మన రాష్ట్రంలో కొబ్బరి లో సరైన యాజమాన్య చర్యలు చేపట్టకపోవడం వల్ల తోటల్లో పోషక లోపాలు కనబడ డంతో పాటు, దిగుబడిలో నాణ్యత పై ప్రభావం పడుతోంది. కొబ్బరి తోటల్లో సమస్యలు పిందె రాలడం : పూతనిచ్చే చెట్లలో పిందె రాలడం గమనిస్తాం. ముఖ్యంగా ఇది బోరాన్ లోపం వల్ల జరుగుతుంది. అలాగే పొటాష్ ఎరువు లోపం వల్ల కూడా జరుగుతుంది. బోరాన్, పొటాష్ లోపాల వల్ల కాయలు ఎదగక చాలా చిన్నవిగా, తట్టుగా ఉండిపోతాయి. కొబ్బరిలో ముఖ్య పోషకాలు వాటి పాత్ర నత్రజని : కొబ్బరిలో మొక్కల ఎదుగుదలకు, త్వరగా పొత్తు రావడానికి నత్రజని ముఖ్యపాత్ర వహిస్తుంది. కాపునకు వచ్చిన చెట్లలో నత్రజని, పొటాష్ తో కలిపి సమపాళ్ళలో వేస్తే దాదాపు 28% కాయ దిగుబడి పెరుగుతుంది. భాస్వరం : లేత కొబ్బరి మొక్కల్లో మొదలు లావుగా, ధృఢంగా పెరగడానికి, ఎక్కువ ఆకులు ఏర్పడడానికి భాస్వరం ఉపయోగపడుతుంది. అందువల్ల మొక్కలు పొలంలో నాటేటప్పుడు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు భాస్వరం 250 గ్రా మట్టితో కలిపి, మొక్కను నాటినట్లయితే మొక్కలు ధృఢంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాపుకు వచ్చిన చెట్టుకు భాస్వరాన్ని నత్రజని, పొటాష్ ఎరువులతో వేసినప్పుడు వేరు బాగా తొడిగి భూమిలో ఉండే నత్రజనిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది. పొటాష్ : కొబ్బరిలో అతి ముఖ్యమైన స్థూల పోషకం. దీనివల్ల మొక్కలు త్వరగా కాపునకు వస్తాయి. పొత్తుల సంఖ్య పెరిగి, కాపు నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాయల్లో కొబ్బరి, నూనె దిగుబడి పెరుగుతుంది. పొటాష్ కారణంగా మొక్కలు చీడపీడలు, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. పోషక లోప లక్షణాలు నత్రజని : నత్రజని లోపం ముదురు ఆకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. కింద ఉన్న ముదురు ఆకులు పసుపు రంగులోకి మారతాయి.భాస్వరం : లోపం వల్ల పొత్తులు రావడం ఆలస్యం అవుతుంది. అంతే కాక కాయలు పక్వానికి రావు.పొటాష్ : పొటాష్ లోపించినప్పుడు ముఖ్యంగా కింది ముదురు ఆకుల్లో ఈ నెలకిరువైపులా ఉండే ఆకు భాగం పైన, అక్కడక్కడా లేత ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా అవి పెద్దవై నారింజ, పసుపు రంగుకు మారి తర్వాత గోధుమ లేదా తుప్పు రంగు మచ్చలుగా ఏర్పడతాయి. ఆకులు క్రమంగా పసుపుబారతాయి. చెట్లు పొట్టిగాను, ఆకులు చిన్నవిగాను ఉంటాయి. చెట్లు ఆలస్యంగా కాపుకు వస్తాయి. కాయలు తక్కువగా, చిన్నవిగా ఉంటాయి. దెయ్యపు కాయలు, తట్టు కాయలు ఏర్పడడానికి పొటాష్ లోపమే ప్రధాన కారణం.బోరాన్ : లోపం లేత ఆకుల్లో కనిపిస్తాయి. దీని లోపం వల్ల మొవ్వ ఆకులు విడవక, ముద్దగా మధ్యలోనే ఉండి పోతాయి. కాయ ఎదుగుదల ఉండదు. కాయలు చిన్నగా ఉండి లోపల కొబ్బరి ఏమాత్రం ఏర్పడదు.మెగ్నీషియం : లోపం ముదురు ఆకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆకు ఈనెలు ఆకుపచ్చ రంగులో ఉండి మిగిలింది పసుపు రంగులోకి మారు తుంది. కొన నుంచి ఆకు మీదకు పసుపు రంగు వ్యాపిస్తుంది.మాంగనీసు : ఆకుల్లో కనిపిస్తుంది. చౌడు నేలల్లో మాంగనీసు లోపం కనిపిస్తుంది. దీని లోపం బోరాన్, పొటాష్ మాదిరిగా ఒకే రకమైనవిగా కనబడతాయి. ఇనుపధాతు : ఎక్కువగా నీరు నిలబడే నేలల్లో కనబడుతుంది. కొత్త ఆకులు పచ్చదనాన్ని కోల్పోతా యి. ఆకుల చివర్లు ఎండి పోయినట్లు ముదురు గోధు మ రంగులో కన్పిస్తాయి. కొబ్బరిలో ఈ విధంగా ప్రతి పోషకం సరైన మోతాదులో సరైన సమయానికి మొక్కకు అందించినట్లయితే చెట్టుకు గెలలు బాగా ఏర్పడి, కాయల సంఖ్య పెరుగుతుంది. ఎరువుల యాజమాన్యం పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువు, వర్మి కంపోస్టు వంటివి వాడడం వల్ల నేల ఆరోగ్యం బాగుంటుంది. సిఫార్సు చేసిన ఎరువులు 1-4 ఏళ్ల చెట్టుకు ఒక్కో చెట్టుకు అర కిలో యూరియా, కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తో పాటు 20 కిలోల పశువుల ఎరువు వేయాలి. ఐదేళ్ళు దాటిన చెట్టుకు (కాపు కాసే చెట్టుకు) కిలో యూరియా, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2.1/2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 25 కిలోల పశువుల ఎరువు, లేదా 2 కిలోల వేప పిండి సంవత్సరానికి ఒకో చెట్టుకు వేయాలి. పోషక అవసరాన్ని బట్టి బోరాక్స్ 100 గ్రా. ఒక్కో చెట్టుకు సంవత్సరానికి మొక్క మొదళ్ళ వద్ద వేయాలి. అవసరాన్ని బట్టి మెగ్నీషియం సల్ఫేట్ 200గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ 50 గ్రా. ఒక్కో చెట్టుకి మొదళ్ళ వద్ద వేసి మట్టితో కప్పివేయాలి. మొక్కలకు ఉప్పు వేయడం, వేర్లు నరకడం వంటివి చేయరాదు. ఈ విధంగా ఎరువుల యాజమాన్యం చేపడితే పిందె రాలడం, తట్టు కాయలు ఏర్పడడం తగ్గుతుంది. చెట్టు ఏపుగా పెరిగి నాణ్యమయిన పూత, కాత వస్తుంది. ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ పళ్ళెంలో వేసినప్పుడు అవి నేలలో ఇంకి, వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది. ఆధారం : పాడిపంటలు మాస పత్రిక డా.వి.హరికుమార్ శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం) కె.వి.కె, ఆముదాలవలస, శ్రీకాకుళం.