సమగ్ర యాజమాన్యం తో వరి సాగు అధిక దిగుబడికి పునాది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విస్తారంగా సాగయ్యే పంట వరి. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో వరి నారుమడి దశ నుండి నాట్లు వేసే దశకు చేరుకుంది. ఈ కీలకమైన దశలో అనేక రకాల చీడపీడలు పంటను ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. సమయానుకూల సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం వలన నష్టాన్ని అధిగమించవచ్చు. ప్రధానంగా ఎరువుల యాజమాన్యం పంట ఆరోగ్యకర పెరుగుదలపై, మేలైన దిగుబడిపై నేరుగా ప్రభావం చూపిస్తుంది.

వరి సాగు - ఎరువుల యాజమాన్యం:

నత్రజని వాడకం:  నత్రజనిని ఒకేసారి కాకుండా మూడు సమభాగాలుగా విభజించి వేయాలి. బురద పదునులో వెదజల్లిన 36-48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి.

వేపపిండి మిశ్రమం: 50 కిలోల యూరియాకు 10 కిలోల వేపపిండి కలిపి, 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లాలి. ఇది నత్రజని సామర్థ్యాన్ని పెంచుతుంది.

భాస్వరం: మొత్తం భాస్వరం ఎరువును ఆఖరి దమ్ములోనే వేయాలి. పైపాటుగా లేదా అంకుర దశలో వేయకూడదు.

పొటాష్: రేగడి నేలల్లో పూర్తిగా ఆఖరి దమ్ములో వేయాలి. తేలిక నేలల్లో సగం ఆఖరి దమ్ములో, మిగతా సగం అంకుర దశలో వేయాలి.⚠️

ముదురు నారు నాటినప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు:

నత్రజని పెంచడం: నత్రజని ఎరువును 25 శాతం అధికంగా ఇవ్వాలి.దఫాల విభజన: మూడు దఫాల బదులు రెండు దఫాలుగా (2/3 వంతు దమ్ములో, 1/3 వంతు అంకుర దశలో) వేయాలి.

బూస్టర్ డోస్: ఎకరానికి 20-25 కిలోల యూరియా, 15-20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బూస్టర్ డోస్‌గా వేయాలి.

సూక్ష్మ పోషక యాజమాన్యం (జింక్, ఇనుము): సూక్ష్మ పోషకాలతో పాటు జింక్, ఇనుము ధాతువుల యాజమాన్యం కూడా తప్పక పాటించాలి. జింక్, ఇనుము ధాతువుల లోపం వల్ల పైరు పెరుగుదల మరియు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.

చీడపీడలు - గుర్తింపు & నివారణ:

కాండం తొలుచు పురుగు (మొవ్వు కుళ్ళు / తెల్ల కంకి): ఈ పురుగు పసుపు రంగులో ఉండి రెక్కల మధ్య నల్లటి మచ్చ కలిగి ఉంటుంది.లార్వా కాండంలోకి చేరి లోపలి కణజాలాన్ని తింటుంది.దీనివల్ల మొవ్వు ఆకు ఎండిపోయి కుళ్ళిపోతుంది (మొవ్వు కుళ్ళు).చిరుపొట్ట దశ తర్వాత ఆశిస్తే గింజలు తెల్లగా మారి 'తెల్లకంకి' ఏర్పడుతుంది.

నివారణ: క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. ఎసిఫేట్ 1.5 గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రా. క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

ఆకుముడత పురుగు: తల్లి రెక్కల పురుగు పసుపు రంగులో ఉండి రెక్కలపై ఉదారంగా అలల చారలు కలిగి ఉంటుంది. లేత ఆకుపచ్చ లార్వా ఆకుల అంచులను గొట్టంగా చేసి లోపల నుండి పత్ర హరితాన్ని గోకి తింటుంది ఫలితంగా ఆకులు తెల్లబడతాయి.

నివారణ: ఎసిఫేట్ 1.5 గ్రా. క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

తెగుళ్ల నిర్వహణ గుర్తింపు, నివారణ

పాముపొడ తెగులు: నాటిన నెల రోజుల నుండి పైరుని ఆశించే ఈ తెగులు దుబ్బు చేసే దశ నుండి కాండం, మట్ట, ఆకులపై పెద్ద మచ్చలు చేసి పాముపొడ మాదిరి కనబడుతుంది. మచ్చల చుట్టూ గోధుమ వర్ణం, మధ్య భాగం బూడిద రంగులో ఉంటుంది. తెగులు వెన్నుకు వ్యాపిస్తే తాలు గింజలు ఏర్పడతాయి. ప్రవాహపు నీటి ద్వారా ఒక పొలం నుండి మరొక పొలానికి వ్యాప్తి చెందుతుంది.

నివారణ చర్యలు: నత్రజని ఎరువులను మూడు దఫాలుగా వినియోగించాలి. గట్ల పైన, పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి.

రసాయన నివారణ: (15 రోజుల వ్యవధిలో రెండు సార్లు మార్చి పిచికారీ చేయాలి): అజోక్సిస్ట్రోబిన్ 1 మి.లీ. లేదా హెక్సాకోనజోల్ 2 మి.లీ. లేదా వాలిడామైసిన్ 2 మి.లీ. లేదా ప్రొపికోనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

కాండం కుళ్ళు తెగులు: మురుగు నీరు ఉన్న పొలాల్లో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. శిలీంధ్రం ఆశించడం వలన కణుపుల వద్ద కాండం లోపలి కణజాలం కుళ్ళి నల్లగా మారుతుంది. ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. పిలకలు వాలి ఎండిపోతాయి. తెగులు తీవ్రత పెరిగేకొద్దీ దుబ్బు అంతా ఎండిపోయి తాలు గింజలు ఏర్పడతాయి.

తప్పనిసరి చర్య: తెగులు సోకిన పొలంలో మురుగు నీరు నిల్వ లేకుండా పారుదల సౌకర్యం కల్పించాలి.

నివారణ: (పిలకలు వరికు తడిచేలా పిచికారీ 15 రోజులకు ఒకసారి): హెక్సాకోనజోల్ 2 మి.లీ. వాలిడామైసిన్ 2 మి.లీ. ప్రొపికోనజోల్ 1 మి.లీ. టెబుకొనజోల్ 2 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు:నిర్ణీత ఉధృతి స్థాయి మేరకే మందులు వాడండి అనవసరపు రసాయన ఖర్చు తగ్గుతుంది.మిత్ర పురుగులను రక్షించండి. అవి సహజ నియంత్రణలో సహాయపడతాయి.భాస్వరం, జింకు సల్ఫేట్ కలిపి వేయకండి కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి.ముదురు నారు వేసినప్పుడు నత్రజనిని 25% పెంచండి.మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి కాండం కుళ్ళు తెగులు రాకుండా నివారించవచ్చు.

ఆధారం : వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ-పత్రిక