10 మీ. పొడవు, 1 మీ. వెడల్పుతో నారుమడిని చేసుకోవాలి. నారుమడిలోని నీరు పోషకాలు బయటపోకుండా ఉండేలా గట్లు వేసుకోవాలి. గట్లను సమంగాను, గట్టిగాను పోయాలి. మడిలో చెత్తా చెదారం లేకుండా జాగ్రత్త పడాలి. నారుమడి బరద పదునులో ఉండాలి. రెండు మడుల మధ్యలో 20 సెం. మీ. వెడల్పుతో కాలువలు తీయాలి. కాలువలో మట్టిని తీసి మడిలో వేసి నారుమడిని ఎత్తుగా చేసుకోవాలి. రెండు గుంటల (5 సెంట్లు) నారుమడికి 2 కిలోల నత్రజని (1 కిలో విత్తనం చల్లే ముందు, మరో కిలో విత్తిన 12–14 రోజులకు), 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. పశువుల పేడ లేదా ఇతర సేంద్రియ ఎరువులను దుక్కిలో వేయడం చాలా మంచిది. మొలక కట్టిన విత్తనాన్ని చల్లి, మొదట్లో (వారం రోజులు) ఆరు తడులు ఇచ్చి, ఆ తర్వాత మొక్క దశలో పలుచగా (2-3 సెం.మీ.) నీరు ఉంచాలి. జింకు లోప సవరణకు లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్పేటు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మెట్ట నారుమడిలో ఇనుప ధాతు లోపాన్ని గమనిస్తే సరి చేయాలి. మొక్క రోజులు, ఎదుగుదలను బట్టి 2 నుండి 5 గ్రా. అన్నబేధి + 0.5 – 1 గ్రా. నిమ్మ ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారు పీకడానికి 7 రోజుల ముందు గుంట నారుమడికి (2.5 సెంట్లు) 400గ్రా.. కార్బోప్యూరాన్ 3 జి గుళికలు ఇసుకలో కలిపి చల్లి పలుచగా నీరుంచాలి. నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితిలో రెండవ దఫా నత్రజనిని ఆలస్యంగా వేసి నారు ముదరకుండా చూడాలి. అవసరాన్ని బట్టి మడిలో ఇతర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారుమడిలో బ్యూటాక్లోర్ లేదా (పెటిలాక్లోర్ + సేఫనర్ 5 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి విత్తిన 8-10 రోజులకు పిచికారీ చేసుకోవాలి. బిస్ పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 0.5 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి విత్తిన 10-12 రోజులకు పిచికారీ చేసుకోవాలి. నారుమడిలో ఊద, ఒడిపిలి వంటి గడ్డి జాతి కలుపు ఉన్నట్టైతె విత్తిన 10-12 రోజులకు సైహలోఫాప్– పి బ్యుటైల్ అనే కలుపు మందును 1.5 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పాడి పంటలు కె. నాగాంజలి, డి.స్రవంతి, కె. శిరీష, పి. నీలిమ, ఎన్. చరిత, ఎల్. శ్రావిక, జె. హేమంత కుమార్ వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధారం: పాడి పంటలు