ఏఐ అగ్రానమిస్ట్ అనేది APAIMS యాప్లో ఉన్న ఒక డిజిటల్ వ్యవసాయ సహాయకురాలు. ఇది రైతులకు కావాల్సిన అన్ని రకాల వ్యవసాయ సమాచారాన్ని ఒకే చోట, సులభంగా అందిస్తుంది. పంటల సాగు, ఎరువులు, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాలు, వాతావరణ హెచ్చరికలు వంటి విషయాలకు సంబంధించి రైతులు వేర్వేరు చోట్ల వెతకాల్సిన అవసరం లేకుండా, ఈ ఒక్క యాప్ ద్వారానే అన్నీ తెలుసుకోవచ్చు. ఏఐ అగ్రానమిస్ట్ సేవలను ఎక్కడ నుండి పొందవచ్చు? గూగుల్ ప్లే స్టోర్ /యాప్ స్టోర్ లలో దొరికే APAIMS యాప్ /AP AGRI ద్వారా ఉచితంగా పొందవచ్చు. ఏఐ అగ్రానమిస్ట్ని వినియోగించుకోవడం ఎలా? రైతులు తమకి కావలసిన సమాచారం కొరకు ఇంగ్లీషు /తెలుగు లో టైప్ చేసి అడగవచ్చు. లేదా చదవడం, వ్రాయడం తెలియని రైతులు, టైప్ చేయాల్సిన పని లేకుండా యాప్ తెరిచి, మైక్రోఫోన్ ఉపయోగించి తెలుగులో లేదా ఇంగ్లీష్ లో మాట్లాడి తమ ప్రశ్నలు అడగవచ్చు, కావాలంటే పంట ఫొటో కూడా అప్లోడ్ చేయవచ్చు. ఏఐ అగ్రానమిస్ట్ ఆ ప్రశ్నలను అర్ధం చేసుకుని, అందుబాటులో ఉన్న వ్యవసాయ సమాచారం, వాతావరణం, మార్కెట్ వివరాల ఆధారంగా సులభమైన భాషలో సమాధానం ఇస్తుంది. ఏఐ అగ్రానమిస్ట్ ద్వారా రైతులకు లభ్యమయ్యే సేవలు పంట సలహాలు : వేసుకోవాల్సిన పంటలు, రకాలు, విత్తనాలు, ఎరువుల మోతాదు. వేయవలసిన సమయం, నీటి తదులు ఇవ్వవలసిన సమయం, కోత కోసుకోవాల్సిన సమయం ఇలా... విత్తనం మొదలు పంట అమ్మకం వరకు అన్ని దశల్లో సూచనలు ఇస్తుంది. ఈ సలహాలు ANGRAU విశ్వ విద్యాలయం ఇచ్చిన వ్యవసాయ పంచాంగం, పాడ్ పంటలు వంటి నమ్మకమైన ఆధారాల నుండి సేకరిస్తుంది. పంట సమస్యల గుర్తింపు: పంటలో ఏదైనా చీడపీడలు కనిపిస్తే, ఆ పంట ఫోటో తీసి యాప్లో పెడితే, సమస్య ఏంటో గుర్తించి, తగిన మందులు లేదా జాగ్రత్తలు సూచిస్తుంది. వాతావరణ హెచ్చరికలు: వాతావరణ పరిస్థితుల గురించి ముందుగానే హెచ్చరిస్తుంది. తద్వారా రైతులు పంటను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.. మార్కెట్ సమాచారం: మార్కెట్ ధరలు, గత ధరల తీరు, హోల్సేల్ రిటైల్ ధరలు, కూలీల ఖర్చులు తదితర సమాచాo ఇస్తుంది, తద్వారా పంటను ఎప్పుడు, ఎక్కడ అమ్మితే మంచి ధర వస్తుందో నిర్ణయించు కోవచ్చు. సాగు ఖర్చు వివరాలు: ఏ పంటకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత లాభం మిగులుతుంది. అనే వివరాలు ఇస్తుంది. కాబట్టి ముందస్తు ప్రణాళిక వేసుకోవచ్చు. ఎరువుల వివరాలు: ఎంత యూరియా కేటాయించారు, గతంలో ఎంత కొన్నారు. ఇంకెంత పొందడానికి అర్హత ఉంది, దగ్గర్లో ఎరువులు దొరికే దుకాణాల వివరాలు తెలుసుకోవచ్చు. యంత్రాలు, డ్రోన్ సేవలు: దగ్గర్లో ఉన్న అందుబాటులో ఉన్న వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ సేవలు వివరాలు తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు నేరుగా యాప్ ద్వారానే బుక్ చేసుకొని వినియోగించుకోవడం సులభమవుతుంది. ప్రభుత్వ పథకాలు: రైతు సంక్షేమ పథకాలకు అర్హత, దరఖాస్తు స్థితి, లబ్ది సొమ్ము జమ వంటి వివరాలతో పాటు, అవసరమైనప్పుడు సంప్రదించవలసిన సంబంధిత అధికారుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అభిప్రాయం తెలియజేయడం: రైతులు తమ సూచనలు, ఫిర్యాదులు లేదా అభినందనలు యాప్ ద్వారానే నేరుగా వ్యవసాయ శాఖకు తెలియజేయవచ్చు. ఆధారం: పాడి పంటలు మాసపత్రిక