రైతులకు న్యాయంగా... నేరుగా... పారదర్శకంగా... మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఒక విప్లవాత్మకమైన డిజిటల్ వ్యవస్థను తయారు చేసింది దాని పేరు APAIMS 2.0. మీ పొలం వివరాలు నుంచి వ్యవసాయానికి సంబంధించిన మొత్తం సమాచారం ఇందులో పొందుపర్చారు. సమాచారం, ప్రభుత్వ పథకాలు, ఎరువుల సరైన వినియోగం, మార్కెట్ ధరలు, AI ఆధారిత వ్యవసాయ సలహాలు అన్నీ ఒకే చోటే చూసే వ్యవస్థ ఇది.గ్రామంలో ఉన్న చిన్న రైతు నుండి రాష్ట్ర వ్యవసాయ కార్యాలయ సిబ్బంది వరకు అందరికీ ఈ వ్యవస్థ పనిచేస్తుంది. స్వయంగా లేదా రైతు సేవా కేంద్రం (RSK) అధికారి సహాయంతో లాగిన్ అవ్వచ్చు.రైతన్న కష్టపడి పొలం దున్నుతాడు, విత్తనం వేస్తాడు. కానీ అధిక మోతాదులో ఎరువులు వాడటం వలన భూసారం నశిస్తోంది, భూమిలోని సేంద్రియ పదార్థాలు నాశనమవుతున్నాయి. మట్టిలోని మంచి సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. అతిగా యూరియా వాడటం వల్ల భూమి ఆమ్లత్వం (Acidity) పెరిగి పంట పెరుగుదల తగ్గిపోతోంది. DAP విచక్షణారహితంగా వేయడం వల్ల భూమిలో భాస్వరం (Phosphorus) పేరుకుపోయి ఇతర పోషకాల శోషణ ఆగిపోతోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఉన్న చెరువులు, కాలువల్లో రసాయనాలు కలుస్తున్నాయి. నేల గట్టిపడిపోతోంది. నీరు ఇంకడం తగ్గి వర్షం వచ్చినా పొలానికి లాభం కలగడం లేదు. మానవ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం భూమిలోకి వేసిన రసాయన ఎరువులు కేవలం నేలను మాత్రమే పాడు చేయడం లేదు. అవి మన పంటల్లోకి, మన ఆహారంలోకి, మన శరీరంలోకి చేరుతున్నాయి. ఇది నేటి తరంతో ఆగే విషయం కాదు రాబోయే తరాలకూ ఇది ముప్పే. APAIMS 2.0 సరైన ఎరువు, సరైన మోతాదు మీ పొలం సర్వే నంబర్ వారీగా ఎకరా వివరాలు వ్యవస్థలో నమోదు అవుతాయి. గత సంవత్సరం వేసిన పంట, ఈ సంవత్సరం వేయాలనుకుంటున్న పంట మార్పులు RSK ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. మీ నేల రకం, పంట రకాన్ని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తల సహాయంతో వ్యవస్థ సరైన ఎరువు మోతాదు లెక్కిస్తుంది.ఆ లెక్క ఆధారంగా మీకు ఎన్ని బస్తాలు DAP మరియు యూరియా ఎంత మేర అవసరమో స్పష్టంగా APAIMS App లో చూపిస్తుంది. మీ కోటా నిర్ణయించ బడుతుంది, సంరక్షించ బడుతుంది, మీకే చెందుతుంది. విడతల వారీగా ఎరువు భూమికి మేలు DAP మరియు యూరియాను ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. పంట పెరుగుదలను బట్టి విడతల వారీగా (Split doses) తీసుకోవచ్చు. మొదటి దఫా విత్తనం వేసేటప్పుడు, రెండో దఫా పంట పెద్దదయ్యాక ఇది పంటకు మేలు చేస్తుంది, ఎరువు వృధా కాదు, భూమికి హాని కాదు. NPK కాంప్లెక్స్ మరియు MOP పరిమితి లేదు కానీ అవసరమైనంత మాత్రమే. 14-35-14, 10-26-26 లాంటి NPK కాంప్లెక్స్ ఎరువులు మరియు MOP (మ్యూరేట్ ఆఫ్ పొటాష్) DAP, యూరియా లాగా కోటా పరిమితి లేకుండా కొనుగోలు చేయవచ్చు. అయితే ఇవి కూడా అవసరానికి మించి వేస్తే భూమికి హాని. RSK సిబ్బంది సలహా తీసుకుని, మీ పంట అవసరాలు అర్థం చేసుకుని వేయడం మంచిది. APAIMS 2.0 రైతులకు మాత్రమే కాదు మండలం వ్యవసాయ అధికారి నుండి రాష్ట్ర కమిషనర్ వరకు అందరూ వాస్తవ సమాచారం చూడవచ్చు. జిల్లాలో ఎరువుల పంపిణీ పూర్తైందా? ఎక్కడ నిలిచిపోయింది? ఏ మండలంలో అతీగా ఎరువులు వాడుతున్నారో గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. పంట ఆరోగ్య స్థితి, పథకం చెల్లింపులు స్క్రీన్ మీద చూడవచ్చు. పారదర్శకంగా ఉంటుంది, సమయం ఆదా అవుతుంది. సరైన ఎరువు మోతాదు తెలుసుకుని భూసారం కాపాడుకోవచ్చు. మీ DAP, యూరియా కోటా సురక్షితంగా మీకే చెందుతుంది. మోసాలు తగ్గుతాయి, పారదర్శకత పెరుగుతుంది. మన పొలాలు సారవంతంగా ఉంటాయి, మన పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం పండిస్తాం మన కుటుంబం, మన సమాజం ఆరోగ్యంగా ఉంటాయి ఇది ఒక్కరోజులో అన్నీ మారిపోదు. కానీ మీరు రైతు సేవా కేంద్రానికి (RSK) వెళ్లి, మీ వివరాలు సరిగ్గా నమోదు చేసుకుంటే, భూసార పరీక్ష చేయించుకుంటే, సరైన మోతాదులో ఎరువు వేస్తే మీ పొలం మళ్లీ జీవకళలతో కళకళలాడుతుంది. అది మన హక్కు అది మన బాధ్యత. రైతు సేవా కేంద్రం (RSK) - మీ పక్కన నిలబడే వ్యవస్థ APAIMS 2.0 లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నది రైతు సేవా కేంద్రం (RSK). ఇది కేవలం ఒక కార్యాలయం కాదు. ఇది మీ పొలానికి డిజిటల్ అఅండ. భూసార పరీక్ష (Soil Health Card) ఆధారంగా మీ పొలానికి ఎంత ఎరువు సరిపోతుందో RSK సిబ్బంది చెప్తారు అతీగా వేయడం ఆగిపోతుంది. మీ సర్వే నంబర్ వారీగా పొలం వివరాలు నమోదు చేయించుకోవచ్చు, మీకు అవసరమైన ఎరువు మీకే అందుతుంది. గత సంవత్సరం వేసిన పంట ఆధారంగా అవసరాలు అంచనా వేసి సరైన సూచన ఇస్తారు. DAP, యూరియా కోటా నిర్ణయంలో పారదర్శకత, ఒక రైతు మరొకరి కోటా తీసుకోలేని విధంగా సురక్షిత. విడతల వారీగా ఎరువు తీసుకోవడం ఎలాగో, ఎందుకు మంచిదో RSK సిబ్బంది అర్థమయ్యేలా చెప్తారు. NPK కాంప్లెక్స్, MOP వంటి ఎరువులు ఎప్పుడు, ఎంత వేయాలో శాస్త్రీయ సలహా లభిస్తుంది. రసాయన ఎరువుల అతి వాడకం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వైపు మళ్ళేందుకు ప్రోత్సాహం, మార్గదర్శనం ఇస్తారు. ఆధారం : వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ-పత్రికలు