మన రాష్ట్రంలో వివిధ రకాల నూనె గింజల పంటలు పండిస్తున్నారు. వాటిలో నువ్వు పంట కూడా ముఖ్యమైనది. వివిధ ప్రాంతాలలో ఈ నువ్వు పంటను రైతులు సాగు చేస్తున్నారు. వివిధ సమయాల్లో లేదా సీజన్లలో అంటే ఖరీఫ్, రబీ లేదా వేసవిలో ఈ పంటను పండించవచ్చు. ఈ పంట పండించడానికి మురుగు నీరు నిలవని, తేమ నిలిచే తేలికైన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఈ పంటను వివిధ పరుగులు ఆశించి, పంటకు నష్టం కలుగచేసి, దిగుబడులు తగ్గి, రాబడిని తగ్గిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి. ఆకుమడత, కాయ తొలిచే పురుగు ఇవి నువ్వు పంటను మాత్రమే ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి. తల్లి రెక్కల పురుగు మెరిసేటటువంటి, బల్ల పరుపుగా ఉండే గుడ్లను మొక్కల లేత భాగాల మీద పెడుతుంది. గుడ్లనుండి 4-5 రోజులలో పిల్లపురుగులు బయటికి వచ్చి నష్టాన్ని కలిగిస్తాయి. తొలి దశలో చిన్న గొంగళి పరుగులు రెండు లేదా మూడు లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపలి నుండి ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గోకి తినడం వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు పెరిగే కొద్ది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసుకొని ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటకు తీవ్ర నష్టం కలుగచేస్తాయి. బాగా పెరిగిన గొంగళి పరుగులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి నల్లటి తలతో శరీరంపైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. ఈ లార్వా (గొంగళి పురుగు) దశ సుమారు 2 వారాలు ఉంటుంది. కోశస్థ దశని లార్వా ఏర్పాటు చేసిన గూడులో పూర్తి చేసుకొంటుంది. ఈ పరుగు నివారణకి పరుగు ఆశించిన ఆకులను పురుగులతో సహా ఏరి నాశనం చేయాలి. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ పురుగు నష్టాన్ని తగ్గించవచ్చు. కోడు ఈగ దక్షిణ భారత దేశంలో, రాజస్తాన్లో నువ్వు పంటను మాత్రమే ఆశించి నష్టాన్ని కలుగచేస్తుంది. తల్లి పురుగు దోమవలె ఉండి పూమొగ్గలలో, అండాశయంలో గుడ్లను చొప్పించి పెడుతుంది. గుడ్ల నుంచి వెలువడిన చిన్న పురుగులు లేత మొగ్గ, పూత తినివేయడం వలన మొగ్గలు పువ్వుగా ఏర్పడవు, పువ్వులు కాయలుగా ఏర్పడవు. అలాగే కాయలు గింజలు కట్టక, తాలు కాయలు ఏర్పడతాయి. ఈ పురుగు ఆశించిన మొగ్గ, పూత వాడి రాలిపోతుంది. ఈ పురుగు నివారణకి పరుగు ఆశించిన మొగ్గల్ని తాలు కాయలని ఏరి నాశనం చేయాలి. మొగ్గ దశలో డైమిధోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ పరుగును అరికట్టవచ్చు. రసం పీల్చే పురుగులు (తామర పురుగులు, పచ్చదోమ, తెల్లనల్లి) పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో ఉండి ఆకుల నుంచి రసాన్ని పీల్చివేస్తాయి. పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి, తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి, కింది వైపుకు ముడుచుకొని పోయి, దోనె ఆకారంగా మారి పాలిపోతాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లనల్లి నివారణకి డైకోఫాల్ 5 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బీహారి గొంగళి పురుగు ఈ పురుగు వివిధ రకాల పంటల్ని ఆశించి, వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే నష్టంతీవ్రంగా ఉంటుంది. మొదటగా తొలిదశలో ఈ చిన్న లార్వాలు (గొంగళి పరుగులు) గుంపులు గుంపులుగా ఉండి ఆకులలోని పత్రహరితాన్ని గోకి తిని, క్రమ క్రమంగా జల్లెడాకులుగా చేస్తాయి. చివరగా ఈనెలు మాత్రమే మిగులుతాయి. ఎదిగిన గొంగళి పురుగులు ఇతర మొక్కలపైకి పాకుతూ మొగ్గలకు, పువ్వులకు, కాయలకి రంధ్రాలు చేసి, విత్తనాలని తిని నష్టాన్ని తీవ్రం చేస్తాయి. నివారణకి గుడ్లని గుంపులుగా పెడాయి కాబట్టి, గుంపులుగా ఉన్న గుడ్లని, చిన్న లార్వాలని ఆకులతో సహా తీసివేసి నాశనం చేయాలి. అలాగే క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక