విత్తన కొనుగోలు - జాగ్రత్తలు విత్తన నాణ్యత పైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులు విత్తనాలు కొనుగోలులో జాగ్రత్తలు పాటించకపోతే పంట నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నకిలీ విత్తనాల వల్ల పంట వేయడానికి సంరక్షించడానికి వెచ్చించిన సమయం, నీరు, ఎరువులు వంటి వనరులు వృధా అవుతాయి. పంట నష్టం వల్ల రైతులు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులకు గురవుతారు. మార్కెట్లో ప్రభుత్వ పరంగా విడుదలయ్యే వివిధ పంటల విత్తనాలతో పాటు ప్రైవేటు విత్తన సంస్థల నుంచి ఉత్పత్తి అయ్యే విత్తనాలు కూడా లభ్యమవుతాయి. పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలలో సింహభాగం ప్రైవేటు విత్తన ఉత్పత్తి సంస్థల ద్వారానే మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. రైతులు అధికంగా ఈ సంస్థలపైనే విత్తనాల కోసం ఆధార పడాల్సి ఉంటుంది. ఒక్కో సమయంలో ఆయా కంపెనీల విత్తన రకాలను సాగు చేసినప్పుడు, కంపెనీలు ప్రకటించిన దిగుబడి కన్నా తక్కువ దిగుబడి రావడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. కావున రైతులు పంట సాగుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో విత్తనాల సేకరణ, కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మండల వ్యవసాయాధికారి లేక సంబంధిత అధికారి సలహా మేరకు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని కొనుగోలు చేయాలి. వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సు కలిగిన అధీకృత డీలర్ల వద్ద నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాల కొనుగోలుకు సంబంధించిన రశీదు తప్పని సరిగా సదరు డీలరు నుంచి తీసుకోవాలి. సంబంధిత డీలరు కొనుగోలు దారు రశీదు పై తప్పని సరిగా సంతకాలు చేయాలి. కొనుగోలు రశీదులో విత్తనానికి సంబంధించిన పంట రకం, లాటు నెంబరు, పరిమాణం. చెల్లించిన రుసుము వివరాలను తనిఖీ చేసుకోవాలి. పంట కాలం పూర్తయ్యేంత వరకూ కూడా కొనుగోలు రశీదును భద్రపరచుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాల ప్యాకెట్లను, వాటికి కుట్టిన లేబుళ్ళను విత్తనాలు వినియోగించిన తరువాత కూడా భద్ర పరచుకోవాలి. ఇలా చేయడం వల్ల మున్ముందు విత్తనాలకు సంబంధించిన నాణ్యతా సమస్యలు తలెత్తినప్పుడు, పరిహారం పొందడానికి ముఖ్యమైన ఆధారంగా ఉంటాయి. సీల్ తీసేసి వున్న, పగిలిన మూతలు, తెరచి ఉన్న సంచులు/డబ్బాలలోని విత్తనాన్ని కొనుగోలు చేయరాదు. వరి లాంటి పంటలకు సంబంధించి విత్తన బరువు కూడా నిర్ధారించుకొని కొనుగోలు చేయాలి. సరైన సీలుతో ధృవీకరణ పత్రం ఉన్న విత్తన సంచులను మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తనాల సంచులపై విత్తనరకం, లాట్ నెంబర్, గడువు తేది తదితర వివరాలు సరిగా వున్నాయో లేవో చూసుకున్న తరువాత మాత్రమే కొనుగోలు చేయాలి. హైబ్రిడ్ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విత్తనరకం, భౌతికస్వచ్ఛత, మొలకెత్తే స్వభావం, జన్యుపర నాణ్యత లేబుల్ మీద ఉన్నాయో లేదో గమనించి కొనుగోలు చేయాలి. విత్తనాన్ని కొనుగోలు చేసిన తరువాత ఇంటివద్దనే మొలక శాతాన్ని పరీక్షించుకున్న తరువాత సంతృప్తికరంగా ఉంటేనే పొలంలో విత్తుకోవాలి. మొలకశాతం తక్కువగా ఉంటే కొనుగోలు చేసిన దుకాణ దారునకు పరిస్థితి వివరించి వేరే మంచి విత్తనాన్ని తీసుకోవాలి. విత్తన మొలకదశ, ఎదుగుదల పూతదశలలో పంట ఒకే రకంగా లేకపోతే సంబంధిత వ్యవసాయాధికారికి తెలియ చేయాలి. వ్యవసాయాధికారి పంట క్షేత్రాన్ని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారు. పత్తి, మిరప, కూరగాయల హైబ్రిడ్ విత్తనాల కొనుగోలులో రైతులు అదనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వ గుర్తింపు పొందిన అధీకృత డీలరు వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. పెట్టుబడి ఆదా అవుతుందని తక్కువ ధరతో అమ్మే విత్తనాలతో మోసపోవద్దు. సాధారణంగా నకిలీ విత్తనాలు తక్కువ ధరకే అమ్ముతారు. రైతులు జాగరూకత వహించాలి. గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు అమ్మేవారి వద్ద ఎట్టి పరిస్థితుల్లోను ప్రత్తి విత్తనాలు కొనుగోలు చేయరాదు. పక్క జిల్లా / రాష్ట్రాల నుంచి తీసుకు వచ్చి ఎవరైనా కల్తీ విత్తనాలు, లూజ్ విత్తనాలు అమ్మితే స్థానిక వ్యవసాయాధికారికి సమాచారం ఇవ్వాలి. ప్రత్తి విత్తనాలకు మొలకశాతం 80% కంటే ఎక్కువ, జన్యు స్వచ్ఛత 98% కంటే ఎక్కువ, ఇతర పదార్థాలు 2% కన్నా తక్కువగా ఉండాలి. ఈ వివరాలన్నీ ప్యాకెట్ పై ముద్రించి ఉండాలి. విత్తన తయారీ, కంపెనీ వివరాలు కూడా సరిపోల్చు కోవాలి. కలుపు మందులను తట్టుకునే హెచ్.టి బిటి పత్తి విత్తనాల సాగు, అమ్మకాలు దేశవ్యాప్తంగా నిషేధితం. దీ+ XXX పేరుతో చలామణి అవుతున్న హెచ్. టి బి.టి ప్రత్తి విత్తనాలకు అనుమతి లేనందున రైతులు ఇటువంటి విత్తనాలు కొనుగోలు చేయరాదు. ఇలాంటి విత్తనాలు అమ్మినా, సాగు చేసినా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ -1986 (EP Act), విత్తన చట్టం 1966 ప్రకారం, శిక్షార్హులు. ఎటువంటి రకాల విత్తనాలయినా నాణ్యతా ప్రమాణా లకు అనుగుణంగా లేనట్లయితే అటువంటి విత్తన ఉత్ప త్తిదారులు, సంస్థలు, డీలర్ల పైన విత్తన చట్టం-1966, విత్తన నియంత్రణ చట్టం-1983 పరిధికి లోబడి చర్యలు తీసుకోబడతాయి. కావున రైతు సోదరులు విత్తనాలు కొనుగోలు సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని, నాణ్యత ధృవీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి, మంచి యాజమాన్య పద్ధతులు పాటించి పంటలు సాగు చేస్తే నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు సాధించవచ్చు. ఆధారం: పాడి పంటలు విత్తన విభాగం, వ్యవసాయ కమీషనర్ కార్యాలయం గుంటూరు, ఆంధ్రప్రదేశ్