సరైన శుద్ధి నిల్వ తోనే పంట నాణ్యతకు రైతు ఆదాయానికి రక్షణ వ్యవసాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థ కు పునాది. రైతు తన శ్రమ, సమ యం, పెట్టుబడిని వినియోగించి పంటను పండిస్తాడు. అయితే పంట పండించిన తర్వాత సరైన నిర్వహణ లేకపోతే గణనీయమైన నష్టం సంభవిస్తుంది. అనేక పరిశోధనల ప్రకారం, కోత అనంతర దశలోనే 10-35% వరకు పంట నష్టం జరుగుతుంది. ఇది రైతుల ఆదాయాన్ని తగ్గించడమే కాకుండా దేశ ఆహార భద్రతపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో “కోత అనంతర యాజమాన్యం” అనేది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సరైన పద్ధతులు అనుసరించడం ద్వారా రైతులు తమ ఉత్పత్తి విలువను పెంచుకోవచ్చు. నష్టాలను తగ్గించు కోవచ్చు, స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. కోత అనంతర యాజమాన్యం కోత అనంతర యాజమాన్యం అనగా కోత, ఎండబెట్టడం, శుభ్రపరచడం, గ్రేడింగ్, నిల్వ, రవాణా, మార్కెటింగ్ వంటి దశలు ఉంటాయి. పంటను కోసిన తర్వాత అది వినియోగదారుని చేతికి చేరే వరకు జరిగే అన్ని చర్యల సమాహారం. ఈ దశలన్నింటినీ శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా పంట నాణ్యతను కాపాడు కోవచ్చు. ఈ ప్రక్రియ రైతుకు రెండు విధాలుగా ఉపయోగ పడుతుంది. ఒకటి నష్టాలను తగ్గించడం ద్వారా ఆదాయం పెరగడం, రెండవది ఉత్పత్తికి అధిక మార్కెట్ విలువ రావడం. కోత దశ-శాస్త్రీయ దృక్పథం పంట కోత అనేది మొత్తం వ్యవసాయ ప్రక్రియలో కీలక దశ. సరైన సమయంలో కోత చేయకపోతే దిగుబడి, నాణ్యత రెండూ దెబ్బతింటాయి. పంట పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే కోత అనేది పూర్తిచేయాలి. ముందుగా చేస్తే గింజలు పక్వానికి రాకపోవడం వల్ల నాణ్యత తగ్గుతుంది. ఆలస్యంగా చేస్తే గింజలు రాలిపోవడం, పురుగుల దాడి వంటి సమస్యలు ఎదురవుతాయి. కోత సమయంలో వాతావరణ పరిస్థితులు కూడా ముఖ్యమైనవి. తడి పరిస్థితుల్లో చేయడం వల్ల పంటలో తేమ ఎక్కువగా ఉండి నిల్వలో సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల పొడి వాతావరణంలో కోత చేయడం ఉత్తమం. యంత్రాల వినియోగం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు నష్టం కూడా తగ్గుతుంది. ఎండబెట్టడం- నిల్వకు పునాది పంటలో తేమ అధికంగా ఉంటే ఫంగస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. ఇది పంట నాణ్యతను దెబ్బతీస్తుంది. అందువల్ల కోత అనంతరం వెంటనే పంటను ఎండబెట్టడం అత్యంత అవసరం. ఆధునికంగా యాంత్రిక డ్రైయర్లను ఉపయోగించడం ద్వారా సమానంగా, త్వరగా తేమ తగ్గించవచ్చు. ధాన్యాలకు సాధారణంగా 12–14 శాతం తేమ స్థాయి అనుకూలంగా ఉంటుంది. శుభ్రపరచడం, గ్రేడింగ్-నాణ్యతకు గుర్తింపు కోత అనంతరం మట్టి, రాళ్లు, చెత్త వంటి పదార్థాలు పంట ఉత్పత్తి నాణ్యతను తగ్గిస్తాయి. అందువల్ల శుభ్రపరచడం ద్వారా ఈ పదార్థాలను తొలగించడం అవసరం. గ్రేడింగ్ అనేది పంటను పరిమాణం, రంగు, బరువు ఆధారంగా వర్గీకరించడం. గ్రేడింగ్ చేసిన పంటకు మార్కెట్లో అధిక ధర లభిస్తుంది. ముఖ్యంగా ఎగుమతుల కోసం గ్రేడింగ్ చాలా అవసరం. నిల్వ పద్ధతులు-నష్ట నివారణలో కీలకం కోత అనంతర నష్టాలలో ప్రధాన భాగం నిల్వ దశలోనే జరుగుతుంది. సరైన నిల్వ సదుపాయాలు లేకపోతే పంట తేమకు గురవుతుంది. పురుగులు, ఎలుకలు దాడి చేస్తాయి. సాంప్రదా యంగా గోనెసంచులు, గిడ్డంగులు ఉపయోగిస్తారు. అయితే ఆధునికంగా హర్మెటిక్ స్టోరేజ్ (గాలి తగలకుండా), సైలోస్, కోల్డ్ స్టోరేజ్ వంటి పద్ధతులు అభివృద్ధి చెందాయి. ఇవి పంటను ఎక్కువ కాలం సురక్షితంగా నిల్వ చేయడానికి సహాయపడతాయి. నిల్వలో గాలి, తేమ, ఉష్ణోగ్రత నియంత్రణ చాలా ముఖ్యం. గోదాములను శుభ్రంగా ఉంచడం, ఫ్యూమిగేషన్ చేయడం వంటి చర్యలు అవసరం. పంటలవారీగా కోత అనంతర నిర్వహణ ధాన్య పంటలు వరి వంటి పంటలలో కోత తర్వాత వెంటనే ఎండబెట్టడం అత్యంత ముఖ్యం. తేమ తగ్గించిన తరువాత నిల్వ చేయాలి. మిల్లింగ్ సమయంలో కూడా నష్టం తగ్గించే పద్ధతులు పాటించాలి. కోత సమయాన్ని సరిగ్గా నిర్ణయించాలి (తేమ సుమారుగా 20-24% ఉన్నప్పుడు). పంట కోసిన తరువాత పాడవకుండా ఉండ టానికి తేమను 15-17% లోపలికి తగ్గించాలి. నిల్వ సమయంలో అవసరమైతే ఫ్యూమిగేషన్ చేయాలి. సుగంధ ద్రవ్యాలు దేశంలో ఉత్పత్తయ్యే మిరపకాయలలో 15% ఒక్క గుంటూరు జిల్లా మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. మిరపను గోతాలలో తొక్కే చాకిరీని నివారించడాని నికి ఆచార్య ఎన్.జి. ఎండు మిరపను రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్, బాపట్ల శాస్త్రవేత్తలు గోతాలలో తొక్కే యంత్రాన్ని రూపొందించారు. మిరపను తొక్కేకూలికి చాకిరి తగ్గును, పని చేసే కూలీలకు కాళ్ళ మంటలు, తుమ్ములు, కళ్ళ మంటలు రాకుండుట, అధిక సామర్థ్యం (రోజుకు 160 టిక్కీలు / గోతాలు), తక్కువ ఖర్చు (టిక్కీకి రూ.12/- ఆదా), ఉపాధి కల్పనకై వాడవచ్చును. ఆధునిక సాంకేతికతలు ఇటీవలి కాలంలో ఐ.ఓ.టి. ఆధారిత నిల్వ వ్యవస్థలు, ఆటోమేటెడ్ డ్రైయర్లు, స్మార్ట్ ప్యాకేజింగ్ వంటి సాంకేతికతలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పంట నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. రైతులకు సమగ్ర సూచనలు రైతులు పంట కోత అనంతరం వెంటనే సరైన చర్యలు తీసుకోవాలి. శాస్త్రీయ పద్ధతులు నేర్చుకోవాలి. మార్కెట్ సమాచారం తెలుసుకోవాలి. విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. నిల్వ సదుపాయాలను మెరుగుపరచాలి. కోత అనంతర యాజమాన్యం రైతు ఆర్థిక స్థితిని బలోపేతం చేసే ప్రధాన సాధనం. పంట పండించడం ఎంత ముఖ్యమో, దాన్ని సురక్షితంగా నిల్వ చేసి మంచి ధరకు అమ్మడం కూడా అంతే ముఖ్యం. శాస్త్రీయ పద్ధతులు అనుసరించడం ద్వారా రైతులు తమ శ్రమకు పూర్తి ఫలితం పొందవచ్చు. ఆధారం: పాడి పంటలు