భూసార నివేదికతో తెలివైన వ్యవసాయం సహజసిద్ధంగా నేలలు వాటిలో ఉన్న పోషక పదార్ధాలను, వేసిన సేంద్రియ, రసాయన ఎరువులలోని పోషకాలను మొక్కలకు అందజేసి వాటి పెరుగుదలకు పంట దిగుబడికి దోహదపడతాయి. భూసారాన్ని తెలుసుకోవడం తద్వారా పంటకు పోషకాలను సమతుల్యంగా అందించి, పోషక లోపాలు రాకుండా చూడడంతో పాటు ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు పెట్టకుండా, భూసారాన్ని కాపాడుకుంటూ సుస్థిరమైన అధిక దిగుబడులను సాధించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూసారపరీక్షల కొరకు విధిగా బడ్జెట్ ఇచ్చి, భూసారపరీక్షలు చేయిస్తున్నప్పటికి రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడంలో విఫలమవుతున్నారని చెప్పక తప్పదు. దీనికి గల ముఖ్య కారణాలను విశ్లేషిస్తే. 1. ఎలా వినియోగించుకోవాలో అవగాహన లేకపోవడం.2. వినియోగించుకోవాలనే ఆసక్తి లేకపోవడం. భూసార పరీక్షపత్రాన్ని బట్టి ఎరువులు ఎలా వేసుకోవాలో దానిని బట్టి పంటకి ఎరువులు ఎలా వినియోగించాలో ఇందులో తెలుసుకుందాం. ఇచ్చిన పత్రంలో PH (ఉదజని సూచిక) 7.78 గా ఉంది అనుకుంటే ఈ నేల కొంచెం క్షార స్వభావాన్ని కలిగి ఉందని అర్ధం. EC (లవణ సాంద్రత) 0.62 ds/m ఉంది అంటే ఈ నేల చౌడు లేకుండా సాగుకు అనుకూలంగా ఉందని అర్ధం. సేంద్రియ కర్బనం 0.67 ఉంది అంటే ఈ నేలలో సేంద్రియ పదార్థం మద్య స్థంగా ఉందని అర్ధం. ఈ నేలలో మొక్క తీసుకోగలిగే లభ్య నత్రజని తక్కువగా (251.0 కే.జి./హెక్టారుకు), లభ్య భాస్వరం మధ్యస్థంగా (10.14 కే.జి./హెక్టారుకు) లభ్య పొటాష్ 465 కే.జి./హెక్టారుకు) అధికంగా ఉన్నాయి. లభ్య గంధకం (71 పిపిఎం) అధికంగా, సూక్ష్మ పోషకాలైన లభ్య జింకు (0.39 పిపిఎం) తక్కువగాను, లభ్య బోరాన్ (7.48పిపిఎం) ఎక్కువగాను, లభ్య ఇనుము (4.26 పిపిఎం) తక్కువగాను, లభ్య మాంగనీసు (9.18 పిపిఎం) ఎక్కువగాను, లభ్య కాపర్ (0.12 పిపిఎం) తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనకు భూమిలో వున్న పోషకాల స్థాయి తెలిసింది కనుక, దీనిని బట్టి సంబంధిత భూమిలో వరికి ఎరువులు ఎలావేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం భూసార పరీక్షను బట్టి ఎకరానికి 120 కిలోల నుంచి 125 కిలోల (25% నుంచి 30% ఎక్కువ ) నత్రజని ఇచ్చే ఎరువులను, 32 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను మరియు 22 నుంచి 24 కిలోల పొటాష్ (30% నుంచి 25% తగ్గించి) నిచ్చే ఎరువులను వేసుకోవాలి. లభ్య గంధకం ఎక్కువగా ఉంది కనుక సల్సైడ్ ఎక్కువవడం ద్వారా వచ్చే లోపాలు స్పష్టం గా కనపడతాయి. గనుక గంధకం కలిగిన (20-20-0-13 లేదా అమ్మోనియం సల్ఫేట్) ఎరువులను వేయరాదు. అవసరమైతే పొలాన్ని ఆరగట్టాలి. జింకు లోపం ఉంది గనుక ఎకరానికి 20 కిలోల జింకుసల్ఫేట్ వేయాలి. బోరాన్ ఎక్కువగా ఉంది గనుక రసాయన ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. లభ్య ఇనుము తక్కువుగా ఉన్నప్పటికీ వరికి నీరు పెట్టినప్పుడు ఫెర్రిక్ రూపంలో ఉన్న ఇనుము ఫెర్రస్ రూపంలోకి మారి అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ ఇనుము ధాతు లోపం కనిపిస్తే ఫెర్రస్ సల్ఫేట్ 5 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసి సరిచేసుకోవచ్చు. మాంగనీసు ఎక్కువగా, కాపర్ తక్కువగా ఉన్నాయి కాని ఇవి వేయాల్సిన అవసరం లేదు. సూక్ష్మపోషకాల లోపాలను సవరించడానికి రసాయన ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులు లేదా పచ్చిరొట్ట ఎరువులు వేయడం మంచిది.ఇలా రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియో గిస్తే భూసార పరిరక్షణతో పాటు రైతులు ఎరువులపై పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. AI ఆధారిత నేల పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పైలట్ ప్రోగ్రామ్‌లలో డేటా ఆధారిత ఎరువుల వినియోగం వల్ల ఇన్పుట్ ఖర్చులు 30% వరకు తగ్గి, దిగుబడి పెరిగింది. A ఆధారిత సాయిల్ కియోస్క్‌లను ఏర్పాటు చేసి నేల పోషకాలను విశ్లేషించి రియల్-టైమ్ డిజిటల్ సిఫారసులు అందిస్తున్నాయి. అరటి & పసుపు తోటలు డెల్టా ప్రాంతంలోని భారీ నేలలు నీరు పోషకాలను బాగా నిలుపుకుంటాయి, కానీ అరటి, పసుపు పంటలకు వేర్ల వ్యాప్తికి ఆటంకం కలిగిస్తాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచన మేరకు జిప్సమ్ సేంద్రియ కంపోస్ట్ కలిపి వేయడంతో నేల భౌతిక స్థితి మెరుగుపడింది, నీటి నిర్వహణ మెరుగయింది. సాయిల్ హెల్త్ కార్డ్ పథకం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, రాయలసీమ ప్రాంతాల నేల పరీక్ష నివేదికలను విశ్లేషిం చగా, నేలలను లవణీయత, హ్యూమస్ లోపం, ప్రధాన పోషకాల లోపం, సూక్ష్మపోషకాల లోపం అనే ఐదు రకాలుగా వర్గీకరించారు. ఈ ఆధారంగా రైతులకు ఎరువుల మోతాదు సూచనలు, అనువైన పంట మార్పిడి పద్ధతులు సూచించారు. సాయిల్ హెల్త్ కార్డ్-రంగు సంకేతాల విధానం ప్రభుత్వం అందించే సాయిల్ హెల్త్ కార్డ్‌లో రంగు సంకేతాలు ఉంటాయి-ఆకుపచ్చ రంగు అంటే పోషకాలు సరిపోతున్నాయి, పసుపు అంటే మధ్యస్థంగా ఉన్నాయి, ఎరుపు అంటే లోపం ఉంది. చదవడం తెలియని రైతులకు కూడా ఈ విధానం ద్వారా నేల స్థితి వెంటనే అర్థమవుతుంది. మనదేశంలో ఇప్పటి వరకు 25 కోట్లకు పైగా సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయబడ్డాయి. నేల పరీక్ష ఆధారిత వ్యవసాయం ఉద్యాన తోటల రైతులకు ఎరువుల ఖర్చు తగ్గించి, దిగుబడి పెంచి, నేల ఆరోగ్యాన్ని రక్షిస్తూ గొప్ప మార్పు తీసుకొస్తోంది! ఆధారం: పాడి పంటలు మాస పత్రిక