నవంబర్ మాసానికి జులైలో విత్తిన వరి పొలా లు (కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, ఉత్తర కోస్తా) గింజ గట్టిపడే దశ నుంచి కోత దశలో ఉంటాయి, ఆగస్టులో ఆలస్యంగా నాటిన పొలాలు (బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల) పూత దశలో, సెప్టెంబర్ లో విత్తి అక్టోబర్ మొదటి పక్షంలో నాటిన పొలాలు (బాపట్ల, (ప్రకాశం) పిలకల దశలో ఉంటాయి కావున ఈ క్రింది తెలిపిన సూచనలు పాటించాలి. సార్వా వరి సార్వాలో సాగవుతున్న వరి పంట పాలుపోసుకునే దశ నుంచి కోత దశలో, గింజ గట్టిపడే దశ నుంచి కోత దశలో ఉన్నది. కోతకు వారం రోజుల ముందు వరకు ఆఖరి తడి ఇచ్చి, నీరు కట్టడం ఆపేయడం వల్ల గింజలు సమానంగా తోడుకుంటాయి. వరి కోత యంత్రంతో కోత కోసేటప్పుడు వారం రోజుల ముందు నుంచి చేను ఆర బెట్టడం వల్ల కోత త్వరగా పూర్తికావడమే కాకుండా గింజ వెన్నుపై కొంత ఆరుతుంది. వరి తర్వాత దాళ్వాలో అపరాలు సాగుచేసే రైతులు భూమిలో తగిన తేమ ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. నవంబర్-లో మంచు పడే వాతావరణం ఉండటం వల్ల దోమపోటు, మానిపండు తెగులు, మెడవిరుపు తెగుళ్ళు ఆశించవచ్చు. గొలుసు కట్టు దగ్గరగా ఉండేరకాలైన ఎం.టి.యు 1318. ఎం.టి.యు. 1121, ఎం.టి.యు.1271, ఎం.సి.ఎం.125 ఎం.టి.యు.1262. వంటి రకాలలో మానిపండు తెగులు వచ్చే అవకాశం ఉన్నందున 50% ఈనిక దశలో మధ్యాహ్నం పూట కార్బండిజం 200గ్రా. లేదా ప్రాఫికొనజోల్ 200 మి.ల్లి. చొప్పున ఏకరాకు పిచికారీ చేసుకోవాలి. దోమపోటు నివారణకు ఎకరానికి ఇమిడాక్లోప్రిడ్ + ఎథిప్రోల్ 50 గ్రా. లేదా డైనోటేప్యూరాన్ 80గ్రా. లేదా పైమెట్రోజైన్ 120 గ్రా. లేదా ట్రైఫుమెజో పైరం 96 మి.లీ కలిపి పిచికారీ చేసుకోవాలి. దోమ ఉధృతిని పెంచే సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు కానీ, మూడు నాలుగు రకాల మందులు కలిపి పిచికారీ చేయడం గానీ చేయకూడదు. పిచికారీ మందు మొక్క మొదళ్లకు తగిలేలా పిచికారీ చేయడం వల్ల నివారణ సక్రమంగా జరుగుతుంది. కంకి నల్లి నివారణకు ఎకరానికి స్పైరోమెసిఫెన్ 240ఈ.సి. ఎకరానికి 200 మిల్లి పిచికారీ చేయాలి. మెడవిరుపు తెగులు నివారణకు ఎకరానికి నీటికి 120 గ్రా. ట్రైసైక్లోజోల్ 75% లేదా 300 మి.లీ. ఐసోప్రొధయోలిన్ లేదా 500 మి.లీ కాసుగామైసిన్ 3 ఎల్. మందు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. దాళ్వా వరి ఆంధ్రప్రదేశ్లో దాళ్వా వరి సాగు సుమారు 7 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు అయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం దాళ్వా వరి జనవరిలో కూడా నారుమడులు పోయటం వల్ల పంట పూత దశలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యం కోతకు ఏప్రిల్ మొదటి వారం తరువాత వచ్చినప్పుడు ధాన్యం ముక్క అయ్యి రైతుల కొనుగోలు సమయంలో ఇబ్బంది పడ్డారు. దాళ్వాలో వరి రకాల ఎంపిక ఆయా ప్రాంతాల మార్కెట్, నీటి లభ్యత ఆధారంగా చేసుకోవాలి. దాళ్వా వరి కోత మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మొదటి వారంలో పూర్తి చేసుకోవటం వల్ల ధాన్యం ముక్క అవదు. ఆరోగ్యవంతమైన నారు మడి పెంచడానికి ఎకరానికి 25 కిలోల విత్తనం తీసుకొని లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానపెట్టి, మండెకట్టి మొలక వచ్చిన విత్తనాన్ని చల్లాలి. 4కిలోల యూరియా, 6 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 1.6 కిలోల మ్యురేటే ఆఫ్ పొటాష్ 5 సెంట్ల నారుమడికి వేయాలి. 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బొఫ్యురాన్ గుళికలు నాటటానికి ఒక వారం ముందు నారుమడి లో చల్లాలి. దాళ్వాలో సిఫారసు చేసిన రకాలు 21 రోజులు వయస్సు గల నారును ఉపయోగించి సకాలం లో నాట్లు పూర్తి చేసుకోవాలి. నవంబర్ లో తుఫాన్ వర్షాలకు నీరు బయటకు పోయేలా నారుమడులు, ఎద పద్ధతిలో సాగు చేసే పొలాలలో కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. దమ్ము చేసి వెదజల్లిన పొలాలకు 3-7 రోజులలోపు పైరాజాసల్ఫాన్ ఈథైల్ కలుపు మందు ఎకరానికి 80 గ్రా.20 కిలోల పొడి ఇసుకతో కలిపి చల్లుకోవాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు, పశ్చిమ గోదావరి