పూల సాగుతో తేనెటీగల సంరక్షణ ఫ్లోరికల్చర్ అంటే పూల మొక్కల పెంపకం. ఇది దేశ, విదేశాల్లో బాగా డిమాండ్ ఉన్న రంగం. పూల సాగు వల్ల రైతులకు మంచి ఆదాయం, ఉపాధి దొరుకుతుంది. దీంతో పాటు పర్యావరణం కూడా బాగుంటుంది. పూలు అందానికే కాదు, తేనెటీగలు, సీతాకోకచిలుకలు లాంటి కీటకాలకు ఆహారం (తేనె, పుప్పొడి) కూడా ఇస్తాయి. ఈ కీటకాలే పంటల్లో పరాగ సంపర్కానికి తోడ్పడి దిగుబడి పెంచు తాయి. కానీ ఈమధ్య సహజమైన పూల మొక్కలు తగ్గిపోవడంతో తేనెటీగలకు ఆహార కొరత ఏర్పడుతోంది. ఖాళీ స్థలాల్లో, పొలం గట్ల మీద, ఇతర ప్రాంతాల్లో పూల మొక్కలు ఎక్కువగా పెంచాలి. మన ప్రాంత వాతావరణానికి, నేలకు సరిపడే స్థానిక పూల మొక్కలనే ఎంచుకోవాలి. తేనె, పుప్పొడి రెండూ ఇచ్చే మొక్కలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏడాది పొడవునా ఏదో ఒక పూల మొక్క పూస్తూ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఒక మొక్క పూత అయిపోయే సమయానికి మరో మొక్క పూత మొదలయ్యేలా చూసుకోవాలి. దీనివల్ల తేనెటీగల ఆరోగ్యం బాగుండి, తేనె ఉత్పత్తి కూడా పెరుగుతుంది. రైతులు కేవలం పెద్దఎత్తున పూలు పండించడమే కాక, నర్సరీలు, గ్రీన్హౌస్/పాలీహౌస్ పద్ధతులు వాడి ఆదాయం పెంచుకోవచ్చు. అవసరం లేని రసాయన పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలి. సమగ్ర తెగుళ్ల నివారణ పద్ధతులను ప్రోత్సహించాలి, పొలాల్లో, చుట్టుపక్కల ప్రాంతాలలో స్థానిక పూల మొక్కలను కాపాడుకోవాలి. మిత్ర పురుగుల సాయంతో చీడపీడలను అదుపు చేయాలి. తోటల్లో పూల మొక్కలు పెంచడం వల్ల తేనెటీగలు, బదనికలు, ఈగలు, కందిరీగలు, సాలీళ్ళు, మిడతలు, గొల్లభామలు, తూనీగలు, సీతాకోకచిలుకలు లాంటి మేలు చేసే కీటకాలు ఆకర్షితమవుతాయి. దీనితో పాటు, పూల సాగును విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ (ఉదాహరణకు నూనెలు, సెంట్లు, డ్రైఫ్లవర్స్), సరైన మార్కెటింగ్ ఎగుమతి అవకాశాలతో అనుసంధానం చేసినప్పుడు అధిక లాభాలు పొందవచ్చు. తేనెటీగలు,పరాగసంపర్క జీవుల సంరక్షణ అనేది కేవలం పర్యావరణాన్ని కాపాడటానికే కాదు, మన ఉద్యాన పంటల దిగుబడిని, నాణ్యతను పెంచడానికి కూడా ఎంతో ముఖ్యం. తేనెటీగలకు అనుకూలమైన పూలమొక్కలను ప్రోత్సహించడం ద్వారా ప్రకృతికి మేలు చేసే స్థిరమైన వ్యవసాయాన్ని మనం బలోపేతం చేయవచ్చు. పొలాల్లో సమృద్ధిగా పూల వనరులను పెంచడం, మేలు చేసే కీటకాలకు అనుకూలమైన ఆవాసా లను కల్పించడం, సరైన పంట నిర్వహణ పద్ధతులను పాటించడం ద్వారా అద్భుతమైన పరాగసంపర్కం జరిగి, నిరంతర స్థిరమైన పంట ఉత్పత్తిని సాధించవచ్చు. జీవ వైవిధ్యం పెరిగి, శతృ పురుగులను అదుపులో ఉంచే మిత్ర పురుగుల సంఖ్య బలపడి, పుష్పాలపై పరాగసంపర్కం మెరుగుపడి, పండ్ల ఏర్పాటు, పండ్ల నాణ్యత పంట దిగుబడిలో 15-20% మేర మెరుగుదల సాధ్యమవుతుంది. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక , జె. జ్యోతి ఉద్యాన శాఖ అధికారి,