తెలంగాణ రాష్ట్రంలో వరిని వానకాలంలో సుమారుగా 50 లక్షల ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వరిలో అధిక దిగుబడి సాధించాలంటే కొన్ని ముఖ్యమైన చీడపీడలను సకాలంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే ఆశించిన మేరకు ఫలితాలను పొందవచ్చు. వరిని తొలిదశలో ఆశించే ముఖ్యమైన చీడపీడలు ఉల్లికోడు దీనినే గొట్టపు రోగం లేదా గొట్టాలు అని అంటారు. ఈ పురుగు నారుమడి, పిలక దశల్లో ఆశిస్తుంది. పురుగు ఆశించిన మొక్కల అంకురం ఉల్లి కాడవలె లేత ఆకుపచ్చని పొడుగాటి గొట్టంగా మారుతుంది. ముఖ్యంగా ఈ పురుగు నాట్లు ఆలస్యం అయిన పొలాల్లో అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగు నివారణకు ఎకరానికి సరిపడ నారుమడిలో 800గ్రా. కార్బోఫురాన్ 3జి గుళికలు వేసుకోవాలి. నాటిన 10-15 రోజుల్లో 10కేజీల కార్బోఫురాన్ 3జి గుళికలు వేయాలి లేదా ఫిప్రోనిల్ 5 యస్. సి. 2.5 మి. లీ. పిచికారీ చేయాలి. కాండం తొలిచే పురుగు (దీనినే మొగి పురుగు అని కూడా అంటారు) ఈ పురుగు నారుమడి దశ నుంచే ఆశించి నష్టం కలుగజేస్తుంది. నారుమడిలో ఆశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే మొవ్వులు ఎండి చనిపోతాయి. చనిపోయిన మొవ్వును చేతితో లాగితే సులభంగా ఊడి వస్తుంది. పిల్ల పురుగులను కూడా గమనించవచ్చు. అంకురం నుండి చిరు పొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్లకంకులు బయటకు వస్తాయి. ఈ పురుగు నివారణకు నారుమడిలో నారు పీకే వారం రోజుల ముందు ఎకరానికి సరిపడా నారు మడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు చల్లుకోవాలి, ప్రధాన పొలంలో నాటిన 20 రోజుల లోపు ఎకరానికి 10 కేజీల కార్బోఫ్యూరాన్ 3జి లేదా 8 కేజీల కార్టప్ హైడ్రో క్లోరైడ్ 4జి గుళికలు 20 కేజీల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఈ పురుగు ఉధృతిని బట్టి అవసరం మేరకు క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లేదా కార్టప్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్.పి 2 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. సుడి దోమ దీనినే మసిపేను అని కూడా అంటారు ఈ పురుగు సెప్టెంబర్ నుండి నవంబర్ మాసంలో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు పిల్ల, పెద్ద దోమలు నీటి పై భాగంలో దుబ్బుల మొదళ్ళ దగ్గర వుండి రసం పీల్చటం వలన పైరు లేత పసుపు వర్ణానికి మారుతుంది. ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు పొలంలో నీటిని గమనిస్తే తెట్టులాగా తేలియాడుతూ కనపడుతుంది. పైరు సుడు సుడులుగా వలయ కారంలో ఎండిపోతూ ఉంటుంది, దీనినే హెరీపర్బర్న్, దోమ పోటు అని అంటారు. ఉదృతి ఎక్కువైతే పొలం ఎండిపోయి పడిపోతుంది. తాలు గింజలు ఏర్పడతాయి. ఈ పురుగు 'గ్రాసీ స్టంట్' అనే వైరస్ తెగులును వ్యాప్తి చేస్తుంది. దోమ పోటు నివారణకు పొలంలో నీరు తగ్గించి పొలాన్ని అడపా దడపా ఆరబెట్టాలి, సిఫారసు నత్రజని ఎరువును ఒకే దఫా కాకుండా సమపాళ్ళలో 3 సార్లు వెయ్యాలి. దోమ ఉధృతికి దోహదపడే మందులైన క్లోరోపైరిఫోస్, ప్రొఫెనోఫాస్, సింథటిక్ పైరిత్రోయిడ్స్ లేదా సిఫారసు చేయని బయో మందులను వాడరాదు. అంకురం నుండి చిరు పొట్ట దశలో ఉన్న వరి పైర్లలో నీరు తగ్గించి ఏసిఫేట్ 75 ఎస్.పి 1.5 గ్రా. లేదా బుప్రోఫెజిన్ 1.6 'మి.లీ. లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు డైనోటి ఫ్యూరాన్ 0.4 గ్రా. లేదా పైమెట్రో జెన్ 0.6గ్రా. లేదా ట్రైఫ్రూమైజో పైరిమ్ 0.49 మీ.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పాముపొడ తెగులు వరి పైర్లు దుబ్బు కట్టే దశల్లో నీటి మట్టానికి దగ్గరగా ఉండే ఆకుల తొడిమేలపైన, కాండం మీద పొడవుగా మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పాముపొడ ఆకారం పోలి ఉంటాయి. ఉధృతి ఎక్కువైతే మొక్కలు గుంపులుగా చనిపోతాయి. నివారణకు అధిక నత్రజని ఎరువులను వాడకూడదు. కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలి. ప్రాపికోనజోల్ 1 మి.లీ లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా వాలిడామైసిన్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఈ తెగులు సన్నగింజ రకాల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన ఆకులపైన పసుపు రంగు నీటి మచ్చలు ఏర్పడి అవి అంచుల వెంబడి కిందికి మట్టల వరకు వ్యాప్తి చెందుతాయి. ఈ తెగులు తొలిదశలోనే గుర్తించినట్లయితే నత్రజని ఎరువులను తాత్కాలికంగా నిలిపివేయాలి. ఈ తెగుళ్లను తొలిదశలోనే నిరోధించడానికి ప్లాంటామైసిన్ లేదా అగ్రిమైసిన్ 80 గ్రా ఎకరానికి పిచికారీ చేయాలి. ఆధారం: పాడి పంటలు మాస పత్రిక డా.డి.వీరన్న, డా.ఆర్.శ్రవణ్ కుమార్, డా. ఎల్. కృష్ణ, డా.జి. శేషు, డా.వై. హరి, బి, మాధవి, డా. జె. భార్గవి. మానస, బి. సౌందర్య, సి.ఎచ్.రాములు, డా.ఎ.వెంకట్ రెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్