వైరస్ తెగుళ్ల నియంత్రణతో నాణ్యమైన కూరగాయల ఉత్పత్తి కూరగాయల పంటలను ఆశించే వైరస్ తెగుళ్లు వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వీటిని సమర్థవంతంగా నివారించుకుంటే నాణ్యమైన దిగుబడులు, మార్కెట్లో మంచి ధర, అధిక ఆదాయం, రైతులకు ఆహార భద్రత లభిస్తుంది. ఈ వైరస్లు ప్రధానంగా తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు వంటి కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కొన్ని వైరస్లు విత్తనం ద్వారా, యాంత్రిక పద్ధతిలో (పనిముట్ల ద్వారా) కూడా వ్యాపిస్తాయి. సకాలంలో వైరస్ తెగుళ్ళను గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మొజాయిక్ తెగుళ్లు : ఈ తెగులు సోకినప్పుడు ఆకులపై లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ లేదా పసుపు రంగు మచ్చలు ఒక చదరంగం గడుల (మొజాయిక్) మాదిరిగా ఏర్పడతాయి. ఆకులు ముడుచుకుపోయి, కాయలు వంకర్లు తిరిగిపోతాయి. దోస మొజాయిక్ వైరస్ : ఇది దోస, పుచ్చ, కాకర, మిరప, టమాటా పంటలకు ఆశిస్తుంది. దీనిని పేనుబంక కీటకాలు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చేస్తాయి. పొగాకు మొజాయిక్ వైరస్ : ఇది టమాటా, మిరప, వంగ పంటలపై ప్రభావం చూపుతుంది. ఇది కీటకాల ద్వారా కాకుండా, కలుషితమైన చేతులు, వ్యవసాయ పనిముట్లు తాకడం ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఆకుముడత తెగుళ్లు : ఈ తెగులు వల్ల ఆకులు పైకి లేదా కిందకి ముడుచుకు పోవడం, గిడసబారిపోవడం, ఆకులు చిన్నవిగా మారి గుత్తులుగా తయారవుతాయి. మొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. టమాటా పసుపు ఆకుముడత వైరస్ : ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి పైకి ముడుచుకుంటాయి. పూత, కాత నిలిచి పోతుంది. దీనిని తెల్లదోమ వ్యాప్తి చేస్తుంది. మిరప ఆకుముడత వైరస్ : మిరపలో ఈ సమస్య చాలా ఎక్కువ. ఆకులు పైకి ముడుచుకుని పోవడానికి తామర పురుగులు, కిందకి ముడుచుకోవడానికి నల్లి కారణం కాగా, వైరస్ ముడతను తెల్లదోమ వ్యాప్తి చేస్తుంది. పసుపు ఈనెలు /మొజాయిక్ తెగుళ్లు : ఈ వైరస్ ఆకుల ఈనెలను తెలుపు లేదా పసుపు రంగులోకి మారుస్తుంది. క్రమంగా ఆకు మొత్తం పసుపు రంగులోకి మారిపోయి గట్టిపడు తుంది. బెండ పసుపు ఈనెల మొజాయిక్ వైరస్ : బెండ సాగులో ఇది అత్యంత ప్రమాదకరమైన తెగులు. ఆకులు, కాయలు పసుపు రంగులోకి మారి మార్కెట్ గుణాన్ని కోల్పోతాయి. దీనిని కూడా తెల్లదోమ వ్యాప్తి చేస్తుంది. చిక్కుడు పసుపు మొజాయిక్ వైరస్: ఫ్రెంచ్ బీన్స్, అనుములు, ఇతర చిక్కుడు జాతి పంటలలో ఆకులు పసుపు రంగులోకి మారడానికి కారణం. ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. మచ్చల తెగుళ్లు / నెక్రోసిస్: ఆకులు, కాయల మీద నల్లటి వలయాలు, గోధుమ రంగు మచ్చలు లేదా ఎండిపోయినట్లు ఉండే చారలు ఏర్పడతాయి. టమాటా స్పాటెడ్ విల్ట్ వైరస్: టమాటా, మిరప, బంగాళాదుంప పంటలలో ఆకులు కాంస్య రంగులోకి మారతాయి. కాయలపై గుండ్రటి మచ్చలు పడతాయి. దీనిని తామర పురుగులు వ్యాప్తి చేస్తాయి. ఉల్లి ఐరిస్ ఎల్లో స్పాట్ వైరస్ : ఉల్లి, వెల్లుల్లి ఆకులపై వజ్రం ఆకారంలో తవుడు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇది ఉల్లి తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. సమగ్ర యాజమాన్య పద్ధతులు : విత్తన ఎంపిక : ఎప్పుడూ వైరస్ రహిత, ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే వాడాలి. వైరస్ నిరోధక /తట్టుకునే కూరగాయ రకాలను ఎంపిక చేసుకోవాలి. పంట మార్పిడి : ఒకే రకమైన పంటలను వరుసగా వేయకూడదు. ఉదాహరణకు టమాటా వేసిన పొలంలోనే తిరిగి వంగ, మిరప, బంగాళాదుంప వంటి పంటలను వేయకూడదు. కనీసం 3 ఏళ్లపాటు బంతి, జొన్న, సజ్జ లేదా రాగి వంటి పంటలతో పంట మార్పిడి చేయాలి. 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఈ కుటుంబం కాని పంటలు వేయాలి. నారుమడి యాజమాన్యం, విత్తన శుద్ధి: ఆరోగ్యవంతమైన నారును మాత్రమే వాడుకోవాలి. వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల యాజమాన్యం చాలా ముఖ్యమైనది. కావున నారుమళ్ళను నెట్ హౌస్ లలో (40 మెష్) పెంచితే మంచిది. నారును నాటే ముందు ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ. ఒక లీటరు నీరు కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి (టమాటా, వంగ, మిరప వంటి కూరగాయలు). విత్తనం విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. రక్షణ పంట : జొన్న, సజ్జ లేదా మొక్కజొన్న వంటి ఎత్తైన పంటలను 2–3 వరుసలలో పొలం చుట్టూ వేయడం వల్ల, గాలికి కొట్టుకు వచ్చే రసం పీల్చే పురుగులు నేరుగా ప్రధాన కూరగాయ పంటపై పడకుండా ఇవి. భౌతిక అడ్డుగోడలా పనిచేస్తాయి. ఈ సరిహద్దు పంటలు కందిరీగలు, లేడీబర్డ్ బీటిల్స్ వంటి మిత్ర పురుగులకు ఆశ్రయం ఇస్తాయి. ఇవి కూరగాయలను ఆశించే శత్రు పురుగులను తిని సహజంగా నియంత్రిస్తాయి. జిగురు అట్టలు : జిగురు అట్టలు వాడడం వల్ల వైరస్ అట్ట తెగుళ్లను వ్యాప్తి చేసే పురుగులను ప్రారంభంలోనే నాశనం చేయవచ్చు. ఎకరాకు కనీసం 15 నుంచి 20 జిగురు అట్టలను అమర్చాలి. వైరస్ వ్యాప్తి చేసే పురుగులకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. కూరగాయల్లో వైరస్ వ్యాధులను తగ్గించడానికి సమతుల ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యం. వాహక కీటకాల నియంత్రణకు సూచించే మందులు: వైరస్ ఒకసారి మొక్కకు సోకిన తర్వాత దాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యం. 5 శాతం వేప గింజల కషాయం లేదా అజాడిరక్టిన్ 10000 పి.పి.ఎం. లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున పిచికారీ చేసి రసం పీల్చు పురుగులను మొదటి దశలో అరికట్టవచ్చు. తెల్లదోమ నివారణ: ఎసిటామిప్రిడ్ 20% ఎస్.పి లీటరు నీటికి 0.2 గ్రాములు / డైఫెంథ్యూరాన్ 50% డబ్ల్యు.పి లీటరు నీటికి 1.25 గ్రాములు / స్పిరోమెసిఫెన్ 22.9% ఎస్.సి లీటరు నీటికి 1 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగుల నివారణ: ఫిప్రోనిల్ 5% ఎస్. సి లీటరు నీటికి 2 మి.లీ./ ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎస్. ఎల్ లీటరు నీటికి 0.3 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక నివారణ : థయోమిథాక్సామ్ 25% డబ్ల్యు.జి లీటరు నీటికి 0.4 గ్రాములు / డైమిథోయేట్ 30% ఇ.సి. లీటరు నీటికి 2 మి.లీ కలిపి వాడాలి. ఆధారం: ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ