నిరంతరం ఆదాయం ఇచ్చే విధానం (ఎ టీ ఎం విధానం) 20 సెంట్లలో నెలకు ₹15,000 నుండి ₹26,000 వరకు అనునిత్యం పొలం నుంచి ఆదాయం ప్రకృతి వ్యవసాయంలో భూమి లేని పేద రైతులు, వేరే వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగించేవారు కూడా తక్కువ విస్తీర్ణం (20 సెంట్లలో) నెలకు రూ.15 వేల నుంచి రూ.26 వేల వరకు అనునిత్యం పొలం నుంచి ఆదాయం పొందడాన్ని నిరంతరం ఆదాయం ఇచ్చే (atm) విధానం అంటారు. వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న పరిస్థితులను అధిగమించడా నికి ప్రారంభించిన atm విధానం బహుళ ప్రచారంలోకి వచ్చింది. లక్ష్యాలు ప్రతినిత్యం దిగుబడి సాధించడానికి స్వల్పకాల పంటలైన ఆకుకూరలు, దుంప పంటలతో ప్రతి నెలకు పంట వచ్చే ముల్లంగి, 2 నెలలకు వచ్చే బీట్ రూట్, 3 నెలలకు వచ్చే క్యారెట్ విత్తనాలను వరసగా ప్రతి నెల దిగుబడి వచ్చేలా విత్తుకోవాలి. ఒకే పంట విస్తీర్ణంలో మూడు పంటలు పండించి మూడు రెట్ల దిగుబడి సాధించవచ్చు. వీటితోపాటు 30-40 రోజుల నుంచి దిగుబడి మొదలై ప్రతి 3 రోజులకోసారి కోతకు వచ్చే గోరుచిక్కుడు, అలసంద పంటలను వేసుకోవాలి.మొక్కజొన్న పంట వేసవి కాలంలో వడగాడ్పుల నుంచి రక్షణ ఇచ్చి మంచి దిగుబడి ఇస్తుంది. ఈ పంట ప్రతి 70 రోజుల వ్యవధిలో రిలే సోయింగ్ చేస్తూ వెళ్ళాలి. పై అన్ని రకాల పంటలతో పాటు వంగ, టమాటా, మిరప పంటల విత్తనాలను ప్రతి అడుగుకూ ఒక విత్తనం చొప్పున వేసుకోవాలి. పై ప్రధాన పంటల తర్వాత రిలే పంటలుగా, పంటల స్థలాలను మార్చుకుంటూ వెళ్ళాలి. ముల్లంగి: ఆకులు, దుంపలు రెండూ ఆహారంగా వాడతారు. ముల్లంగి సాగుకు ఎలాంటి వాతావరణం అయినా అనుకూలమే. ఎకరానికి 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సాదారణ రకాలయితే ఒక నెలలోనే దుంప వస్తుంది. వీటిని పండించడం సులభం. వేగంగా మొలకలు వచ్చి త్వరగా పెరుగుతాయి. బీట్ రూట్ : దీని ఆకులు, దుంపలు రెండూ ఆహారంగా వాడతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఒక కప్పు రసం తాగితే త్వరగా కోలుకుంటారు. బీట్ రూట్ కు గల ఎరుపు రంగును కలిగించే బీటా సయానిన్ కు పెద్ద పేగుల్లో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు ఉన్నాయి. సరాసరి ఎకరానికి 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇది రెండు నెలల పంట. క్యారెట్ : ఇది కూడా ఒక దుంప కూర. సాధారణంగా నారింజ రంగులో ఉంటాయి. మొక్కలో సాధారణంగా దుంపను తింటారు. అయినప్పటికీ దీని కాండం, ఆకులు కూడా తింటారు. కొంతమంది దీన్ని రసంగా చేసుకుని తాగుతారు. దేశీయ క్యారెట్ ఎక్కువ రుచికరమైన టాప్ రూట్ గా గుర్తించబడింది. క్యారెట్ వల్ల అనేక లాభాలున్నాయి. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని శుద్ధి చేస్తుంది. దీనిలో ఉండే కెరోటిన్ అనే పదార్ధం “ఎ” విటమిన్ గా మారి కంటిచూపును పెంచుతుంది. ఒక ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మూడు దుంప జాతి పంటలు ఒకే పంట విస్తీర్ణంలో వృద్ధి చెంది, నెల నెలకు ఫలసాయం ఇవ్వడం ఎ.టి.ఎం.విధానం ప్రత్యేకత. వివిధ పంటల దూరం దుంపల పంటలకు సాలుకూ సాలుకూ మూడు అంగుళాలు, మొక్కకు మొక్కకూ 4 అంగుళాలు దూరం ఉండేలా విత్తనాలు 5 వంతుల ఘనజీవామృతంతో పాటు విత్తుకోవాలి. రెండు అడుగుల వెడల్పు గల బెడ్ మధ్యలో అలసందలు అడుగుకి ఒకటి చొప్పున విత్తుకోవాలి. గోరుచిక్కుడు రెండు అడుగుల వెడల్పు బెడ్ మీద కాలువ వైపు అడుగుకి ఒకటి చొప్పున విత్తుకోవాలి. మొక్కజొన్న ప్రతి అడుగుకి ఒకటి చొప్పున 4 అడుగుల బెడ్ మీద మధ్యలో విత్తుకోవాలి. వంగ, టమాటా, మిరప పంటలను ప్రతి అడుగుకి ఒకదాని తర్వాత ఒకటి చొప్పున 2 అడుగుల బెడ్ మధ్యలో విత్తుకోవాలి. ఈ దుంపజాతి పంటల మధ్యలో అనగా 4 అంగుళాల విస్తీర్ణంలో 2 వరసల మెంతి పంటను వేసుకోవచ్చు. లేదా ఒక వరస తోటకూర, పాలకూర, చుక్కకూర వంటివి వేసు కోవచ్చు. భవిష్యత్తులో ఎ.టి.ఎం విధానంలో కనీసం 2 రకాల పండ్లు ఇచ్చే మొక్కలు నాటాలి. జాగ్రత్తలు బంకమట్టి నేలలో పంటలు వేయడానికి ముందే నీళ్ళు పెట్టి బెడ్స్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత విత్తనాలు పైన చెప్పిన విధంగా విత్తుకోవాలి. ఇసుక నేలలు అయితే విత్తనాలు విత్తిన తర్వాత నీరు పెట్టాలి. రిలే పంటల విధానంలో పంట ఉండగానే పంట వేసుకోవాలి. విత్తనాలు విత్తుకునేటప్పుడు ఘనజీవామృతంతో పాటు విత్తుకోవాలి. విత్తన పెల్లెట్ (Seed Pellet) విత్తన పెల్లెట్ అనేది విత్తనం చుట్టూ పోషకాలు, సూక్ష్మపోషకాలు, జీవ ఎరువులు, శిలీంద్రనాశకాలతో ప్రత్యేక పూత పూసే సాంకేతికత. దీనివల్ల విత్తనాల పరిమాణం ఒకే విధంగా ఉండి విత్తడం సులభమవుతుంది. మొలకెత్తే శాతం మెరుగుపడి, ప్రారంభ దశలో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ పద్ధతి ద్వారా దిగుబడి పెరగడంతో పాటు విత్తన వినియోగం కూడా సమర్థవంతంగా ఉంటుంది. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఎ.పి.సి.ఎన్.ఎఫ్. రాష్ట్ర కార్యాలయం, గుంటూరు