అంతర పంటగా కందితో అధిక ఆదాయం ఒకే పొలంలో ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల పంటలను ఖచ్చితమైన వరుసలలో లేదా నిర్దిష్ట నమూనాలో సాగు చేసే వ్యవసాయ విధానాన్ని అంతర పంటల సరళి లేదా ఇంటర్ క్రాపింగ్ అంటారు. ఈ పద్ధతిలో ప్రధాన పంటల మధ్య చిన్న పంటలను వేసి, నీటి వినియోగం, నేల సారం, సూర్యకాంతి, ఇతర వనరుల వినియోగాన్ని సమతుల్యం చేయడమే లక్ష్యం.ఆంధ్రప్రదేశ్లో సాధారణ అంతర పంటసాగు పద్ధతుల్లో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ వంటి ప్రధాన పంటలను వాతావ రణం నుంచి నత్రజనిని నిల్వ చేసుకుని మట్టిలో సారాన్ని పెంచే కంది, అలసంద లేదా మినుములు వంటి అపరాలతోను, అలాగే ఆముదం వంటి నూనె గింజలతో జత చేయడం జరుగుతుంది. పరిమిత నీటి వనరులు లేదా నిర్దిష్ట నేల పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో ఈ పద్ధతి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో వేరుశనగ + దీర్ఘకాలిక కంది అంతర పంటల పద్ధతిలో 6:1 నుంచి 12:1 అనగా వేరుశనగ ప్రతి 6 లేదా 12 సాళ్ళకు 1 సాలు కంది విత్తుకోవాలి. మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను 4:1 నిష్పత్తిలో సాగు చేయాలి. వేరుశనగలో అంతర పంటగా వేసుకోవడానికి అనువైన కంది రకాలు ఎల్.ఆర్.జి. 52 (LRG-52) ఎల్.ఆర్.జి. 133-33 (LRG 133-33) లక్ష్మి (ఐ.సి.పి.ఎల్ 85063) (Lakshmi / ICPL 85063) బి.ఎస్.ఎం.ఆర్ 736 (BSMR 736) బి.ఎస్.ఎం.ఆర్ 856 (BSMR 856) అంతర పంటలతో లాభాలు కందిని ఇతర పంటల్లో అంతర పంటగా సాగుచేయడం వల్ల ఒక పంట విఫలమైనా, రెండో పంట ద్వారా కొంత ఆదాయం లభిస్తుంది. అంటే రైతుకు నష్ట భయం తగ్గి, స్థిర ఆదాయం అందుతుంది. ఒక్క పంట కంటే రెండు పంటలు కలిపి వేస్తే ఒకే భూమి నుంచి అధిక ఉత్పత్తి వస్తుంది. అంతర పంటల సాగువ్యవస్థ ప్రకృతి సమతుల్యతను కాపాడు తుంది, భూసారం, సూక్ష్మ జీవుల సంఖ్య మెరుగవుతుంది, దీర్ఘకాలికంగా పంటల స్థిరత్వం ఉంటుంది. భిన్న పంటలు కలిపి పెంచినప్పుడు. కొన్ని రకాల పురుగులు ఒక పంట నుంచి మరొక పంట మీదకి రావడం తగ్గుతుంది. ఇది పంటల ఆరోగ్యం మెరుగుపరచడంతోపాటు పురుగు మందుల వాడుక ఖర్చులను తగ్గిస్తుంది. భూమి, నీరు, ఎరువులు, సూర్యకాంతి వంటి వనరులు పరిమి తంగా ఉంటాయి. ఒకే సమయంలో వనరుల అవసరాలు వేర్వేరుగా ఉన్న రెండు భిన్నమైన పంటలను వేసినప్పుడు వనరులను సమర్థంగా ఉపయోగించవచ్చు. ఆధారం: పాడి పంటలు డా.కె.వి.శివారెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు