తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పండించే జొన్న రకాలు- పరిస్థితులు వానాకాలంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే, ఎర్ర చెల్కా నేలలు గల మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణ్పట్, గద్వాలలోని కొన్ని ప్రాంతాల్లో పచ్చజొన్న రకాలు సాగుకు అనువైనవి.యాసంగి కాలంలో నీటి పారుదల కింద, ఎర్ర నేలలు, మధ్యస్థ బరువు నేలలు గల కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలలోని మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో సంకరజాతి తెల్లజొన్న, ఎర్రజొన్న, తీపిజొన్న రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. యాసంగిలో అవశేష తేమ కింద బరువైన నల్లరేగడి భూములు గల సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లో, నారాయణ్్పట్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లజొన్న, మేత జొన్న, పశుగ్రాస జొన్న రకాలు అనుకూలంగా ఉంటాయి. ఆలస్యంగా విత్తుకునే ప్రాంతాల్లో ప్రధానంగా నీటి వసతి ఉన్న మధ్యస్థ నల్లరేగడి, ఎర్ర నేలలు గల ప్రాంతాలో వరి సాగు అనంతరం, పత్తి తీసిన తర్వాత నేలను దున్ని తక్కువ పోషకాలతో హైబ్రిడ్ జొన్న, తీపి జొన్నలను కామారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలు అనువైనవిగా చెప్పవచ్చు. పచ్చజొన్న తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన మంచి రొట్టె నాణ్యత కలిగి నీటి ఎద్దడిని తట్టుకునే గుణం కలిగి ఉండడం, చక్కెర వ్యాధిగ్రస్తులకు కూడా వారి ఆహారంలో చేర్చుకునే విధంగా ఉండడం వల్ల మార్కెట్లో మద్దతు ధరకన్నా ఎక్కువగా వినియోగదారులు కొనగలిగే, భవిష్యత్తులో మరిన్ని పచ్చజొన్న ఉప ఉత్పత్తులను తయారు చేసుకోగలిగే మార్కెట్ డిమాండ్ పెరిగే పచ్చజొన్న రైతులకు లాభదాయకంగా ఉంటుంది. మేలైన రకాలు : పాలెం పచ్చజొన్న-1 రకం. తెల్లజొన్న ఈ జొన్న రకాలు గింజ నాణ్యత అధికంగా ఉండి రొట్టెల తయారీకి, జొన్న ఉప ఉత్పత్తుల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ జొన్న రకాలు ప్రధానంగా యాసంగిలో తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో కూడా, ఆలస్యంగా కూడా, వానాకాలం పంటల అనంతరం అధిక గింజ దిగుబడినిచ్చే రకాలు గానీ, సంకరజాతి రకాల్ని రైతులు సాగుకు ఉపయోగించవచ్చు. నూతనంగా అభివృద్ధి చేసిన పర్బాణి శక్తి జొన్న (తెల్లజొన్న) రకంలో 42 మి.గ్రా. ఐరన్, 25మి.గ్రా. జింక్ (కిలో విత్తనంలో) కలిగి ఉన్న రకాలు మేలైనవి. చొప్పకు కూడా అనుకూలం. మేలైన రకాలు : రకాలు సి.ఎస్.వి .29 ఆర్., తాండూరు జొన్న-1, తాండూరు జొన్న-55, ఎం.-35-1 మొదలైనవి.హైబ్రిడ్స్ - సి.ఎస్.ఎచ్.-15 ఆర్, సి.ఎస్.ఎచ్.-41, సి.ఎస్.ఎచ్.-35, హైటెక్, మహాలక్ష్మీ మొదలైనవి. తీపిజొన్న ఈ తీపిజొన్న కాండాలలో (10-15 శాతం) చక్కెలను నిలువ చేసుకునే స్వభావం కలిగి ఉంటుంది. తీపిజొన్న నుండి రసం తీసిన తర్వాత దీని పిప్పి అధిక క్యాలరీ విలువలను కలిగి ఉండడం వల్ల హెక్టారుకు 2.25 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. పిప్పిని తగిన ప్రాసెసింగ్ చేసిన తర్వాత పశుగ్రాసంగా, సెల్యులోసిక్ ఇథనాల్ ఉత్పత్తికి మూల పదార్థంగా ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ జీవ ఇంధన పంటగా, ఇతర అధిక కెలోరిఫిక్ గుణం కలిగిన వాయువులను ఉత్పత్తి చేయడం ద్వారా రాబోయే కాలంలో జీవ ఇంధనం అభివృద్ధి, తద్వారా పర్యావరణ, ఆర్థిక అవసరాలు, సామాజిక ప్రయోజనాల్లో అధిక ప్రాధాన్యతనిస్తుంది. మేలైన రకాలు : ఎస్.ఎస్.వి-96, .జి.ఎస్.వి.-148, ఆర్.ఎన్.వి.48, సి.ఎన్.వి.19ఎన్.ఎన్., సి.ఎస్.ఎచ్.22 ఎస్.ఎస్., సి.ఎస్.వి. 24 ఎస్.ఎస్. రకాలు. ఆధారం: పాడిపంటలు , వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్.