నిలువు వ్యవసాయం- తక్కువ భూమిలో ఎక్కువ లాభం నేటి కాలంలో పట్టణాలు, పెరి-అర్బన్ ప్రాంతాల్లో సాగు భూమి రోజురోజుకూ తగ్గిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో రైతులు ఆదాయం పెంచుకోవడానికి కొత్త పంటలు, కొత్త సాగు పద్ధతులు అవసరమవుతున్నాయి. అందుకే ICAR-IIHR బెంగళూరు శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మకమైన పద్ధతిని అభివృద్ధి చేశారు దానిపేరే 'నిలువు వ్యవసాయం' (Vertical Farming).ఈ పద్ధతిలో భూమిపై నాటే బదులు గోడలపై, నిలువు స్తంభాల మీద మొక్కలు పెంచుతారు. ఒక్క ఎకరంలో ఉత్పత్తి 6 రెట్లు పెరుగుతుంది. ముఖ్యంగా నీడపట్టున, ఇంటిపై, గచ్చులపై, పైకప్పులపై కూడా ఈ సాగు చేయవచ్చు. ఇది పట్టణ రైతులకు, గృహ వినియోగదారులకు, వ్యాపారదృష్టితో సాగు చేసే రైతులకు ఒక వరప్రసాదం వంటిది. వర్టికల్ గార్డెనింగ్ ప్రయోజనాలు: వర్టికల్ గార్డెనింగ్ వల్ల రైతులకు, నగరవాసులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పద్ధతి కేవలం పంట ఉత్పత్తికి మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. సౌందర్య ప్రభావాలతో పాటు చల్లని గాలికి సహజ ఇన్సులేషన్ గా పనిచేస్తుంది. మీ భవనానికి శక్తిని ఆదా చేస్తుంది.కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను పెంచుతుంది. గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.నీటిని ఆదా చేస్తుంది. 70% తక్కువ నీరు అవసరమవుతుంది. ప్రతికూల ఉష్ణోగ్రత నుంచి భవనాలకు రక్షణ కల్పిస్తుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. భూమి అవసరం చాలా తక్కువ. మేడపై, గోడలపై, బాల్కనీలో కూడా సాగు చేయవచ్చు. పట్టణ, అర్బన్ ప్రాంతాల్లో వ్యవసాయ యోగ్యమైన భూమి కుదించే సమస్యను పరిష్కరిస్తుంది. ICAR-IIHR బెంగళూరు పరిశోధన విజయాలు : జిప్సోఫిలా, లిమోనియం వంటి అధిక విలువ గల పంటలను స్థిరంగా ఉత్పత్తి చేయగల ఆచరణీయ సాగు వాతావరణాన్ని నెలకొల్పడానికి ICAR-IIHR బెంగళూరులో ప్రయోగాలు జరిగాయి.జెర్బెరా నాణ్యమైన పూల ఉత్పత్తి కోసం బెంగళూరులోని ICAR-IIHR లో నిలువుగా ఏర్పడిన కుండీలలో నిలువు వ్యవసాయ నమూనాలు వివిధ దిశలలో ఉంచబడ్డాయి.నిలువు వ్యవసాయం ద్వారా మొక్కల సాంద్రత, దిగుబడిలో 6 రెట్లు పెరుగుదల సాధించబడింది. నీడను ఇష్టపడే అలంకార మొక్కల ఉత్పత్తి కోసం అర్కా నిలువు వ్యవసాయ మాడ్యూల్లో ప్రభావంతమైన అంతర-స్థల వినియోగం వర్టికల్ స్ట్రక్చర్ తయారుచేయబడ్డాయి. నిలువు వ్యవసాయ నిర్మాణం ఎలా చేయాలి? నిలువు వ్యవసాయానికి ఖరీదైన యంత్రాలు అవసరం లేదు. తక్కువ ఖర్చుతో స్వయంగా నిర్మించవచ్చు. ICAR-IIHR అభివృద్ధి చేసిన 'అర్కా వర్టికల్ మాడ్యూల్' ని అనుసరించి తయారు చేయవచ్చు. కావలసిన సామాగ్రి : GI పైపులు లేదా PVC పైపులు (2 అంగుళాల వ్యాసం). కోకోపీట్ నింపిన చిన్న సంచులు. డ్రిప్ సిస్టమ్ (నీటిపారుదల కోసం) చాలా తక్కువ నీరు ఖర్చవుతుంది. 50% షేడ్ నెట్ సూర్యరశ్మిని నియంత్రించడానికి. ఒక్కో స్తంభానికి 6 నుండి 8 అడుగుల ఎత్తులో మొక్కలు పెంచవచ్చు. 100 చదరపు మీటరు జాగాలో 600 మొక్కలు నాటవచ్చు సాధారణ సాగు కంటే 6 రెట్లు ఎక్కువ. నీటి నిర్వహణ : డ్రిప్ ఇరిగేషన్ తప్పనిసరి నేల సాగు కంటే 60-70% నీరు ఆదా అవుతుంది. ఫెర్టిగేషన్ (నీటిలో ఎరువు కలిపి ఇవ్వడం) పద్ధతి ఉపయోగిస్తే ఖర్చు తగ్గుతుంది. నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల్లో పూల వ్యాపారం ఏటా 15-20% వేగంగా పెరుగుతోంది. పురుగులు, తెగుళ్ళ నిర్వహణ : నిలువు సాగులో గాలి ప్రసరణ బాగుంటుంది. తెగుళ్ళు తక్కువగా వస్తాయి. తెల్లదోమ వస్తే వేప నూనె 5 మి.లీ. 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూజు తెగులు వస్తే ట్రైకోడెర్మా విరిడి పిచికారీ సరిపోతుంది. పసుపు రంగు జిగురు అట్టలు (Yellow sticky traps) వేలాడదీస్తే పురుగులు పట్టుకుంటాయి. కోత, కోత తర్వాత నిర్వహణ : తెల్లవారు జామున కోయడం మంచిది - పూలు తాజాగా ఉంటాయి. కోసిన వెంటనే నీటి బకెట్లో పెట్టాలి - వాడిపోకుండా ఉంటాయి. కోల్డ్ స్టోరేజ్ (4-8°C) లో నిల్వ చేస్తే 2-3 వారాలు నిల్వ ఉంటాయి. లిమోనియంను పొడిగా నిల్వ చేయవచ్చు. 6 నెలల వరకు వాడవచ్చు. విజయానికి మూడు మెట్లు : సరైన రకం పంట ఎంపిక జిప్సోఫిలా, లిమోనియం ఏడాది పొడవునా మార్కెట్ ఉంటుంది. నిలువు వ్యవసాయం అనుసరించండి, తక్కువ జాగా, తక్కువ నీరు, ఎక్కువ ఆదాయం. మార్కెట్ అనుసంధానం స్థానిక పూల వ్యాపారులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లతో సంబంధాలు పెట్టుకోండి. సహాయం కోసం జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయాన్ని సంప్రదించండి. ఆధారం : వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ-పత్రికలు