పండ్ల తోటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పండ్ల తోటల్లో ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు చేసుకోవాల్సి వివిధ యాజమాన్య పద్ధతుల గురించి చూద్దాం. పండ్ల తోటల్లో ప్రస్తుతం కొమ్మ కత్తిరింపులు, ఎరువులు యాజమాన్యం, కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యం, చీడపీడ యాజమాన్య పద్ధతులు చర్యలు పాటించటం ద్వారా రైతులు నాణ్యమైన పండ్లతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చు. పండ్ల తోటల్లో కొమ్మ కత్తిరింపులు పండ్ల మొక్కల్లో కొమ్మ కత్తిరింపులు కచ్చితంగా పాటించవలసిన యాజమాన్య పద్ధతి. కొమ్మ కత్తిరింపుల వల్ల దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. కారణం ఏమిటంటే అధిక సూర్యరశ్మి మొక్క లోపలి భాగాలకు చొరబడి మొక్క ఎదుగుదల బాగుంటుంది. అలాగే చీడపీడలు కూడా నివారించబడతాయి, ముఖ్యంగా శాఖీయ, పూల భాగాల మధ్యన సమన్వయం ఏర్పడి అధిక ఫల సాయం పొందవచ్చు. ఎండిన, వ్యాధి సోకిన కొమ్మలు కూడా తీసివేస్తారు. ప్రధానంగా మామిడి, జామ, ద్రాక్ష నిమ్మ, దానిమ్మ, రేగు, సీతాఫలం, సపోట వంటి పంటల్లో కొమ్మ కత్తిరింపులు అవసరమవుతాయి. కొమ్మ కత్తిరింపులు చేసే సమయం పంటను బట్టి మారుతు ఉంటుంది. ఉదాహరణకి మామిడిలో పంట కోసిన వెంటనే లేదాపంట కోసిన 15 రోజుల తర్వాత కొమ్మ కత్తిరింపులు చేయాలి. అదేవిధంగా జామ, దానిమ్మలు పంటకు వదిలే 15 నుంచి 30 రోజుల ముందుగా కొమ్మ కత్తిరింపులు చేయాలి. సీతాఫలం, రేగులో వేసవికాలంలో కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. కొమ్ము కత్తిరింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొమ్మ కత్తిరింపులు చేసే పరికరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కత్తిరింపు పరికరాలను సోడియం హైపోరేట్ ద్రావణంలో లేదా బ్లీచింగ్ పౌడర్ ద్రావణంలో ముంచిన తర్వాతనే మళ్లీ వాడుకోవాలి. లేదంటే ఒక తోట నుంచి ఇంకో చోటికి రోగ కారక శిలీంధ్రాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కత్తిరింపులు అయిన వెంటనే కత్తిరింపు భాగాన్ని బ్లైటాక్స్ పేస్ట్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ పేస్ట్ తో పూత పూయాలి. అధిక వర్షం ఉన్న సమయంలో కొమ్మ కత్తిరింపులు చేయరాదు. పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్యం పండ్ల తోటలకి రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసుకోవాలి. పచ్చిరొట్ట అయినటువంటి జనుము, జిలుగ, పిల్లి పెసర ఎకరాకు 45 నుంచి 50 రోజుల మధ్యలో పూత సమయంలో పొలంలో కలియదున్నాలి. పచ్చిరొట్ట ఎరువుల ద్వారా నేల సేంద్రియ శాతం పెరుగుతుంది. వర్షాకాలం మొదల్లో పచ్చిరొట్ట వేసుకోవాలి. వీటితోపాటు మొక్కకి పోషకాలు అందించే నత్రజని, భాస్వరం, పొటాష్, వివిధ రూపాల్లోఅనగా యూరియా, సూపర్, మురేట్ అఫ్ పొటాష్ వేసుకోవాలి. మామిడిలో మొక్కకి రెండు కేజీల యూరియా, 6 కేజీల సూపర్ ఫాస్ఫేట్ ఒక కేజీ 600 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. అదేవిధంగా జామలో మొక్కకి ఒక కేజీ యూరియా 2500 గ్రాముల సూపర్ ఫాస్పేట్ 800 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాస్ వేసుకోవాలి. పండ్ల తోటల్లో వాడాల్సిన వివిధ సూక్ష్మ పోషకాలు పండ్ల తోటల్లో సూక్ష్మ పోషకాలు మొక్క పెరుగుదలలో, పూత, పిందె, కాయ నాణ్యతలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మార్కెట్లో ఫార్ములా 4 లేదా 7 అనే సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. సూక్ష్మ పోషకాలు అయినటువంటి బోరాన్, జింక్ మొక్కలో పూ మొగ్గ రావటానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. బోరాన్, జింక్ లీటర్ నీటికి ఒక్క గ్రాము కలిపి మొక్కల ఆకులపై పిచికారీ చేయాలి. పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం పండ్ల తోటల్లో కలుపును వివిధ పద్ధతుల ద్వారా నివారించవచ్చు. ఒకటి యాంత్రీకరణ పద్ధతి ద్వారా అంటే ట్రాక్టర్ తో దున్నటం ద్వారా మొక్కల మధ్యలో ఉన్న కలుపు నివారించుకోవచ్చు. ఆచ్ఛాదనం అంటే మల్చింగ్ ద్వారా కలుపును తగ్గించవచ్చు. మొక్క పాదుల దగ్గర వరిగడ్డి గాని లేదా వేరుశనగ పొట్టు వంటి పంట వ్యర్థాలను పరచి కలుపు రాకుండా నివారించుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువులు ద్వారా కూడా కలుపును నివారించవచ్చు. వివిధ రసాయనిక కలుపు మందులు అనగా పారాక్వాట్ లీటరు నీటికి 5 మీ.లి లేదా అట్రాజిన్ 800 గ్రా. 240 లీటర్ల నీటికి లేదా ఆక్సిప్లోరోఫెన్ 1 మి. లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. కానీ మందులు పిచికారీ. చేసేటప్పుడు మందు తుంపర పండ్ల మొక్కలపై పడకుండా చూసుకోవాలి. పండ్ల తోటలో చీడపీడల యాజమాన్యం పండ్ల తోటల్లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకరకాల చీడపీడలు ఆశిస్తాయి. ఉదాహరణకు దానిమ్మలో బ్యాక్టీరియల్ మచ్చ తెగులు, అరటిలో సిగటోక తెగులు ఆశించే అవకాశం ఉన్నది. కావున రైతులు వర్షాలు తగ్గిన వెంటనే ఒకసారి కార్బెండజిం అనే మందును లీటర్ నీటికి ఒక గ్రాము లేదా మెటల్ ఆక్సిజన్ మాంకొజేబ్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మచ్చ తెగులు నివారించవచ్చు. ప్రస్తుతం జామలో పండుగ నివారణకు మిథైల్ యూజీనాల్ లింగకర్షక ఎరబుట్టలు పెట్టి నివారించుకోవచ్చు. ఎకరాకు 6 నుంచి 8 చొప్పున అమర్చినట్లయితే ఇందులో మగ ఈగలు ఆకర్షించబడి చనిపోతాయి. ఈ విధంగా పండు ఈగ వృద్ధిని నివారించవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మలాథియాన్ మందును లీటర్ నీటికి రెండు మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసినట్లయితే పండు ఈగ వృద్ధిని తగ్గించుకోవచ్చు. వర్షాకాలంలో దానిమ్మలో బ్యాక్టీరియాల్ మచ్చ తెగులు ద్వారా దాదాపుగా 90% పంట నష్టపోయే అవాకాశం ఉంది. దానిమ్మలో ఈ తెగులు నివారణకు కొమ్మ కత్తిరింపుల తర్వాత నేలపై బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలి లేదా పిచికారీ చేయాలి. తద్వారా బ్యాక్టీరియా అవశేషాలు నివారించవచ్చు, కొమ్మ కత్తిరింపుల అనంతరం మొక్కపై ఒక శాతం బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీ క్లోరెడ్ 3 గ్రాములు, ప్లాన్టోమైసీన్ 0.5 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లు అయితే నివారించుకోవచ్చు. సరైన పద్ధతిలో ఎరువుల యాజమాన్యం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఈ తెగులను తట్టుకునే అవకాశం ఉంటుంది. పండ్ల తోటల్లో మంచి రకాలు నిమ్మలో బాలాజీ నిమ్మ లేదా పెట్లూరు నిమ్మ రకాలు కాయమచ్చ తెగులు తట్టుకుంటాయి. దానిమ్మలో భగ్వా, జామలో అలహాబాద్ సఫేదా తైవాన్ పింక్, బొప్పాయిలో రెడ్ లేడీ ఇలాంటి రకాలు మనం సాగు చేసుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు. ఆధారం: పాడిపంటలు డా.పి.పెద్ద నాగిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన విభాగం. శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల, తిరుపతి