వాతావరణం - పంటల పరిస్థితి రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల (జూన్ నుండి సెప్టెంబర్) కాలంలో 988.4 మి.మీ వర్షపాతం (+33 శాతం), పోస్ట్ మాన్సూన్ సీజన్ లో (అక్టోబర్ నుండి డిసెంబర్) 189.6 మి.మీ వర్షపాతం (72 శాతం), చలి కాలంలో (జనవరి నుండి ఫిబ్రవరి) 6.5 మి.మీ వర్షపాతం (-48 శాతం), వేసవి కాలంలో (మార్చి నుండి మే) 29.1 మి.మీ వర్షపాతం (34 శాతం) నమోదయింది. 29 మే 2026 తేదీన విడుదల చేసిన నైరుతి రుతుపవనాల రెండవసారి ముందస్తు వాతావరణ సూచనల ప్రకారం 2026 సంవత్సరానికి గాను దేశం మొత్తానికి జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు (నైరుతి రుతుపవనాల) భారత దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం (90±4 శాతం) నమోదయ్యే సూచనలున్నాయి.నైరుతి రుతుపవనాల ద్వారా జూన్ నెలలో దేశం మొత్తం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ మన రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ తెలంగాణ మండలాలలోని కొన్ని జిల్లాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, మిగిలిన జిల్లాలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. అదేవిధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఈ మాసంలో నమోదు కావచ్చును. రాష్ట్రంలో యాసంగి పంటకాలానికి ఇప్పటి వరకు (29.04.2026) సాధారణ విస్తీర్ణంలో (ఎకరాలలో) వరి - 127 శాతం (65,42,155), గోధుమ - 76 శాతం (8,185), జొన్న - 204 శాతం (4,03,400), మొక్కజొన్న - 254 శాతం (16,36,730), కంది - 86 శాతం (4,506), శనగ - 71 శాతం (2,16,149), పెసర - 52 శాతం (11,990), మినుములు - 73 శాతం (40,233), వేరుశనగ - 77 శాతం (2,01,449), పొద్దుతిరుగుడు - 114 శాతం (28,339), కుసుమ - 97 శాతం (11,999) సాగు చేశారు.ఈ సంవత్సరం యాసంగి పంటకాలంలో ఇప్పటి వరకు 134 శాతం మేర పంటలు సాగుచేశారు. ఇందులో ఆహార పంటలు 238 శాతం, నూనె గింజల పంటలు 77 శాతం సాగుచేశారు. వాతావరణధారిత వ్యవసాయ సలహాలు వర్షాధార పంటలు విత్తుకోవడానికి విత్తన నియమం పాటించడం అంటే, రాష్ట్రంలోనికి రుతుపవనాలు ప్రవేశించిన తరువాత ఒక వారం రోజుల వ్యవధిలో తేలిక పాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు నేలల్లో 60 నుంచి 75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15-20 సెం.మీ. లోతు తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, జొన్న, కంది, పెసర, మినుము మొదలగు పంటలను విత్తుకోవాలి. వర్షపు నీరు పడిన చోటనే నేలలో తేమను రక్షించే పద్ధతులను పాటించాలి. తేలికపాటి నేలను వాలుకు అడ్డంగా దున్ని పంటలను విత్తుకున్నట్లయితే పంటకు ఎక్కువ కాలం తేమ లభ్యమవుతుంది. ఆరుతడి పంటలను బోదె, సాల్ల పద్ధతి లేదా ఎత్తు మడుల పద్ధతిలో విత్తుకున్నట్లయితే పంటకు ఎక్కువ కాలం తేమ లభ్యమవుతుంది అదే విధంగా ఎక్కువ వర్షపు నీటిని కాలువల ద్వారా తీసివేయడానికి వీలుంటుంది. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల (140-145 రోజులు) నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. వరిలో 3 గ్రా. కార్బండజిమ్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.రైతులు తెలంగాణ సోన (RNR 15048) వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు. విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళను అరికట్టడానికి ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, జొన్న, పెసర, కంది, వేరుశనగ విత్తనాలను తెగుళ్ళ మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తేలికపాటి నేలల్లో సోయాచిక్కుడును వర్షాధార పంటలుగా సాగు చేయరాదు. ఒకటి లేదా రెండు తడులు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే తేలికపాటి నేలల్లో పంటను విత్తుకోవాలి. పత్తి పంటను అధిక సాంద్రత పద్ధతిలో (HDPS) తేలికపాటి నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చును. వరి సాగు చేసే పొలాల్లో, తొలకరి వర్షాలను ఉపయోగించుకొని జనుము, జీలుగును పచ్చి రొట్ట పైరుగా, ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాలలో పెసరను పైరుగా లేకపోతే పచ్చి రొట్టగా విత్తుకోవాలి. నూనె గింజల పంటలకు గంధకం ఆధారిత రసాయన ఎరువులను విత్తే సమయంలో వేయాలి. ఆధారం : తెలంగాణ వ్యవసాయ మరియు సహకార శాఖ