పండ్ల తోటలు అరటి తల్లి మొక్క చుట్టూ వచ్చే పిలకల కోతకు ఉపయోగించు కొడవలిని ప్రతీసారీ ముందుగా డీజిల్/కిరోసిన్లో ముంచి వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని నివారించాలి. వైరస్ తెగులు వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు మిథైల్ డెమటాన్ 2 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చ అరటి, కొవ్వూరు బొంత, కర్పూర చక్కెరకేళి రకాలకు రెండవ దఫాగా 110 గ్రా. యూరియా, 80 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇచ్చి తేలికపాటి తడి ఇవ్వాలి. తేలిక నేలల్లో నులిపురుగుల నివారణకు మొక్కకు పశువుల ఎరువుతోపాటు ఒక్కొక్క మొక్కకు 250 గ్రా. వేపపిండి + 25 గ్రా. పాసిలోమైసిన్ లిలేసినస్ శిలీంద్రము లేదా 20-30గ్రా ప్లూయెన్ సల్ఫోన్ గుళికలు ప్రతి మొక్కకు వేసుకోవచ్చును. జామ కాయలు పెరిగే దశలో నీటి తడులు ఇవ్వాలి. తొడిమ కుళ్ళు తెగులు నివారణకు 1% బోర్డోమిశ్రమం లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. బొప్పాయి నారు పెంపకము: ఎకరాకు డైయిషియస్ రకాలకు 200 గ్రా. మరియు గైనోడైయిషియస్ రకాలకు 20 గ్రా. విత్తనం కావాలి. విత్తనాన్ని 22.5×15 2.2. 150 గేజ్ మందం గల పాలిథీన్ సంచులలో పశువుల ఎరువు, ఇసుక కలిపిన మట్టితో నింపి నాటాలి. విత్తనాలను 1 సెం.మీ. లోతు మించకుండా విత్తుకోవాలి. నారుమడిలో వైరస్ తెగుళ్ళు సోకకుండా నారును రసం పీల్చే పురుగులు చొరబడని వల లోపల పెంచాలి లేదా అవిశ మొక్కలను విత్తనం నాటే 15 రోజుల ముందు నారుమడి చుట్టూ నాటుకోవాలి. కొబ్బరి ఎర్రముక్కు పురుగు, మొవ్వు కుళ్ళు మరియు వల్లమచ్చ తెగులు ఉనికిని పరిశీలిస్తూ ఉండాలి. తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కూరగాయ పంటలు బెండ, టమాట, వంగ పంటల్లో సిఫార్సు చేసిన నత్రజని ఎరువులను వేసుకొని నీరు పెట్టాలి. ఈ పంటలలో వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. రసం పీల్చే పురుగుల నివారణకు ఫాసలోన్, ఫిప్రోనిల్ మందుల్లో ఏదైనా ఒక మందును లీటరు నీటికి 2 మి.లీ.ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1.5 గ్రా. ఎసిఫేట్ను 1 లీ. నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.తీగ జాతి కూరగాయలను ఆశించే బూడిద తెగులు నివారణకు కెరాథేన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పండు ఈగ నివారణకు 2 మి.లీ. మలాథియాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా మలాధియాన్ 100 మి.లీ. 100 గ్రా. చక్కెర లేదా బెల్లం + 10 లీ. నీరు కలిపి విషపు ఎర తయారు చేసి మట్టి మూకుడులో/ప్లాస్టిక్ పళ్ళాలలో పోసి ఎకరాకు 10-12 మూకుడులను అక్కడక్కడ పెట్టాలి.కంద: ఇనుపధాతు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5 గ్రా. అన్నభేది, 1 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. పూలతోటలు చామంతి నాటిన 30 రోజులకు తలను తుంచి వేయాలి. పువ్వు పరిమాణాన్ని పెంచటానికి పక్క నుండి వచ్చిన పూ మొగ్గలను తుంచివేసి మధ్య వున్న మొగ్గల పరిమాణం పెరిగేటట్లు చూడాలి. కలుపు రాకుండా మొక్కల మధ్య ఎండుటాకులు లేదా ఎండుగడ్డిని కప్పాలి.నేల సంపంగి (లిల్లీ) తోటలలో ఎకరాకు 27 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం మరియు పొటాష్ నిచ్చే ఎరువులను పైపాటుగా వేయాలి. కొద్దిగా విచ్చిన పూలను తెంపి వెదురుబుట్టలలో ఉంచి మార్కెట్కు తరలించాలి. ఆధారం: రైతు సలహా కేంద్రం, ఉద్యాన విశ్వ విద్యాలయం, వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి.