వాతావరణం – పంటల పరిస్థితి భారత వాతావరణ విభాగం వారి సమాచారం ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ 04వ తేదీన కేరళలో ప్రవేశించాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్ 08వ తేదీన ప్రవేశించి జూన్ 23వ తేదీ వరకు రాష్ట్రమంతటా విస్తరించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 01.06.2026 ລ້ 01.09.2026 వరకు కురిసిన వర్షపాతాన్ని గమనించినట్లయితే సాధారణ వర్షపాతం 581.2 మి. మి. గాను 473.9 మి.మి అంటే సాధారణ వర్షపాతం-18 శాతం నమోదయింది. రాష్ట్రంలో వానాకాలం పంటకాలానికి 27.08.2026వ తేదీ వరకు సాధారణ విస్తీర్ణంలో (ఎకరాలలో) వరి- 77 శాతం (50,92,817), జొన్న - 100 శాతం (34,446), మొక్కజొన్న - 96 శాతం (5,89,813), పత్తి - 102 శాతం (48,21,503), కంది - 102 శాతం (5,54,337), పెసర - 241 శాతం (1,55,625), మినములు - 177 శాతం (65,096), సోయాచిక్కుడు - 89 శాతం (3,72,400), వేరుశనగ - 53 శాతం (13,592) సాగు చేశారు. ఈ సంవత్సరం వానాకాలం పంటకాలంలో ఇప్పటి వరకు 90 శాతం మేర పంటలు సాగుచేశారు. ఇందులో ఆహార పంటలు 79 శాతం, పప్పుదినుసులు 120 శాతం, నూనె గింజల పంటలు 87 శాతం సాగుచేశారు. వాతావరణ విభాగం సమాచారం ప్రకారం నైరుతి రుతుపవనాల ద్వారా సెప్టెంబర్ నెలలో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.అదేవిధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఈ మాసంలో నమోదుకావచ్చు. వాతావరణాధారిత వ్యవసాయ సలహాలు వరిలో కాండం తొలిచే పురుగు, ఉల్లి కోడు నివారణకు ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3 సిజి గుళికలను నాటిన 15 రోజులకు వేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. వరిలో ఆకుముడత ఆశించడానికి అనుకూలం. నివారణకు, 2 గ్రా. కార్దాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రినిలిస్తోల్ లేదా 0.1మి.లీ. ఫ్లూటెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వర్షాభావ పరిస్థితులలో మొక్కలు నేలలోని పోషకాలను గ్రహించలేకపోవడం వలన వడలిపోయినట్లు కనిపిస్తాయి, నివారణకు 2% యూరియా ద్రావణం లేదా 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయాలి. పత్తిలో గులాబి రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని వరుసగా 3 రోజులు 7-8 తల్లి రెక్కల పురుగులు గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నివారణకు, 1.5 గ్రా. థయోడికార్ప్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తి పంటలో తామర పురుగులు, పేనుబంక పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నివారణకు 2మి. లీ. ఫిప్రోనిల్ లేదా 0.3 గ్రా. ఫ్లోనికామిడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న పంట మోకాలు ఎత్తుదశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నం, 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవాలి. పూత దశలో ఉన్న మొక్కజొన్న పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు కావున నీటి వసతి కలిగిన రైతులు పైరుకు జీవసంరక్షక నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి. కంది పంటలో ఫైటాప్తోర ఎండుతెగులు ఆశించడానికి అనుకూలం. తెగులు గమనిస్తే, నివారణకు 2 గ్రా. మెటలాక్సిల్ మందును లీటరునీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి. సోయాచిక్కుడు పంటలో పెంకు పురుగు, కాండం ఈగ ఆశించడానికి అనుకూలం. ముందు జాగ్రత్తగా పురుగులు ఆశించకుండా 0.4 మి.లీ. థయోమిథాక్సిం + లాంబ్దా సైహలోత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరప, టమాట, వంగ, బంతి పంటలను ఎత్తు మడులమీద నారు పోయడం ద్వారా నారుకుళ్ళు తెగులు నివారించవచ్చు. టమాటలో ఆకుమాడు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 3గ్రా. మాంకోజేబ్ లేదా 1 మిలీ. ప్రోపికొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆధారం: పాడిపంటలు ,వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం.