హైటెక్ నర్సరీ వ్యవసాయంలో వసాయంలో మొదటిఅడుగు ఎప్పుడూ "మంచి మొక్క" తోనే మొదలవుతుంది. ఎంత సారవంతమైన భూమి ఉన్నా నాణ్యత లేని విత్తనం లేదా మొక్క వేస్తే దిగుబడి ఆశించినంతగా రాదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మాట “హైటెక్ నర్సరీ”.ఆధునిక సాంకేతిక పరికరాలు, నియంత్రిత వాతావరణం శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి తక్కువ సమయంలో, ఎక్కువ సంఖ్యలో, ఏకరీతి నాణ్యత గల మొక్కలను ఉత్పత్తిచేసే నర్సరీనే హైటెక్ నర్సరీ అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత, తేమ, గాలి, వెలుతురువంటి అంశాలను యంత్రాల సహాయంతో నియంత్రి స్తారు కాబట్టి, వాతావరణపరిస్థితులతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా మొక్కలను పెంచవచ్చు. మన రాష్ట్రంలో ప్రాముఖ్యత, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యాన పంటల విస్తీర్ణం రోజు రోజుకూ పెరుగుతోంది. నాణ్యమైన నారు/ మొక్కల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, హైటెక్ నర్సరీలు ఒక వ్యాపార అవకాశంగా మారుతున్నాయి. సొంత పంటకు మొక్కలు పెంచుకోవడమే కాక ఇతర రైతులకు నారు అమ్మి అదనపు ఆదాయం పొందవచ్చు. టిష్యూకల్చర్, గ్రాఫ్టెడ్, వైరస్ రహిత నారు ఉత్పత్తికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయి. నర్సరీ నిర్మాణం, వాతావరణ నియంత్రణ పాలీహౌస్ : UV స్టెబిలైజ్డ్ పాలిథీన్ కప్పుతో నిర్మించే నిర్మాణం వల్ల ఉష్ణోగ్రత, తేమ నియంత్రణ, వర్షం/వడగళ్ల నుంచి రక్షణ లభిస్తుంది. మొలకదశలో సున్నితమైన మొక్కలను పెంచడా నికి పాలీహౌస్ అత్యుత్తమం. షేడ్ నెట్ హౌస్ : పాలీహౌస్ కంటే తక్కువ ఖర్చుతో నిర్మించే నిర్మాణం. పైన, పక్కల నల్ల లేదా ఆకుపచ్చ రంగు నెట్ వేస్తారు. సూర్యరశ్మిని 35% నుంచి 75% వరకు తగ్గిస్తుంది. పండ్ల మొక్కల నారు, అలంకరణ మొక్కలు పెంచడానికి అనుకూలం. రక్షిత సాగు : మొక్కలను బహిరంగ వాతావరణం నుంచి రక్షించి నియంత్రిత పరిస్థితుల్లో పెంచే పద్ధతి. దీని వల్ల పురుగు మందుల వాడకం తగ్గి, తెగుళ్ల బెడద తక్కువగా ఉంటుంది. వాతావరణనియంత్రణ : ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు తగ్గించడానికి ఫాగర్స్ ఉపయోగిస్తారు. ఇవి నీటిని అతి సూక్ష్మ బిందువులుగా మార్చి గాలిలోకి వదులుతాయి, దీని వల్ల ఉష్ణోగ్రత తగ్గి, తేమ పెరుగుతుంది. పెద్ద పాలీహౌస్‌లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ప్యాడ్స్ సిస్టమ్ కూడా వాడతారు. నీటి పారుదల విధానాలు బిందు సేద్యం : ప్రతి మొక్క వేరు దగ్గరకు నేరుగా నీటిని బొట్లు బొట్లుగా అందించే పద్ధతి. నీటి వృథా చాలా తక్కువ. ఫాగర్స్ ఇరిగేషన్ : విత్తనాల ట్రేలు, చిన్నమొలకలపై సన్నని జల్లుగా నీరు చిమ్మే పద్ధతి. ఆటోమేటిక్ ఇరిగేషన్ వ్యవస్థ : టైమర్లు, సెన్సార్ల సహాయంతో నిర్ణీత సమయాల్లో ఆటోమేటిక్‌గా నీరు అందించే వ్యవస్థ. దీని వల్ల కూలీల అవసరం, నీటి వృథా రెండూ తగ్గుతాయి. మీడియా తయారీ (పాంటిగ్ మిక్స్): మొక్కలు మొలకెత్తడానికి, పెరగడానికి ఉపయోగించే మట్టి మిశ్రమాన్ని “గ్రోయింగ్ మీడియా” అంటారు కోకో పిట్ : కొబ్బరి పీచు నుంచి తయారు చేసే మెత్తటి పదార్థం. నీటిని ఎక్కువగా పట్టి ఉంచుతుంది. పెర్లైట్ : తెల్లటి తేలికపాటి రాతి రేణువులు, మట్టిలో గాలి ఆడేలా చేస్తాయి, నీరు నిలవకుండా చూస్తాయి. వర్మీకంపోస్ట్ : వానపాముల ఎరువు, మొక్కలకు సహజ పోషకాలను అందిస్తుంది. సాధారణంగా కోకో పిట్, పెర్లైట్, వర్మీకంపోస్ట్లను 3:1:1 లేదా 2:1:1 నిష్పత్తిలో కలిపి వాడతారు. ఈ మిశ్రమం వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి, తెగుళ్లు తక్కువ వ్యాప్తికి సహాయ పడుతుంది. పెట్టుబడి వ్యయం : చిన్నస్థాయి షేడ్‌నెట్ నర్సరీ (1000 చదరపు మీటర్లు) నిర్మించడానికి సుమారు రూ. 4-8 లక్షల వరకు ఖర్చవుతుంది. పూర్తి స్థాయి పాలీహౌస్ నర్సరీకి ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కచ్చితమైన అంచనా కోసం స్థానిక ఉద్యాన అధికారులను సంప్రదించాలి. ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు : సమీకృత ఉద్యాన అభివృద్ధి పధకం (MIDH) ఉద్యాన రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకం. నర్సరీ నిర్మాణం, పాలీహౌస్, షేడ్ నెట్ హౌస్‌లకు సబ్సిడీ అందిస్తుంది. జాతీయ ఉద్యాన పధకం(NHM): హైటెక్ నర్సరీలు,టిష్యూ కల్చర్యూనిట్లు, బిందు సేద్యపధకాలకు ఆర్థిక సహాయం లభిస్తుంది. నాణ్యమైన మొక్కల ఎంపిక మామిడి: ప్రాగ్ మెంటెడ్ మొక్కలనే ఎంచు కోవాలి. ఇవి 3-4 సంవత్సరాల్లోనే కాపు కాస్తాయి, తల్లి చెట్టు లక్షణాలనే కలిగి ఉంటాయి. అరటి : టిష్యూకల్చర్ మొక్కలు ఉత్తమం. వ్యాధి రహితంగా, ఏకరీతి ఎదుగుదలతో ఉంటాయి. బత్తాయి/నిమ్మ : వైరస్ రహిత (సర్టిఫైడ్) బడ్జెడ్ మొక్కలను మాత్రమే ఎంచుకోవాలి. జామ: ఎర్లీ గ్రోయింగ్ మొక్కలు మంచి దిగుబడి ఇస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ : ఆరోగ్య కరమైన కటింగ్స్ నుంచి పెంచిన మొక్కలను ఎంచుకోవాలి. టమాటా, మిర్చి, క్యాప్సికం : ప్రోట్రేల్లో పెంచిన నారు ఉత్తమం. వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా నాటుకోవచ్చు. హైబ్రిడ్ రకాలను సర్టిఫైడ్ నర్సరీల నుంచే తీసుకోవడంమేలు. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డా. యన్.వి. గౌతమ్ దీక్షితులు శాస్త్రవేత్త, (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విభాగం) ఉద్యాన పరిశోధనా స్థానం, వెంకట్రామన్న గూడెం, పశ్చిమ గోదావరి