సాత్గుడి సమయానుసార యాజమాన్యం- నాణ్యమైన దిగుబడి స్తిరమైనా ఆదాయం

అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, నంద్యాల, కొంతమేర కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో దీని సాగు విస్తృతంగా జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన “సాత్గుడి ” రకం రాష్ట్రంలో 90--95 శాతం వరకు సాగులో ఉంది. ఈ రకం పండ్లు 150--240 గ్రాముల బరువు, అధిక రసం శాతం, విటమిన్-సి గుణాలు కలిగి ఉండి హెక్టారుకు 20--25 టన్నుల దిగుబడిని ఇస్తాయి.వివిధ వయస్సుల తోటలు ఉండటంతో సమయానుసార యాజమాన్య పద్ధతులు రైతులకు ఎంతొ అవసరం. చెట్టు వయస్సును బట్టి పశువుల ఎరువు, వేపపిండి, రసాయన ఎరువులు, జీవన ఎరువులను సిఫారసు మేర వినియోగిస్తే మంచి ఎదుగుదలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు. ఐదు సంవత్సరాలు పైబడిన చెట్లకు పశువుల ఎరువు, వేపపిండి, నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు జీవన ఎరువులను రెండు దఫాలుగా ఇవ్వడం ప్రయోజనకరం.ప్రస్తుతం చీని తోటల్లో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. ఆకు పచ్చ నల్లి, మంగు నల్లి కాయలపై తెల్లటి మచ్చలు కలిగిస్తాయి. పేనుబంక, ఎగిరే పేను వైరస్ మరియు శంకు తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతాయి. తామర పురుగు వల్ల పండ్లపై గోకినట్లుగా మచ్చలు ఏర్పడతాయి. వీటి నివారణకు సిఫారసు చేసిన పురుగు మందులను సరైన మోతాదులో కొత్త చిగురు, పూత, పిందె దశల్లో పిచికారీ చేయాలి.

రసం పీల్చే పురుగుల నివారణ

నల్లి: ఆకు పచ్చ నల్లి, మంగు నల్లి కాయలపై రసం పీల్చి తెల్లటి మచ్చలు ఏర్పడేలా చేస్తాయి. గోళికాయ దశలో లీటరు నీటికి కరిగే గంధకం 3 గ్రాములు లేదా ప్రొపర్‌గైట్ 1 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.

పేనుబంక, ఎగిరే పేను: లేత ఆకులు, పూతపై ఆశించి రసం పీల్చడంతో పాటు వైరస్, శంకు తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతాయి. నివారణకు ఇమిడాక్లోప్రిడ్ లేదా అసిటామిప్రిడ్, ఎగిరే పేనుకు థయోమెథాక్సామ్ లేదా నోవాల్యురాన్ మందులను పిచికారీ చేయాలి.సిఫారసు మేర కొత్త చిగురు దశలో పిచికారీ చేయాలి.

తామర పురుగు: ఆకు కణజాలాన్ని దెబ్బతీయడంతో పండ్లపై గోకినట్లుగా మచ్చలు ఏర్పడతాయి. నివారణకు ఫిప్రోనిల్ మందును 14 రోజుల వ్యవధిలో రెండు సార్లు కొత్త చిగురు, కాయ ఎదుగుదల దశలో పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.రసం పీల్చే పురుగుల నివారణలో వేప ఆధారిత అజాడిరెక్టిన్ మందుల వినియోగం మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఎకరానికి 8--10 పసుపు లేదా నీలం రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసి పురుగుల ఉధృతిని గమనిస్తూ అవసరమైనప్పుడు మాత్రమే పిచికారీలు చేపడితే ఖర్చు తగ్గి, నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.

బత్తాయి నుండి విలువ జోడింపు ఉత్పత్తులు

మార్కెట్ లో తక్కువ ధర వచ్చినప్పుడు ప్రాసెస్సింగ్ ద్వారా అధిక లాభాలు సాధించండి

తాజా జ్యూస్ & ప్యాకేజ్డ్ జ్యూస్ : పండ్లను పిండి, పాశ్చరైజ్ చేసి టెట్రా ప్యాక్ లేదా సీసాలలో నింపడం. విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల మంచి మార్కెట్ ధర లభిస్తుంది.

జామ్ (Jam): ఏ పండుతోనైనా (మామిడి, స్ట్రాబెర్రీ, జామ, ఆపిల్ మొదలైనవి) తయారు చేస్తారు. పండు గుజ్జును చక్కెరతో ఉడికించి గట్టిగా తయారు చేస్తారు. ఇది పూర్తిగా తీపిగా, మృదువుగా ఉంటుంది.సింపుల్‌గా చెప్పాలంటే మార్మలేడ్ = సిట్రస్ పండ్లు + తొక్క ముక్కలు, జామ్ = పండు గుజ్జు మాత్రమే. ఇవి రెండూ బ్రెడ్ మీద వేసుకుని తింటారు.

బత్తాయి స్క్వాష్ & సిరప్ : పండు రసాన్ని చక్కెర, సిట్రిక్ యాసిడ్ కలిపి స్క్వాష్ తయారు చేయడం. నీళ్ళు కలిపి తాగే పానీయం లాగ ఉంటుంది . ఇంటి వద్దే చేయవచ్చు.

తోలు నుంచి తైలం : బత్తాయి తోలును ఆవిరి స్వేదనం ద్వారా తైలం తీయవచ్చు. అత్తరు, సబ్బు, ఆహారపదార్థ పరీక్ష మలలో ఉపయోగపడుతుంది. అధిక లాభాలు వస్తాయి.

కేండీడ్ పీల్ (మిఠాయి తోక్కు) : తొక్కును చక్కెర పాకంలో ఊరగా వదిలి కేండీడ్ పీల్ తయారు చేయడం, కేకులు, స్వీట్లు, చాకొలేట్ తయారీలో విలువైన పదార్థం.

విలువ జోడింపు - ప్రొసెసింగ్ దశలు

పండ్ల వర్గీకరణ : ఎ-గ్రేడ్ పండ్లు నేరుగా మార్కెట్కు పంపాలి. బి-గ్రేడ్, సి-గ్రేడ్ పండ్లను ప్రొసెసింగ్కు వాడాలి.

శుభ్రపరచడం & తడి తుడవడం : శుభ్రమైన నీటితో కడిగి, పురుగు మందుల అవశేషాలు తొలగించాలి. తడిలేకుండా ఆరబెట్టాలి.

పీల్తో / పీల్ లేకుండా వేరు చేయడం : తొక్కును తైలం/పొడి కోసం అలాగే ఉంచి, పండు గుజ్జు జ్యూస్/జామ్కు వేరు చేయాలి.

ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. నమోదు : ఆహార ప్రొసెసింగ్ యూనిట్ కోసం FSSAI లైసెన్స్ తీసుకోవడం అవసరం. రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి.

మార్కెటింగ్ - స్థానిక + ఆన్లైన్ : స్థానిక స్వయం సహాయక సంస్థల ద్వారా, అమెజాన్ లోకల్ ఫుడ్స్, నేచురల్స్ ఛానెల్స్ ద్వారా అమ్మకాలు చేయవచ్చు.విలువ జోడింపు ఉత్పత్తులు రకాలు - జ్యూస్, మార్మలేడ్, స్క్వాష్, తోక్కు తైలం, పొడి, కేండీడ్ పీల్, వెనిగర్ - తొక్కును వదలకూడదు అనేది ముఖ్యమైన పాఠం - తొక్కు నుండి వచ్చే తైలం పొడి వరకు అత్యంత అధిక విలువ కలిగిన ఉత్పత్తులు.

ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ