మల్లె సాగు - అంతర్జాతీయ మార్కెట్ లో అవకాశాలు

స్వచ్ఛమైన తెల్లనిరంగు, మనసును ఆహ్లాదపరిచే సువాసనల పరిమళాలు వెదజల్లేవి మల్లె పూలు. కొన్ని జాగ్రత్తలతో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ పూలసాగుతో రైతులకు లాభాల గులాబింపే. స్థానిక, విదేశీ మార్కెట్లకు విస్తృత ఎగుమతి అవకాశాలున్నాయి. ఒకసారి నాటుకుంటే ఏళ్ళపాటు రాబడి పొంద వచ్చు. మల్లెల్లో ముఖ్యరకాలు, ఎగుమతి సదుపాయాలపై వివరంగా తెలుసుకుందాం.

నాటటం

మల్లె మొక్కలను తేలికపాటి నేలల్లో నాటాలి. జూన్–సెప్టెంబరు వరకు ఎప్పుడైనా నాటవచ్చు. సాయంత్రం పూట నాటడం వల్ల మొక్క బాగా నాటుకుంటుంది. అంటు మొక్కలను వరుసల మధ్య మొక్కల మధ్య 1.25-2 మీటర్ల ఎడం ఉండేలా నాటుకోవాలి.

గుంతలు: 30×30×30 సెం.మీ, దూరం: 1.25 మీటర్లు × 1.25 మీటర్లు, హెక్టారుకు : 6400 మొక్కలు.

కొమ్మ కత్తిరింపులు: (15-20 సెం.మీ) ద్వారా గాని, అంటు మొక్కలు తొక్కడం ద్వారా గాని ప్రవర్ధనం చేస్తారు.

ఎరువులు: ప్రతి మొక్కకు 8-10 కిలోల పశువుల ఎరువుతో బాటు 60-120 గ్రా. నత్రజని, 120గ్రా. భాస్వరం, 120గ్రా. పొటాష్ ఎరువులను మొదటి కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే వేయాలి. తదుపరి సూచించిన మోతాదును దఫాలుగా వేయటం మంచిది.

నీటి యాజమాన్యం

కొమ్మ కత్తిరింపుల తర్వాత నీరు కట్టడం వల్ల మొక్కలు కొత్తగా చిగురిస్తాయి. నేల స్వభావాన్ని బట్టి 8-10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. డ్రిప్ ద్వారా కూడా నీటి సదుపాయం కల్పించవచ్చు.సాధారణంగా మల్లె నాటిన మూడో సంవత్సరం నుంచి వ్యాపార సరళిలో దిగుబడి ప్రారంభమై 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. జనవరి నుంచి మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడితో పాటు పూల నాణ్యత బాగుంటుంది.

దిగుబడి

హెక్టారుకు 8-9 టన్నులుకోతవిధానం: పూలను ఉదయం సూర్యోదయం ముందు కోయాలి. పూర్తిగా వికసించని బడ్స్ ను మాత్రమే ఎంచుకోవాలి. కోసిన పూలను నీడలో ఉంచాలి. చెడిపోయిన, దెబ్బతిన్న పూలను వేరు చేయాలి. పరిమాణం, నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేయాలి.

తాజాదనం: బోరిక్‌ఆమ్లం 0.5-1% ద్రావణంలో పూలను తేలికగా ముంచి తీసి ఎండబెట్టాలి. ఇది పూల తాజాదనాన్ని పెంచుతుంది. రంగు మార్పును తగ్గిస్తుంది.

ప్రీ-కూలింగ్: ప్యాకింగ్‌ కు ముందు పూలను 8-10°C వద్ద చల్లబరచాలి. ఇది పూల తాజాదనాన్ని ఎక్కువ సేపు నిల్వ ఉంచుతుంది.

ప్యాకింగ్: పూలను చిన్న పాలిథిన్ కవర్లు లేదా పెర్పొరేటెడ్ బ్యాగ్స్ లో నింపాలి. ప్రతి బ్యాగ్ లో తక్కువ పరిమాణంలోనే పూలు పెట్టాలి (గాలి సులభంగా వెళ్లేలా).రవాణా సమయంలో కోల్డ్ చైన్ (చల్లని పరిస్థితులు) కొనసాగాలి.

ప్రయోజనాలు:పూలు 24-48 గంటలు తాజాగా ఉంటాయి.వాడిపోవడం తగ్గుతుంది.

దుబాయ్ కి ఎగుమతి ప్యాకేజి టెక్నాలజీ

మల్లెపూలను ముందుగా వేలం కేంద్రాల నుంచి సేకరిస్తారు. ఆతరువాత విడి పూలను కొనుగోలు దారుల అవసరానికి అనుగుణంగా వివిధ ఆకారాలు, పరిమాణాలలో మల్లెహారాలుగా తయారు చేస్తారు.ఈ మల్లెహారాల్లో పూల తాజాదనాన్ని కాపాడడానికి నిల్వ కాలాన్ని పెంచడానికి బోరిక్‌ఆమ్లం 4% ద్రావణంలో శుభ్రంగా అనుకూలంగా ఉండే కోరిగేటెడ్ ఫైబర్ బోర్డ్ బాక్సుల్లో ప్యాక్ చేస్తారు. ఈ బాక్స్ లోపల గాలి వెళ్లేలా బటన్ హోల్స్ వంటి చిన్న రంధ్రాలు చేస్తారు.ప్యాకింగ్ పూర్తయ్యాక, ఈ బాక్స్ లను విమానాల్లో దుబాయ్ వంటి దేశాలకు పంపిస్తారు.

విలువ ఆధారిత ఉత్పత్తులు

హారాలు, వేనీలు, సువాసన నూనెలు, జడ అలంకరణ, పెళ్లిహారాలు, జడ అలంకరణ, క్రౌన్, చేతి అలంకరణ.

టింటింగ్:పూలకు రంగులు ఇచ్చే పద్ధతి. హారాలు, వేనీలలో ఉపయోగం.

ఆధారం : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ