చేపలు - అధిక ప్రోటీన్ అధిక ఆదాయం

మన పూర్వీకులు "చేప తింటే చురుకు పెరుగుతుంది" అని చెప్పేవారు. ఇది కేవలం నానుడి మాత్రమే కాదు విజ్ఞానశాస్త్రం కూడా దీన్ని నిరూపించింది. చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, కంటి చూపును మెరుగు పరుస్తాయి. అంతేకాదు, చేపలు అధిక నాణ్యత గల ప్రోటీన్, విటమిన్లు, ఖనిజ లవణాలకు అద్భుతమైన వనరు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, గర్భిణుల ఆరోగ్యానికి, బాలింతలకు, వృద్ధుల కండరాల బలానికి చేపలు ఎంతో మేలు చేస్తాయి. ఇంతటి పోషక సంపదను కలిగిన చేపలను రైతులు తెలివిగా ఉపయోగించుకుంటే అధిక ఆదాయం కూడా పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపదకు పెట్టిన పేరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనదేశంలో చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలుస్తోంది. దీర్ఘమైన సముద్రతీరం, విస్తారమైన చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు, ఆక్వాకల్చర్ వ్యవస్థల ద్వారా మన రాష్ట్రం ఏటా భారీగా చేపలు, రొయ్యలను ఉత్పత్తి చేస్తోంది. మంచి నీటి చేపల సాగులో, రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది. మత్స్య రంగం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు, మత్స్యకారులు, మహిళలు జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, చేపల సరైన నిల్వ, మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల విషయంలో ఇంకా మన రైతులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

తాజా చేపల కన్నా ఎండిన చేపలు అంతకన్నా మంచివి

తాజా చేపలు పోషకమైనవే అయినప్పటికీ, వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల చాలా త్వరగా పాడైపోతాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలకు దూరంగా ఉండే అంతర్గత గ్రామాలకు తాజా చేపలను చేర్చడం కష్టం. ఈ సమస్యకు పురాతన కాలం నుండి వస్తున్న పరిష్కారమే ఎండబెట్టడం. చేపలను ఎండబెట్టినప్పుడు వాటిలోని నీరు తొలగిపోతుంది కానీ ప్రోటీన్, పోషకాలు మాత్రం సాంద్రీకృతమై, ఒకచోట కేంద్రీకృతమవుతాయి. అంటే ఎండిన చేపలు నిజంగా "హై ప్రోటీన్ ఫుడ్"గా మారతాయి.100 గ్రాముల తాజా చేపలలో సుమారు 18-22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే 100 గ్రాముల ఎండిన చేపలలో 50 నుండి 70 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఇది శాస్త్రీయ వాస్తవం. అందుకే ప్రోటీన్ లోపం, పోషకాహార లోపాలతో బాధపడుతున్న ప్రాంతాలలో డీహైడ్రేటెడ్ చేపలు ఎంతో విలువైన ఆహారంగా పరిగణించబడుతున్నాయి. తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత గల ప్రోటీన్‌ను ప్రజలకు అందించగలిగే సామర్థ్యం ఎండిన చేపలకే ఉంది.

పరిశుభ్రంగా ఎండబెట్టడం నాణ్యత, ఆదాయం రెండూ

చేపలను ఎండబెట్టే విధానంపై శ్రద్ధ పెడితే ఉత్పత్తి నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. పాత పద్ధతిలో నేలపై ఎండబెట్టడం వల్ల దుమ్ము, ఈగలు, పరిసర కాలుష్యాల వల్ల నాణ్యత తగ్గుతుంది, మార్కెట్లో మంచి ధర రాదు. బదులుగా శుభ్రమైన వలలు, ప్లాస్టిక్ ట్రేలు లేదా ఎత్తైన డ్రైయింగ్ ర్యాక్ లపై ఎండబెట్టడం మంచిది. సోలార్ డ్రైయర్లు లేదా క్యాబినెట్ డ్రైయర్లు ఉపయోగించినట్లయితే రంగు, రుచి, పోషక విలువలు చాలా మెరుగ్గా నిల్వ ఉంటాయి. ఎండిన తర్వాత చేపలను పూర్తిగా చల్లబర్చే, తేమ చొరబడని ప్యాకెట్లలో నిల్వ చేయాలి. ఈ చిన్న జాగ్రత్తలు నిల్వ కాలాన్ని పెంచి వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాయి.

విలువ ఆధారిత ఉత్పత్తులు రైతుకు ఎక్కువ ఆదాయం

చేపలను కేవలం ఎండబెట్టి అమ్మడమే కాకుండా వాటిని ఉపయోగించి పలు రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయవచ్చు. చేప పొడి, చేప నూడిల్స్, చేప సూప్ మిక్స్, చేప పచ్చడి, రెడీ-టు-ఈట్ చేప స్నాక్స్ ఇవన్నీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఉత్పత్తులు. ఎండిన చేపల బరువు తక్కువగా ఉ ండటం వల్ల రవాణా ఖర్చు తగ్గి దూర ప్రాంతాలకు కూడా సులభంగా సరఫరా చేయవచ్చు. ముఖ్యంగా మహిళా సంఘాలు, FPOలు, చిన్న స్థాయి వ్యాపారులు స్థానిక బ్రాండ్ పేరుతో ఈ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు.

మార్కెటింగ్ తెలివిగా చేయాలి

నాణ్యమైన ఉత్పత్తి తయారు చేసినా సరైన మార్కెటింగ్ లేకపోతే గిట్టుబాటు ధర రాదు. అందుకే కొన్ని ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలి. మొదటిగా, చిన్న చిన్న ప్యాకెట్లలో ఆకర్షణీయమైన లేబుళ్లతో ఉత్పత్తులను విక్రయించాలి. లేబుల్స్ పై ప్రోటీన్ శాతం, పోషక విలువలు, వినియోగ విధానం తప్పక పేర్కొనాలి. "హై ప్రోటీన్ ఫుడ్" అని ప్రచారం చేయడం వల్ల జిమ్ కు వెళ్ళే యువత, పిల్లల తల్లిదండ్రులు, ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న వినియోగదారులను ఆకర్షించవచ్చు. సోషల్ మీడియా, ఫుడ్ ఎగ్జిబిషన్లు, రైతు బజార్లు, ఫుడ్ టెస్టింగ్ కార్యక్రమాల ద్వారా ఉత్పత్తి గురించి విస్తృతంగా ప్రచారం చేయవచ్చు. పాఠశాలలు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజన కార్యక్రమాలలో చేప ఆధారిత ఉత్పత్తులను చేర్చేందుకు అధికారులతో సంప్రదింపులు జరపడం కూడా డిమాండ్ పెంచే మంచి మార్గం.

చేప ఆహారం మాత్రమే కాదు పోషక భద్రత, ఆర్థిక అభివృద్ధి

చేపలు కేవలం ఆహారం మాత్రమే కాదు అవి పోషక భద్రత, ఆర్థిక అభివృద్ధి, మహిళల సాధికారతకు కూడా దోహద పడతాయి. ఆంధ్రప్రదేశ్ రైతులు, మత్స్య రంగంలో పని చేసే మహిళలు పరిశుభ్రమైన ప్రాసెస్సింగ్, నాణ్యమైన ప్యాకేజింగ్, తెలివైన మార్కెటింగ్ ద్వారా ఎండిన చేప ఉత్పత్తులను లాభదాయకంగా తయారు చేయవచ్చు. చేపల పోషక విలువలు, ప్రజల ఆరోగ్యం, రైతుల ఆదాయం.. ఈ మూడు లక్ష్యాలను ఒకేసారి సాధించే శక్తి మత్స్య రంగానికి ఉంది. అందువల్ల "చేప సాగు మన భాగ్యం" అని గర్వంగా చెప్పవచ్చు.

ఆధారం : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ