ఈ మాసం వ్యవసాయ పనులు - వరి

ఎల్ నినో నేపథ్యంలో తక్కువ వర్ష పాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. కురిసిన వర్షాలు సమానంగా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది. కావున రైతులు నీరు బయటికి పోవుటకు వీలుగా కాలువలు చేసుకోవాలి. తరచు ముంపుకు గురి అయ్యే పల్లపు ప్రాంతాలలో ముంపును తట్టుకునే రకాలు సాగు చేసుకోవాలి. వెద పద్ధతిలో ప్రతి 2 మీటర్లకు చిన్న కాలువలు తీయుట వలన అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు బయటకు పోయే అవకాశం ఉంటుంది. అలాగే కొంత నీరు కాలువలలో నిలబడుట వలన వర్షాలు కురవనప్పుడు, కొంత వరకు బెట్టకు గురి కాకుండా ఉంటుంది.నీటి లభ్యత ఉంటేనే వరి సాగు చేపట్టాలి. ఎడగారులో దక్షిణ మండలంలో సాగు చేసిన వరి పిలకల దశలో ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు సాయంత్రం వేళలో నీరు పెట్టి ఉదయం తీసి వేయాలి. సల్ఫర్ ఉన్న ఎరువులను పై పాటుగా వేయరాదు.చౌడు ప్రాంతాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చౌడు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కావున చౌడు భూములలో చౌడును తట్టుకునే రకాలతోపాటు యాజమాన్య చర్యలు చేపట్టాలి.ఎల్ నినో ప్రభావం వలన వర్షపాతం తక్కువ ఉండే అవకాశం ఉన్నందున నీటి లభ్యత ఆధారంగా వరి సాగు చేయాలి. నీరు తక్కువ ఉన్నప్పుడు 140 రోజుల లోపు ఉన్న రకాలు ఎంపిక చేసుకోవాలి.

రకాలు ఎంపిక

జులై లో మధ్యకాలిక (140 రోజులు) రకాలైన మారుటేరు సాంబ(ఎం.టి.యు-1224), ఎం.సి.యం-103, ఎం.టి.యు-1282, ఎం.సి.యం-125, ఎం.టి.యు-1310, ఎం.టి.యు-1232, ఎం.టి.యు- 1275, పాండురంగ (ఎం.సి.యం-100), భీమ(ఎం.టి.యు1140), నంద్యాల సోన (ఎన్.డి.ఎల్.ఆర్.7), ఎం.టి.యు-1271 మొదలగు రకాలు.ఆయా ప్రాంతాలకు సిఫార్సు ప్రకారం రైతులు వారి భూమి పరిస్థితిని బట్టి మార్కెట్ కు అనుగుణంగా రకాలు ఎంపిక చేసుకొని జులై మొదటి పక్షంలోపు నారుమడులు పోసుకోవాలి.

వరి నాట్లు సమయంలో పాటించ వలసిన మెళకువలు

ప్రధాన పొలమును 3-4 సార్లు దమ్ము చేసి బాగా చదును చేసుకోవాలి.

సిఫారసు చేసిన భాస్వరం ఎరువును ఆఖరి దమ్ములో వేసుకోవాలి.

దీర్ఘ కాలిక, మధ్య కాలిక రకాలకు 25-30 రోజులు వయసున్న నారును ఊడ్చుకోవాలి.

రెండు నుండి మూడు మూనల నారును పై పై న ఊడ్చాలి.

కాలి బాటలు 2-3 మీటర్లు విధిగా ఉండేటట్లు చూసుకోవాలి.

సిఫారసు చేసిన నత్రజనిని మూడు సమ భాగాలుగా మొదటి సారి నాటటానికి ముందు, రెండవ సారి పిలకల దశలో, ఆఖరుగా అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి.

పొటాష్ లో సగ భాగాన్ని మొదటి దఫాలో, మిగతా సగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి.

ప్రధాన పొలంలో కలుపు నివారణకు, నాట్లు వేసిన 3-5 రోజులలోపు పల్చగా నీరు పెట్టి ఎకరానికి 1.0-1.25 లీటర్ల బ్యుటాక్లోర్ లేదా 400 మి.లీ ప్రిటిలాక్లోర్ లేదా బెస్ సల్ఫ్యూరాన్ మిథైల్ + ప్రిటిలాక్లోర్ గుళికలు 4 కిలోలు చొప్పున సమానంగా పడేలాగా ఏకరానికి 20-25 కిలోల ఇసుకతో కలిపి చల్లుకోవాలి.

ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ