అరటి కర్పూర చక్కెరకేళి, బొంత, పచ్చ అరటి రకాలకు మూడవదఫా ఎరువులు వేసి తేలికపాటి తడి ఇవ్వాలి. పొటాష్ ధాతు లోపం వల్ల ఆకులు పండుబారటం గమనించినట్లయితే 5 గ్రా. సల్ఫేట్ ఆఫ్ పొటాష్‌ను లీటరు నీటికి కలిపి 7-10 రోజుల తేడాతో 2-3 సార్లు పిచికారీ చేయాలి. జామ పండుఈగ ఆశించినట్లయితే, ఈగ ఆశించిన కాయలను తోటలో నుండి ఏరి నాశనం చేయాలి. పిందె దశ దాటిన నాటి నుండి మిథైల్ యూజినాల్ ఎరలను 6-8 చొప్పున ఒక ఎకరానికి అమర్చి నెలకొకసారి పంట కాలంలో మార్చిన యెడల ఉధృతిని తగ్గించవచ్చు. పండు ఈగ ఉధృతి అధికంగా ఉన్నపుడు లీటరు నీటికి 100గ్రా. బెల్లం లేదా పులిసిన గంజి మరియు 5 మి.లీ. మలాథియాన్ కలిపి మట్టి పాత్రల్లో పోసి తోటల్లో అమర్చి కూడా పండుఈగ ఉధృతిని తగ్గించవచ్చు. దానిమ్మ పంటనాశించు కాయతొలుచు పురుగు నివారణకు చెట్టు పూత, మొగ్గ దశలో ఉన్నప్పుడే ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి, 15-20 రోజుల తరువాత కార్బరిల్ 3 గ్రా. లేదా డైక్లోరోవాస్ 1 మీ.లీ. లీటరు నీటికి కలిపి మరోసారి పిచికారీ చేసుకోవాలి. అల్లం ముందుగా నాటిన పంటలో పంటకాలం పూర్తై ఆకులు ఎండిపోవుట గమనిస్తే ఎంపిక చేసుకున్న మొక్కల నుండి దుంపలను సేకరించి విత్తనము కొరకు నిలువ చేసుకోవాలి. తక్కిన మొక్కలను త్రవ్వి దుంపలను అరబెట్టి మార్కెట్ చేసుకోవాలి. నిమ్మగడ్డి శీతాకాల ప్రారంభములో వచ్చే పూల కంకులను ఎప్పటికప్పుడు తీసివేయాలి. లేనిచో నిమ్మగడ్డి దిగుబడి తగ్గిపోవును. అవసరాన్ని బట్టి నీటితడులు మరియు కలుపు నివారణ చేపట్టాలి. గులాబి బూడిద తెగులు నివారణకు 1 గ్రా. కెరాథేన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చామంతి పూర్తిగా విచ్చుకున్న పూలను తెంపి మార్కెట్‌కు తరలించాలి. రసంపీల్చే పురుగుల నివారణకు 1 గ్రా. అసిఫేట్ లేదా 2 మి.లీ. డైమిథోయేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మల్లె కొమ్మలు కత్తిరించి, ఆకులు దూసి నీరు కట్టుట ఆపివేయాలి. బంతి ప్రధాన కొమ్మల చివర్లు తుంచి సిఫారసు చేసిన ఎరువులను వేయాలి. కొబ్బరి గత నెలలో ఎరువులు వేయనట్లయితే, ఎరువులు వేసి, అవసరమైనచో నీరు పెట్టవలెను. కొబ్బరిపై ఆశించు నల్లముట్టె పురుగు, మొవ్వు కుళ్ళు మరియు నల్ల మచ్చ తెగులు ఉనికిని పరిశీలిస్తూ ఉండాలి. తమలపాకు మొదటి సంవత్సరపు తోటలలో తీగలు పెరగటానికి వీలుగా తీగలను జమ్ముతో అవిశ మొక్కలకు కట్టి పాకించాలి. వేగంగా వీచే గాలులకు అవిశ మొక్కలు పడిపోకుండా వీటిని ఒకదానికొకటి తాడుతో కట్టి సాలు చివర నాటిన వెదురు గడలకు కట్టాలి. మునగ గింజలు విత్తిన 3 నెలలకు అంటే ఈ నెలలోఒక్కొక్క గుంతకు 100 గ్రా. యూరియా, 50 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి నీటిని ఇవ్వాలి. మునగలో వరుసల మధ్య అంతర పంటలుగా అలసంద, బెండ, వంగ, ఫ్రెంచి చిక్కుడు వంటి పంటలను వేసుకోవచ్చు. నేల సంపంగి రెండవ దఫా ఎరువులను వేయాలి. రసాయనిక పురుగు మందులను పిచికారి చేయరాదు. పిల్ల పురుగుల ఉధృతి అధికంగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం లేదా 3 మి.లీ. వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక రైతు సలహా కేంద్రం, ఉద్యాన విశ్వ విద్యాలయం, వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి.