వరి ఉత్పాదకతను సుస్థిరంగా పెంచడానికి సమగ్ర పోషక యాజమాన్యం తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న ప్రధానమైన ఆహార పంట వరి. ఇటీవలి కాలంలో వస్తున్న వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురిసే వర్షాలు, చీడపీడలు, రాను రాను కూలీల సమస్య వరిలో దిగుబడుల మీద, ఉత్పత్తి మీద ఇతర అంశాలైన నేల, నీరు, విత్తనాలు, పోషకాల యాజమాన్యం ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వరిలో సరాసరి దిగుబడి పెంచడానికి అందుబాటులో ఉన్న తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులను వినియోగించాలి. కేవలం రసాయన ఎరువులనే వాడకుండా సేంద్రియ పదార్థాలను వాడకాన్ని పెంచుతూ భవిష్యత్తు తరాలను ఆరోగ్యవంతమైన, ఫలవంతమైన నేలను అందించాలి. వరి పంటలో అధిక, సుస్థిర దిగుబడులు సాధించాలంటే పోషక పదార్థాలు సమతుల్యంగా తగిన మోతాదులో అందించాలి. అంటే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. సమతుల్యంగా పోషక పదార్థాలు వాడకపోతే తెగుళ్ళ వల్ల పంట ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. పంట అవసరాన్ని బట్టి. భూసార సహజ వనరుల శక్తిని సమన్వయం చేసి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల వాడకం నిష్పత్తిని నిర్ణయించాలి. కేవలం నత్రజని ఎరువులనే అధికంగా వాడి భాస్వరం పొటాష్ ఎరువులను వాడకపోవడం వలన చీడపీడల ఉధృతి ఎక్కువై పంట నాణ్యత తగ్గుతుంది. భూసార పరిరక్షణకు, సుస్ధిర దిగుబడులకు, ఉత్పత్తి స్తబ్దతను అధిగమించడానికి రసాయన ఎరువులతో పాటు అందుబాటులో ఉన్న ఏదో ఒక సేంద్రియ ఎరువుగానీ, జీవన ఎరువులు గానీ 30-50 శాతం మేర వాడుకోవాలి. అంతేగాక పచ్చిరొట్ట ఎరువులు కూడా వాడి పైరుకు సమతుల్యంగా పోషక వదార్థాలు అందించాలి. వీటితో పాటు సూక్ష్మపోషకాలైన జింకు, కాపర్, మాంగనీస్, బోరాన్, మాలిబ్దినం, ఉపపోషకాలైన కాల్షియం, మెగ్నిషియం, గంధకంలను కూడా మొక్కలు నేలనుండి సంగ్రహిస్తాయి. ప్రతి పోషకం పాత్ర జీవ క్రియలో ప్రత్యేకంగా ఉంటుంది. ఒక పోషకం లోపిస్తే అది చేసే పని దెబ్బతింటుంది. దాని ప్రభావం దిగుబడి మీద పడుతుంది. కావున పోషకాలను తగు మోతాదులో, సరైన సమయంలో, సరైన పద్ధతిలో అందిస్తేపైరు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడినిస్తుంది. ప్రస్తుతం సాగు చేస్తున్న అధిక దిగుబడినిచ్చే రకాలు, సంకరజాతి వరి రకాలు వాటి కాలానుసారం, భూసార వనరుల శక్తి కాలపరిమితి అనుసరించి దిగుబడి ఉంటుంది. మొదటగా పంట నేల భూసారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మట్టి నమూనాలు సేకరించి, నేలలోని నత్రజని, భాస్వరం, పొటాష్ శాతాన్ని సూక్ష్మపోషకాల లభ్యత గూర్చి ప్రయోగశాలలో, పరీక్ష చేసి పోషకాల స్థాయిని తెలుసుకుని, పంటకు కావాల్సిన స్థాయిని లెక్క చేసి అనవసర ఖర్చు తగ్గించవచ్చు. రసాయన, సేంద్రియ ఎరువుల కలయిక పంటకు మంచి నాణ్యతను, దిగుబడిని ఇస్తుంది. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వర మోతాదులను 10–20 శాతం తగ్గించవచ్చు. అజొల్లా అజొల్లా జీవన ఎరువును మాగాణి వరి పొలంలో ఉపయోగించడం వలన వరి దిగుబడులు 20 శాతం వరకు పెంచవచ్చు. వరి పొలంలో దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ను వేసి పలుచగా నీరు నిలువకట్టి 100-150 కిలోల అజోల్లా వేసి 2-3 వారాలు పెరగనిచ్చి నేలలో దున్నాలి. ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్ట, 12 కిలోల నత్రజనిని నేలకు చేరవేస్తుంది. అజటోబ్యాక్టర్ ఇవి స్వతంత్రంగా జీవించే సూక్ష్మజీవులు, ఈ బాక్టీరియాను పప్పుజాతి పంటలకు తప్ప అన్ని రకాల పంట పొలాల్లో, నారుమడుల్లో, కూరగాయ, ఉద్యాన పంటలలో నత్రజని లభ్యత కొరకు వాడుకోవచ్చు. మొక్కలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నేలలో నివసిస్తూ గాలి నుండి నత్రజని తీసుకొని వివిధ మొక్కలలో నత్రజనిని స్థిరీకరిస్తాయి. అజటోబాక్టర్ వాడడానికి ఎకరాకు సరిపడా విత్తనానికి 200-400 గ్రాముల కల్చర్‌ను పట్టించాలి. లేదా ఎకరాకు 1 కిలో కల్చర్‌ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి చల్లాలి. దీని వలన ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. ఏరోబిక్ వరిలో మాత్రమే ఇది అవసరం. వరిలో నాట్లు వేయడానికి 15 రోజుల ముందు నుండి పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించి రెండు నుండి మూడు సార్లు దమ్ము చేయాలి. పొలమంతా సమానంగా చెక్కతో గాని జమ్ముతో గాని లేదా ట్రాక్టర్కున్న లెవెలర్ గాని చదును చేయాలి. ఈ విధంగా చేయడం వలన కలుపు తగ్గి పిలకలు బాగా తొడిగి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. నాట్లు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఐదు ఆకులు ఉన్న నారును రకాన్ని బట్టి నిర్ణీత దూరం పాటించి నాటుకోవాలి. ఒక వేళ దగ్గరగా నాటినట్లయితే పంట ఎదుగుదల, దిగుబడి తగ్గుతుంది. వానాకాలంలో భూసారాన్ని బట్టి, రకాన్ని బట్టి చదరపు కుదుళ్ళ సంఖ్య మారుతుంది. దీర్ఘకాలిక రకాలను చదరపు మీటర్‌కి 33 కుదుళ్ళు, మధ్య కాలిక రకాలకు అయితే 44 కుదుళ్ళు, స్వల్పకాలిక రకాలకు 66 కుదుళ్ళు ఉండేటట్లు చూసుకోవాలి. నారు మొనలలో కాండం తొలిచే పురుగు గుడ్లు పెడుతుంది. కాబట్టి నాట్లు వేసేటప్పుడు ముందుగా నారు మొనలను తుంచి వేయాలి. దీని వలన వరి పంటకు కాండం తొలిచే పురుగు, హిస్పా, ఆకుముడత పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. పంట మొదళ్ళలో సుడిదోమ ఉదృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నాట్లు వేసేటప్పుడు ప్రతి రెండు మీటర్లకి 30 సెం.మీ. కాలిబాటలను వదలాలి. దీని వలన గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని కొంతవరకు అదుపు చేయవచ్చు. ఈ కాలిబాటలు వేయడం వలన మొదళ్ళకి వెలుతురు తగిలి సుడిదోమ ఉధృతి నుండి పంటని కాపాడవచ్చు. చౌడు పొలాల్లో నాటు వేసే ముందు బాగా దమ్ము చేసి నీరు తీసివేయాలి. చౌడు ప్రాంతాల్లో కుదురుకు మూడు నుండి నాలుగు మొక్కలు, నాటు దూరం తగ్గించి, కొంచెం లోతుగా నాటుకోవాలి. ఒక వేళ లేతనారు పైపైన నాటినట్లయితే లవణాల ప్రభావంతో నారు చనిపోతుంది. వరిలో నాటు వేసే ముందు రూట్ డిఫ్ ట్రీట్ మెంట్ కనుక అనుసరిస్తే కాండం తొలిచే పురుగు నుండి వరిని కాపాడుకోవచ్చు. ఈ రూట్ డిప్ ట్రీట్మెంట్ పద్ధతిలో 200 మి.లీ. క్లోరిఫైరిఫాస్ నుండి 200 లీటర్ల నీటితో కలిపి ఆ మిశ్రమంలో 30 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత నాటుకోవాలి. ఈ మిశ్రమం ఐదు సెంట్లు నారుమడికి సరిపోతుంది. నారుముదిరి ఆలస్యంగా నాటువేయాల్సి వస్తే కుదుళ్ళ సంఖ్యను పెంచి కుదురుకు 6-8 మొక్కలు చొప్పున నాటుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నత్రజని ఎరువును సిఫారుసు కంటే 25 శాతం పెంచి, మూడు దఫాలుగా కాక రెండు దఫాలుగా అంటే 70 శాతం నాటే దశలో, మిగతా 30 శాతం అంకుర దశలో వేయాలి. వరిలో ఎరువుల యాజమాన్యం రైతు స్వల్పకాలిక రకాలను పండించాలను-కున్నప్పుడు నత్రజని మూడు సమభాగాలుగా చేసుకుని నాటడానికి ముందు దమ్ములోను, బాగా దుబ్బు చేసే దశలోనూ, అంకురం తొడిగే దశలోనూ వేయాలి. బురద పదునులో మాత్రమే సమాన పాళ్ళలో వెదజల్లి 36 నుండి 48 గంటల తర్వాత పల్చగా నీరు పెట్టాలి. రైతులు వరిలో మధ్య, దీర్ఘకాలిక రకాలను వేసినప్పుడు నత్రజని నాలుగు దఫాలుగా అంటే 15-20 రోజులకు ఒకసారి వేసుకోవాలి. చివరి దఫాగా మాత్రం వరి పంటలో అంకురం దశలో వేయాలి. ఆ తర్వాత నత్రజనిని పంటకి వేయరాదు. రైతులు భాస్వరం ఎరువుని పూర్తిగా దమ్ములోనే వేసుకోవాలి. ఆ తర్వాత కాంప్లెక్స్ రూపంలో ఎరువులు వేయకూడదు. వరి నాట్లు వేసినప్పుడు పొటాష్ ఎరువును ఆఖరి దమ్ములో సగం, అంకురం దశలో మిగతా సగం చేయాలి. రైతులు భాస్వరాన్ని ఎస్.ఎస్.పి. రూపంలో వేయాలనుకున్నప్పుడు 93 కిలోల యూరియా, 125 కిలోల ఎస్.ఎస్.పి., 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు సరిపోతుంది. రైతులు భాస్వరాన్ని డి.ఎ.పి. రూపంలో వేయాలనుకున్నప్పుడు 77 కిలోల యూరియా, 43 కిలోల డి.ఎ.పి., 27 కిలోల పొటాష్ వేసుకోవాలి. జింకుధాతు లోపం వరిలో జింకుధాతు లోపం వలన మొక్కలలో పై నుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ముదురాకు చివర్లలో, మధ్య ఈనెకు ఇరు పక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా, పెళుసుగా మారడం, మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. దీని సవరణకు కేవలం వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి, లేకపోతే ప్రతి రబీ సీజన్లో, ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్‌ను వేసుకోవాలి. ప్రత్యామ్నాయంగా 10 కిలోల జింక్ సల్ఫేట్ 200-250 కిలోల మాగిన పశువుల పేడ లేదా వర్మీకంపోస్టు కలిపి 20-30 రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మగ్గనిచ్చి, ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి. పైరుకు జింకులోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2,3 సార్లు పిచికారీ చేయాలి. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు లేదా తెగుళ్ళ మందులను కలపరాదు, చౌడు నేలల్లో తప్పనిసరిగా పిచికారీ చేయాలి. ఇనుపధాతు లోపం ఇనుపధాతు లోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి, ఎత్తు పెరగదు. వర్షాధార నారుమళ్ళలో, మెట్ట వరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. వరి పంటలో ఇనుపధాతు లోప సవరణకు లీటరు నీటికి 2-5గ్రా. అన్నభేదిని 0.5 నుండి 1 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉండే తడి నారుమడులలో ఈ సమస్య కనిపించదు. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు , ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, జగిత్యాల.