పెరటి కోళ్లలో బాహ్య పరాన్నజీవుల నియంత్రణ గ్రామీణ ప్రాంతాల్లో పెంచే కోళ్లలో బాహ్య పరాన్నజీవుల సమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈగలు, పేలు, మైట్స్, గోమర్లు/ పిడుదులు వంటి పరాన్నజీవులు కోళ్ల శరీరంపై చేరి రక్తాన్ని పీలుస్తూ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. ఇవి కోళ్లలో చిరాకు, శరీరాన్ని గోకడం, ఈకలు పీకుకోవడం, బలహీనత, గుడ్డు ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తాయి. తీవ్రమైన స్థాయిలో రక్తహీనతకు కూడా కారణమవుతాయి. అంతేకూడా ఫౌల్ పాక్స్ వంటి అంటువ్యాధులను కూడా వ్యాప్తి చేయగలవు. గ్రామీణ కోళ్లలో ఎక్కువగా కనిపించే బాహ్య పరాన్నజీవులు, వాటి నియంత్రణ పద్ధతులను ఈ వ్యాసంలో తెలుసుకుందాం. కోళ్ల ఈగలు/ఫ్లీలు ఉష్ణమండల ప్రాంతాల్లో కోళ్లలో సాధారణంగా కనిపించే కోళ్ల ఫ్లై "స్టిక్ఫాస్ట్ ఫ్లై". ఇవి చిన్న నల్లటి పురుగులు. కోడి తల భాగంలో, ముఖ్యంగా కళ్ల చుట్టూ గుంపులుగా అంటుకుని రక్తాన్ని పీలుస్తాయి. లక్షణాలు కోళ్లు అసహనంగా ఉండటం కళ్ల దగ్గర గోకడం చర్మం, కంఠం/ తల కిరీటం, వాటిల్స్/ గడ్డాలు తెల్లబడటం ఎక్కువగా సోకిన చోట పుండ్లు ఏర్పడటం పిల్ల కోళ్లు చనిపోయే ప్రమాదం నియంత్రణ : కిరోసిన్, పెట్రోలియం జెల్లీ లేదా పారాఫిన్‌ను పరాన్నజీవులపై రాయాలి. చిన్న పిల్లలున్న కోళ్లను పూర్తిగా ఫ్లీలు లేకుండా ఉంచాలి. పేలు కోళ్ల పేలు/ లైస్ పసుపు-గోధుమ రంగులో ఉండే చిన్న పురుగులు. ఇవి ఈకల మధ్య నివసిస్తాయి. కొన్ని ఈకలను తింటే, మరికొన్ని రక్తాన్ని పీలుస్తాయి. లక్షణాలు ఈకలు దెబ్బతినడం తీవ్రమైన ఇన్ఫెస్టేషన్లో కోళ్లు అసహనంగా మారడం నియంత్రణ : చివర్లో సూచించిన "సాధారణ బాహ్య పరాన్నజీవుల నియంత్రణ చర్యలు" పాటించాలి. స్కేలీ లెగ్ మైట్స్ ఈ మైట్స్ కోళ్ల కాళ్ల చర్మంలోకి దూరి జీవిస్తాయి. కాళ్లపై పొలుసులు ఏర్పడి కాళ్లు వంకరగా మారతాయి. లక్షణాలు కాళ్లు మందంగా పొలుసుల్లా కనిపించడం తీవ్రమైన స్థితిలో కుంటుతనం పాదాల వికృత రూపం నియంత్రణ కాళ్లను గోరువెచ్చని నీటిలో నానబెట్టి పొలుసులను మృదువుగా తొలగించాలి.తరువాత కిరోసిన్, మినరల్ ఆయిల్, వాసలిన్ లేదా కీటకనాశిని రాయాలి. ఈ విధానాన్ని వారానికి ఒకసారి చొప్పున కనీసం మూడు సార్లు చేయాలిప్రయోజనం లేకపోతే ఆ కోడిని తొలగించడం మంచి. దిస్కిన్ మైట్స్ ఇవి చిన్న రక్తంపీల్చే పురుగులు. తల భాగం, రెక్కల కింద వంటి ఈకలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తాయి. కొన్ని మైట్స్ కోడి శరీరంపైనే ఉంటే, మరికొన్ని గూళ్లలో, గోడల పగుళ్లలో దాక్కుని రాత్రివేళల్లో మాత్రమే రక్తం పీలుస్తాయి. లక్షణాలు కోళ్లు బలహీనంగా మారడంగుడ్డు ఉత్పత్తి తగ్గడం కంజం, వాటిల్స్ తెల్లబడటంపిల్ల కోళ్లు చనిపోవడం నియంత్రణ: కోళ్ల షెడ్డు నిర్మాణంలో ఉపయోగించే కట్టెల బెరడును తొలగించాలి. కోళ్లు కూర్చునే కర్రలు / దిమ్మెలకు సున్నం పూయాలి. గోమర్రు / పిడుదులు గోమర్రు నీలం లేదా గోధుమ రంగు రక్తం పీల్చే పరాన్నజీవులు. ఇవి గోడల పగుళ్లు, చెట్ల బెరడు, కోళ్ల గూళ్లలో దాక్కుంటాయి. లక్షణాలు కోళ్లు చికాకుగా ఉండటం బలహీనత గుడ్ల ఉత్పత్తి తగ్గడం రక్తహీనత నియంత్రణ షెడ్లలో ఉపయోగించే కట్టెల బెరడును తొలగించాలి. కింద సూచించిన “సాధారణ నియంత్రణ చర్యలు” పాటించాలి. బాహ్య పరాన్నజీవుల సాధారణ నియంత్రణ చర్యలు కోళ్ల షెడ్లలో ఉపయోగించే కట్టెల బెరడును తొలగించాలి. కోళ్లను గుంపులుగా అధికంగా ఉంచకూడదు. గూళ్లు, షెడ్లను తరచుగా శుభ్రం చేయాలి. పాత పరుపు, చెత్త, విసర్జనలను తొలగించాలి. షెడ్ గోడలు, నేలపై బూడిద లేదా వ్యవసాయ సున్నం చల్లాలి. పొగతో షెడ్లను ఫ్యూమిగేషన్ చేయాలి. పరాన్నజీవుల బెడద తీవ్రమైన పరిస్థితుల్లో పాత షెడ్లను కాల్చి, కొత్త ప్రదేశంలో కొత్త షెడ్ నిర్మించాలి. కార్బారిల్ వంటి కీటకనాశకాలను ఉపయోగించవచ్చు. అవసరమైతే పశువైద్యుని సలహాతో ఐవర్‌మెక్టిన్ వంటి మందులు వాడాలి. కోళ్లు బూడిదలో పొర్లేలా అవకాశం కల్పించాలి. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు అన్ని కోళ్లకు ఒకేసారి చికిత్స చేయాలి. గూళ్లు, షెడ్లపై కూడా మందులు పిచికారీ చేయాలి. పరాన్నజీవుల గుడ్లపై మందులు సరిగా పనిచేయవు కాబట్టి, ఒక వారం తరువాత మళ్లీ చికిత్స చేయాలి. గ్రామీన కోళ్ల పెంపకంలో పరిశుభ్రత, సరైన యాజమాన్య నిర్వహణ, సమయానికి వ్యాధి నియంత్రణ చర్యలు చేపడితే బాహ్య పరాన్నజీవుల వల్ల కలిగే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఆధారం: తెలంగాణ వ్యవసాయ శాఖ